ఎన్టీఆర్‌ కథానాయకుడు మూవీ: ఫుల్ రివ్యూ

బ్యానర్: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, [more]

Update: 2019-01-09 10:30 GMT

బ్యానర్: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం
నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తి కాదు కాదు… శక్తి నందమూరి తారక రామారావు. నందమూరి తారకరామారావు అంటే తెలియని వారుండరు. అప్పటికి.. ఇప్పటికి ఎన్టీఆర్ గురించిన కథలు ఇటు సినిమాల్లో కానివ్వండి.. అటు రాజకీయాల్లో కానివ్వండి నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేసిన మ‌హోన్న‌త శక్తి ఎన్టీఆర్. ఇక నిత్యం ఏ ఛానల్ లో అయినా ఎన్టీఆర్ సినిమాలు ప్రసారం అవడం.. చిన్న పెద్ద ఆ ఎన్టీఆర్ సినిమాలను తిలకించడంతో.. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి అనుకునే వారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. మరోపక్క రాజకీయాలను ప్రక్షాళనం చేసి తెలుగు ప్రజలను తనవైపు తిప్పుకుని తెలుగు దేశం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించి.. ప్రజలు అభిమానించే వ్యక్తిగా… తెలుగు వారి గుండెల్లో దేవుడిలా ఆరాదించబడడం… ముఖ్యమంత్రిగా చెయ్యడం.. వంటి విషయాలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే వ్యక్తి ఎన్టీఆర్. అలంటి మహోన్నత వ్యక్తి జీవిత చరిత్ర అందరికి తెరిచిన పుస్తకమే అయినప్పటికీ… ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ఆయన కూంరుడు బాలకృష్ణ, తండ్రి బయోపిక్ ని తెరకెక్కించాలనే సంకల్పంతో ఈ సినిమాని మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమాలో నందమూరి తారక రామారావు, ఒక సామాన్యమైన ఉద్యోగిగా.. ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి రావడం దగ్గరనుండి.. ఆయన సినిమాల్లో ఎలా ఎదిగారు… అలాగే సినిమాల నుండి రాజకీయాలవైపు ఎలా అడుగుపడింది అనే విషయాలను ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించబోతున్నారు. ఈ సినిమాకి బాలకృష్ణ బలం అయితే దర్శకుడు క్రిష్ ప్రాణం అన్నట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ సాగింది. అయితే ఉద్యోగాన్ని వదిలి కుటుంబం చెప్పిన మాటలు పెడా చెవిని పెట్టి మరీ నట జీవితంలోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్. ఇక వెండితెర మీద జాన‌ప‌ద‌ పాత్రలు కానివ్వండి, పౌరాణిక‌ పాత్రలు కానివ్వండి, సాంఘిక సామజిక పాత్రలు కానివ్వండి… ఇలా జోన‌ర్ ఏదైనా త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర‌వేసిన గొప్ప న‌టుడు ఎన్టీఆర్. ఆయ‌న పోషించిన‌న్ని పౌరాణిక పాత్ర‌లు మ‌రో న‌టుడు చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటి సినిమా జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు అని టైటిల్ తో బాలకృష్ణ తన సొంత బ్యానర్ లో మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి నిర్మించారు. మరి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఎలా ఉందొ.. ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
నందమూరి తారకరామారావు (బాలకృష్ణ) భార్య బసవతారకమ్మ (విద్య బాలన్) క్యాన్సర్ తో బాధపడుతూ వైద్యం తీసుకుంటున్న సందర్బం లో ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ (కళ్యాణ్ రామ్) తల్లి బసవతారకం.. ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన చెందుతాడు. అలా బసవతారకం మంచం మీద ఉన్నప్పుడు.. ఎన్టీఆర్ కి తనకి పెళ్ళైనప్పటినుండీ …ఆయన రాజాకీయ ప్రవేశం వరకు జరిగిన పరిస్థితులను నెమరువేసుకోవడంతో… కథానాయకుడు సినిమా ప్రారంభం అవుతుంది. రామారావు గారు ఒక సాధార‌ణ రైతు బిడ్డ గా….మెదట రిజిస్టార్ ఆఫీస్ ఉద్యోగం చేసేవారు. కానీ 1947 వ సంవత్సరం లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. ఆ తరువాత సినిమా లపై ఉన్న మక్కువ తో చెన్నెకి వెళ్తాడు. సినిమా రంగంలో అందరిలాగనే అనేక ఇబ్బందులు ఎదుర్కోంటాడు. అలాంటి సమయంలోనే మయాబజార్ సినిమా లో కృష్ణడిగా వచ్చి అందరిని ఆకట్టుకుంటాడు. ఇక అప్పటినుంచి ఆయనోక గోప్ప స్టార్ గా ఎదుగుతాడు. ఈ కథానాయకుడిలో బసవతారకమ్మ పాత్ర ని కూడా విశేషంగా చూపించారు. ఒక ర‌కంగా ఇది ఎన్టీఆర్ క‌థ అన‌డం క‌న్నా బ‌స‌వ‌తార‌కం క‌థ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బసవతారకాన్ని హైలెట్ చేస్తూ… ఆమె కోణంలో నుంచి ఈ కథానాయకుడు క‌థ మొద‌లైంది.

