ఎన్టీఆర్ మీద పేటెంట్ హక్కులు వారివేనా…?

ఎన్టీఆర్ తెలుగు సినీ వల్లభుడు. ఆయన మూడున్నర దశాబ్దల పాటు తెలుగు చలన చిత్ర సీమను అలరించి వెండి తెర వేలుపుగా నిలిచారు. రాజకీయ రంగాన అడుగుపెడుతూనే [more]

Update: 2020-11-08 14:30 GMT

ఎన్టీఆర్ తెలుగు సినీ వల్లభుడు. ఆయన మూడున్నర దశాబ్దల పాటు తెలుగు చలన చిత్ర సీమను అలరించి వెండి తెర వేలుపుగా నిలిచారు. రాజకీయ రంగాన అడుగుపెడుతూనే ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి సీటు పట్టేసిన రికార్డు ఆయనదే. ఎన్టీఆర్ అచ్చంగా పద్నాలుగేళ్ళ పాటు రాజకీయాల్లో కొనసాగారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించారు. ఇంతటి చరిత్ర కలిగిన ఎన్టీఆర్ ని మావాడు అంటే మావాడు అని ప్రతీ రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో క్లెయిం చేసుకోవడం సర్వ సాధారణం అయిపోయింది.

అసలు గుట్టు అదా….

ఎన్టీఆర్1983లో అధికారంలోకి వచ్చారు. ఆయన ఏడాదిన్నర పాటు తనదైన శైలిలో పాలన సాగించారు. దాంతో ఆయన వైరి వర్గం కూడా పార్టీలో బాగానే తయారైంది. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ను కూలదోసి 1984లో అధికారంలోకి వచ్చారు. దాన్ని ఆగస్ట్ సంక్షోభం అని కూడా అంటారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కి ఏమీ పాలుపోలేదట, బేలగా మారారట. కష్టపడి సాధించుకున్న అధికారాన్ని నాదెండ్ల కొట్టేస్తే ఇక ఏమీ చేయలేక అన్నగారు రాజకీయ వైరాగ్యాన్నే ఆశ్రయించారట. ఇక తనకు రాజకీయాలు వద్దు అనుకుని స్వస్తివాచకం పలకాలనుకున్నారుట. ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేతలు వాజ్ పేయ్, అద్వానీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి అంతటి కఠిన నిర్ణయం వద్దు అని నచ్చచెప్పారుట, పోరాడాలని కూడా సూచించారట. అలా వారిద్దరు ఇచ్చిన నైతిక మద్దతుతోనే ఎన్టీఆర్ తిరిగి పదవి సంపాదించుకున్నారు అని తాజాగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గుట్టు విప్పారు సోము వీర్రాజు.

అసలైన పార్టీ అట….

నిజంగా ఇది బయట జనాలకు తెలియని విషయమే. ఎన్టీఆర్ వెనక బీజేపీ ఇంత కీలకమైన పాత్ర పోషించి ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిని చేసిందని సోము వీర్రాజు అంటున్నారు. అందువల్ల ఎన్టీఆర్ రాజకీయమే ఒక విధంగా తమ వరప్రసాదమని కూడా చెప్పుకుంటున్నారు. మరి టీడీపీలో అసలైన అన్నగారి భక్తులు ఉంటే కనుక వారంతా వచ్చి బీజేపీలోనే చేరాలని కూడా సోము వీర్రాజు పిలుపు ఇస్తున్నారు. ఎన్టీఆర్ ని మోసం చేసిన వారే ఇపుడు టీడీపీకి నాయకత్వం వహిస్తున్నారంటూ ఆయన చంద్రబాబుని ఎత్తిచూపుతున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి బీజేపీలో పెద్ద పదవి ఇచ్చిందని, ఎన్టీఆర్ కుటుంబాన్ని తామే గౌరవించామని కూడా చెప్పుకుంటున్నారు. లాజిక్ చూస్తే బాగానే ఉన్నా టీడీపీని వదిలేసి బీజేపీలోకి వచ్చేయండి అంటే పసుపు తమ్ముళ్ళు వస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా టీడీపీ మీద గురి పెట్టిన సోము మరెన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బయటక్లు తీస్తాడో చూడాలి.

Tags:    

Similar News