ఇక్కడ దేవుళ్ళంటే ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమే

అనేక గిరిజన గ్రామాల్లో ఏడుదశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత కూడా విద్యుత్ లేదు, రోడ్లు లేవు, రక్షిత మంచినీరు లేదు, పక్కా ఇళ్ళు లేవు అని చెప్పుకోడానికి సిగ్గుపడాలి. [more]

Update: 2020-05-28 11:00 GMT

అనేక గిరిజన గ్రామాల్లో ఏడుదశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత కూడా విద్యుత్ లేదు, రోడ్లు లేవు, రక్షిత మంచినీరు లేదు, పక్కా ఇళ్ళు లేవు అని చెప్పుకోడానికి సిగ్గుపడాలి. కిరసనాయిలు గుడ్డి దీపాలే వెలుగు. కాలినడకే రహదారి. పూరిగుడిసే ఇల్లు. ఇదీ చాలా గిరిజన ఆవాసాల పరిస్థితి. ఇప్పటికీ అనేక ఆవాసాలు ఇలానే ఉన్నాయి. ఈ ఆవాసాలను మొదట చూసింది ఎన్టీఆర్. బహుశా కొన్ని సినిమాల్లో గిరిజన ప్రజలతో తిరగడం, గిరిజన తండాలు చూసి, వారి బాధలు, గాధలు విని ఉండడం వల్లనేమో చాలా గ్రామాలకు ఆయన కిలో రెండురూపాయల బియ్యం పధకం ద్వారా అన్నం పెట్టారు. ఈ జనం ఇప్పటికీ ఎన్టీఆర్ ను దేవుడుగానే చూస్తారు. ఆరాధిస్తారు కూడా. టీడీపీకి ఇప్పటికీ గిరిజనుల్లో ఆదరణ ఉందంటే అది ఎన్టీఆర్ పుణ్యమే.

ఆ తర్వాత వైఎస్సార్ మాత్రమే….

ఆ తర్వాత ఈ ఆవాసాలను చూసింది వైఎస్సార్ మాత్రమే. రాష్ట్రంలో అనేక గిరిజన తండాలకు పక్కా ఇళ్ళు (పెంకుటిళ్ళు – డాబాలు కట్టే మేస్త్రీలు అందుబాటులో లేకపోవడం, సిమెంటు, ఇటుక, ఇసుక తీసుకెళ్ళే అవకాశం లేకపోవడం ప్రధాన కారణం) నిర్మించి, విద్యుత్ ఇచ్చి, రహదార్లు వేసింది వైఎస్సార్ హయంలోనే. రోడ్లు వచ్చిన తర్వాత రెండు గదుల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరిగింది. నక్సలైట్ల సంచారం, వారి ప్రభావం అరికట్టే చర్యల్లో భాగంగా వైఎస్సార్ రోడ్లు, విద్యుత్, ఇళ్ళు నిర్మించారు అనే వాదన కూడా లేకపోలేదు. ఇప్పుడిప్పుడే ఆ తండాలకు ఆటోలు తిరుగుతున్నాయి. తండాల గిరిజనులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఆటోల్లో మార్కెట్ (సంత)కు తరలిస్తున్నారు.

తండాలలో ఇప్పటికీ…

నేను విస్తృతంగా తిరిగిన అరకు, రంపచోడవరం, భద్రాచలం, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో అనేక తండాల పరిస్థితి ఇది. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలకు (పరిమిత ప్రాంతాలకు, పరిమిత సర్వీసులు) బస్సులు నడుస్తున్నాయి. ఈ గిరిజన ప్రాంతాలకు స్వతంత్ర భారత పాలన ఇంకా పూర్తిగా చేరలేదు. పాలకులు కేవలం ఎన్నికల సమయంలో ఓట్లకోసమే కాకుండా మిగతా సమయాల్లో కూడా ఈ ప్రజల గురించి, ఈ ప్రాంతాల గురించి ఆలోచించడం అవసరం. ప్రత్యేకంగా ఈ ప్రజల వ్యవసాయానికి, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగుకు దోపిడీకి అవకాశంలేని ప్రభుత్వ సహకారం అవసరం. ఆ దిశగా ఎన్టీఆర్, వైఎస్సార్ మరోసారి ఈ తండాలకు వెళితే మరీ మంచిది. ఈ ఇద్దరూ ఇక్కడి చాలా మంది ప్రజలకు ఇప్పటికీ దేవుళ్ళే.

 

గోపీ దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News