నటీనటుల నటన:
ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడు క్రిష్ ఎంపిక చేసిన నటీనటులే సినిమాకి ప్రధాన బలంగా అనిపిస్తుంది. నటీనటుల ఎంపికలో క్రిష్ అండ్ ఎన్టీఆర్ టీం 100 పెర్సెంట్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రలో సరిగ్గా అతికిపోయాడు. ఎన్టీఆర్ సినిమా రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ఆయ‌న పోషించిన పాత్ర‌ల‌న్నీ ప్ర‌తి ఐదు నిమిషాల‌కొక‌సారి మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. బాల‌కృష్ణ‌.. ఎన్టీఆర్ గా ఎన్నో విభిన్న గెట‌ప్‌ల్లో క‌నిపించారు. ప్ర‌తి రూపానికి ఒక ప్ర‌త్యేక‌తని తీసుకొచ్చాడు దర్శకుడు క్రిష్. ఎంతో శ్రద్ద తో బాలకృష్ణ ని ఎన్టీఆర్ రూపంలోకి మార్చేశాడు. ముఖ్యంగా కృష్ణుడు, వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌ల్లో బాల‌కృష్ణ ను చూడ‌టం అభిమానుల‌కు నిజంగా పండ‌గ‌లా ఉంటుంది. అయితే ఎన్టీఆర్ నడి వయస్సు పాత్రకి బాలకృష్ణ బాగా సెట్ అయ్యాడు కానీ… ఎన్టీఆర్ యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో బాల‌కృష్ణ క‌నిపించిన స‌న్నివేశాలు అంత‌గా అత‌కలేదేమోన‌నిపిస్తుంది. కొన్నిచోట్ల బాలకృష్ణ తేలిపోయిన భావన కలిగిస్తుంది. బ‌స‌వ‌తార‌కంగా బాలీవుడ్ నటి విద్యాబాల‌న్ ఆ పాత్రకి ప్రాణం పోసిందని చెప్పాలి. బసవతారకంగా విద్య బాలన్ ని ఎంచుకోవ‌డ‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. ఎందుకంటే కథానాయకుడు కథ మొత్తంలో బ‌స‌వ‌తార‌కం క‌థ హైలెట్. విద్య బాలన్ పాత్ర త‌ర్వాత అభిమానుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునేది సుమంత్ పోషించిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌. అక్కినేనిగా సుమంత్ జీవించాడనే చెప్పాలి. కొన్ని స‌న్నివేశాల్లో నిజంగా అక్కినేని కనిపిస్తున్నారని ఫీలింగ్ తెప్పిస్తుంది. ఎన్టీఆర్‌ – ఏయ‌న్నార్‌ల అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్క‌రించాడు దర్శకుడు. ఇక ఎన్టీఆర్ మహానాయకుడుకి ప్రధాన పాత్రధారి అయినా రానా దగ్గుబాటి చంద్రబాబు పాత్రలో కథానాయకుడు చివరిలో తళుక్కున మెరిశాడు. మరి రానా పాత్ర మహానాయకుడులో బాగా హైలెట్ అవుతుందనేది అందరికి తెలిసిందే. అలాగే కథానాయకుడులో హరికృష్ణ పాత్రధారి కళ్యాణ్ రామ్ కూడా మెప్పించాడు. ఆయన పాత్ర కూడా మహానాయకుడిలో కాస్త హైలెట్ అవుతుందేమో చూద్దాం. నిత్యామీనన్ సావిత్రి పాత్ర లో నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక రకుల్, హన్సిక, మంజిమ, ప్రకాష్ రాజ్, క్రిష్, దేవి ప్రసాద్, ఎన్ శంకర్ ఇలా ఎవరికివారు తమకొచ్చిన సీన్స్ లో మెప్పించారు. చాలా పాత్ర‌లు కేవ‌లం ఒక్క స‌న్నివేశానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌వే. అయినా… అలాంటి స‌న్నివేశాలు కూడా అదరగొట్టేశాయి.

