ఎన్టీఆర్ ఆ పనిచేశారా? మీరు నమ్ముతారా?

నటరత్న నందమూరి తారక రామారావు… కాంగ్రెస్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న నికార్సయిన నాయకుడు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని అందుకున్న ఏకైక నాయకుడు. దశాబ్దాల పాటు [more]

Update: 2020-01-23 16:30 GMT

నటరత్న నందమూరి తారక రామారావు… కాంగ్రెస్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న నికార్సయిన నాయకుడు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని అందుకున్న ఏకైక నాయకుడు. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ ను దిమ్మతిరిగే దెబ్బకొట్టిన నాయకుడు. కాంగ్రెస్ వ్యతిరేకతే పార్టీ విధానంగా తీర్చి దిద్దిన నాయకుడు. అటువంటి నాయకుడు, పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే నాటి ప్రధాని రాజీవ్ గాంధీతో అవగాహన కుదుర్చుకున్నారంటే నమ్మడం కష్టం. అసలు ఇది ఏమాత్రం విశ్వసనీయత లేని విషయమన్న వాదన వినపడుతోంది.

రహస్య అవగాహన….

1982 మార్చిలో పార్టీని పెట్టిన ఎన్టీఆర్ రెండేళ్లలోపే విపక్ష కాంగ్రెస్ తో రహస్య అవగాహనకు వచ్చారన్న విషయాన్ని విశ్వసించడం కష్టమే. కానీ ఇది నూటికి నూరు శాతం వాస్తవం. అందరూ అంగీకరించాల్సిన చేదునిజం. ఇది ఎవరో ఆషామాషీగా చెప్పిన విషయం కాదు. అనధికార సమాచారం కానే కాదు. పూర్తి సాధికారిత సమాచారం. ఎన్టీఆర్ ఆత్మకధలో పేర్కొన్న అంశం. “ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ” పుస్తకంలో రచయిత వెల్లడించిన ఆసక్తికర, ఆశ్చర్యకర అంశాలు. పుస్తక రచయితలు కొణిదెల లక్ష్మీనారాయణ, కోటా చంద్రహాస్ ధృవీకరించిన విషయం. వారిలో లక్ష్మీనారాయణ మాజీ ఐఏఎస్ అధికారి. చంద్రబోస్ మాజీ ఐఆర్ఎస్ అధికారి. మొత్తం 648 పేజీలతో కూడిన ఈ పుస్తకం ఎన్టీఆర్ కు సంబంధించి అనేక కోణాలను స్పృశించారు. ఎన్టీఆర్ బాల్యం, విద్య, నటన, రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను సమగ్రంగా వివరించారు. ఎన్టీఆర్ జీవితకథ పుస్తకాన్ని ఇటీలవల హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

రాజీవ్ తో రహస్య సమావేశం….

ఇతర విషయాలను పక్కన పెడితే రాజీవ్ – ఎన్టీఆర్ రహస్య అవగాహన అంశం సంచలనం కల్గిస్తుంది. 1984 అక్టోబరు 31 నాటి ప్రధాని ఇందిరాగాంధీ, హత్య అనంతరం అనూహ్య పరిస్థితుల్లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ అదే రోజు సాయంత్రం ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికే లోక్ సభ గడువు సమీపిస్తుంది. ఇందిర హత్యతో సానుభూతి పవనాలు దేశవ్యాప్తంగా వీచాయి. ఇదే అదనుగా ఎన్నికలకు వెళ్లి లబ్ది పొందాలన్నది నాటి ప్రధాని రాజీవ్ గాంధీ వ్యూహం. అప్పటికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థిితి దయనీయంగా ఉంది. ఎన్టీఆర్ ప్రభంజనానికి కాంగ్రెస్ కకావికలమైంది. కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ ఒక రహస్య అవగాహనకు వచ్చినట్లు పుస్తక రచయితలు పేర్కొన్నారు. తుఫానుకు దెబ్బతిన్న నెల్లూరు జిల్లా సందర్శనకు ప్రధాని రాజీవ్ గాంధీ నవంబరు 14, 15 తేదీల్లో వచ్చారు. ఈ సందర్భంగా రాజీవ్ – ఎన్టీఆర్ అప్పట్లో మద్రాస్ రాజ్ భవన్ లో రహస్యంగా సమావేశమయ్యారు. పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ సీనియర్ నాటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిన పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, పి. శివశంకర్ లపై బలహీన అభ్యర్థులను నిలబెట్టాలన్నది ఒప్పంద సారాంశం.

మూడు చోట్ల వీక్ అభ్యర్థులను నిలబెట్టినా…..

ఇందుకు ప్రతిగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు గవర్నర్ ఆమోదిస్తారు. అదే విధంగా ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేంద్ర తీసుకు వచ్చే చట్టానికి ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని ఒప్పందంలో భాగంగా హన్మకొండలో పోటీ చేసిన పీవీపై చందుపట్ల జగ్గారెడ్డిని బరిలోకి దించారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉండేది. బీజేపీ బలం నామమాత్రం. పార్టీకి సరైన యంత్రాంగమే లేదు. అప్పటికి పార్టీ ఆవిర్భవించి నాలుగున్నరేళ్లే అయింది. పీవీ లాంటి దిగ్గజాన్ని జగ్గారెడ్డి లాంటి రాజకీయ అర్భకుడు ఢీకొనడం సాధ్యమా? అని అప్పట్లో అందరూ భావించారు. కానీ పీవీ అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పీవీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో రామ్ టెక్ లో పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు స్థానాల్లో ఇది ఒకటి. మరో కాంగ్రెస్ దిగ్గజం జలగం వెంగళరావుపై ఖమ్మంలో సీపీఎం అభ్యర్థిని బరిలోకి దింాచరు. పొత్తులో భాగంగా మిత్రపక్షమైన సీపీఎంకు దానిని కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తమ్మినేని వీరభద్రం గెలుపొందడం విశేషం. మెదక్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. శివశంకర్ పోటీ చేశారు. ఆయన అప్పట్లో కేంద్ర మంత్రి. శివశంకర్ పైన టీడీపీ అభ్యర్థిగా మాణిక్ రెడ్డిని బరిలోకి దించారు. అనూహ్య పరిస్థితుల్లో టీడీపీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఇందిర హత్య సానుభూతి పవనాలతో కాంగ్రెస్ 400 కు పైగా స్థానాలను సాధించింది. కానీ ఏపీలో మాత్రం పూర్తిగా చతికల పడింది. ఎన్టీఆర్ ప్రభంజనం ముందు సానుభూతి పవనాలు ఏమాత్రం పనిచేయకపోవడం విశేషం. మరి పుస్తక రచయితలు పేర్కొన్న అంశం నిజమే అయితే నాడే ఎన్టీఆర్ రాజీవ్ గాంధీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న మాట.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News