 

సాంకేతిక వర్గం పనితీరు:
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మరోక సారి తన మార్క్ సంగీతం తో అందరిని కట్టి పడేశాడు. పాటలకి, సన్నివేశాలకు తగ్గట్లుగా సంగీతాన్ని అందించాడు. అంతేకాదు.. కీరవాణి అందించిన నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లం. చాలా ఎమోషనల్ సీన్స్ లో కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. బాలక్రిష్ణ ని ప్రతి గెటప్ లో అదరగోట్టాడు. జ్ఞాన శేఖర్ ఈ సినిమా పై పెట్టిన శ్రద్ద స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్ర‌తి ఫ్రేమూ చాలా అందంగా చూపించాడు. ఇక సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ బుర్రా సాయిమాధ‌వ్ రాసిన సంభాష‌ణ‌లు ఆయువుప‌ట్టు. సినిమాలో కథానుసారంగా వచ్చే డైలాగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. అందులో మచ్చుకు ఎన్టీఆర్ ఉద్యోగం కోసం వెళ్లిన‌ప్పుడు లంచం అడిగితే ఎవ‌డి ఇంటికి వాడు య‌జ‌మాని. లంచం తీసుకునేవాడి ఇంటికి ఎంత‌మంది య‌జ‌మానులు అన్న డైలాగ్ థియేటర్స్ లో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే.. ఎన్టీఆర్ జీవితాన్ని రెండున్నర గంటలో చూపించెయ్యడం సాధ్యం కానీ పని. అందుకే దర్శకుడు ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా విభజించాడు. కానీ మొదటి భాగాన్ని నిడివి ఎక్కువ ఉంచేసాడు. కథానాయకుడు నిడివి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరికాస్త శ్రద్ద వహిస్తే బావుండేదిగా నిపిస్తుంది. ఇక బాలకృష్ణ నిర్మాతగా డబ్బు పెట్టడానికి వెనుకాడలేదు. మిగతా ఇద్దరు నిర్మాతలతో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ కి ఒక రేంజ్ లో ఖర్చు పెట్టాడనిపిస్తుంది. ప్రోడక్షన్ వ్యాల్స్ సూపర్ గా ఉన్నాయి

 

విశ్లేషణ:
బాలకృష్ణ చెప్పినట్లుగా దర్శకుడు క్రిష్ కి తెలుగు సాహిత్యంలో మంచి పట్టుంది. క్రిష్ తనదైన కధనంతో మరోకసారి తన టాలెంట్ ను ఈ ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా బయటపెట్టాడు. ప్రతి ఒక్క తెలుగువాడు గర్వేపడేలా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తీశాడు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. అయినప్పటికీ.. ఆయన భార్య పిల్లలను ఎంతగా ప్రేమించేవారో ఎవ్వరికి తెలియదు. ఆయన నట జీవితం, రాజకీయ జీవితాలను చూసిన వారికీ ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని చూసే అవకాశమే రాలేదు. అందుకే ఎన్టీఆర్ వ్యక్తిగత, నట జీవితాన్ని దర్శకుడు క్రిష్ – బాలకృష్ణలు ఎన్టీఆర్ కథానాయకుడు రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకి త‌గిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు దొరికారు. ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాల‌నుకుంటున్నారో.. ఏం తెలుసుకోవాల‌నుకుంటారో.. అవ‌న్నీ తెర‌పై చూపించాడు ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ కి నట జీవితంలో అన్ని పాత్రల్లో కన్నా ఆయనకు అమితంగా ఇష్టమైన పాత్ర రావణాసురుని పాత్ర. ఈ పాత్రలో బాలకృష్ణ నటనతో అభిమానులతో ఈలలు వేయిస్తారు. అలాగే మాయాబజార్ సినిమాలో కృష్ణుని యొక్క పాత్రలో బాలకృష్ణ కనబర్చిన నటనా తీరు… ఫస్టాఫ్ అంతటికి ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. కాకపోతే మొదటి సగం అంతా పాత్రలకే ఎక్కువ సమయం కేటాయించిన అనుభూతి అయితే ప్రేక్షకులకు కలుగుతుంది. దీనిపై క్రిష్ కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అలాగే ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌పై ఎక్కువ దృష్టిపెట్టాడు అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్‌ కి ఆయన భార్య బ‌స‌వ‌తారకంల మ‌ధ్య ఉన్న అనుబంధం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చ‌ర్య‌పోతారు. ఒక భ‌ర్త‌.. భార్యకి ఇంత ప్రాధాన్యతనిస్తారా అని అనిపిస్తుంది. కుటుంబం ముఖ్యమా… సినిమా ముఖ్యమా అంటే నాకు సినిమానే ప్రాణమని చెప్పడం, కన్న కొడుకు చావుబ‌తుకుల్లో ఉన్నా స‌రే నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌ని షూటింగ్‌కు వ‌చ్చి ఆ షూటింగ్ పూర్తి చేసిన మహోన్నత వ్యక్తి గా ఎన్టీఆర్ కనిపిస్తాడు. రాయలసీమలోని కొన్ని కరువు ప్రాంతాల బాగు కోసం విరాళాల సేకరణను ప్రతిబింబిస్తూ జై కొట్టు తెలుగోడా అనే పాట ఆకట్టుకునేలా ఉంది. సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ చేసిన పాత్రలు.. తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఈ కథానాయకుడు సినిమాలో ప్రస్థావించారు. ఇక సెకండాఫ్ లో రాజకీయ ప్రస్థానానికి ముందు వచ్చే సన్నివేశాలు… చంద్రబాబు పాత్రలో రానా ఇలా పలు అంశాల ను చూపించారు కానీ…. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీతగా బోర్ ఫీల్ అవుతాడు ప్రేక్షకుడు. కానీ ఎన్టీఆర్ జీవితంలో దివి సీమ వరదలకు సంబందించిన కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా చిత్రీకరించాడు క్రిష్. ఏదిఏమైనా నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఇక్కడ దర్శకుడు క్రిష్ – బాలకృష్ణ లు కలిసి కథానాయకుడిని కాంట్రవర్సీలకు తావివ్వకుండా… రెండో భాగం మహానాయకుడు మీద అంచనాలు పెంచేశారు.

ప్లస్ పాయింట్స్ : ఎన్టీఆర్ పాత్రలో బాలకృష నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎన్టీఆర్ – ఏఎన్నార్ మధ్య వచ్చే సన్నివేశాలు, విద్య బాలన్ పాత్ర, మాయబజార్ సీన్స్, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్: నిడివి ఎక్కువ ఉండడం, సినిమా కాస్త స్లో అవడం, ఎమోషనల్ సీన్స్ పెద్దగా లేకపోవడం

రేటింగ్: 3.5/5

Tags:    

Similar News