పోలవరం.. సగం సగం…?

అగ్రిమెంట్ అంటే ఇలా ఉంటాయి. ఇద్దరూ బాగుపడాలి. ఇద్దరూ రాజకీయంగా రాణించాలి. ఇదే ఇపుడు మోడీ జగన్ కూడా ఆలోచిస్తున్నారు. పోలవరం సక్సెస్ లో బీజేపీకి వాటా [more]

Update: 2021-01-04 03:30 GMT

అగ్రిమెంట్ అంటే ఇలా ఉంటాయి. ఇద్దరూ బాగుపడాలి. ఇద్దరూ రాజకీయంగా రాణించాలి. ఇదే ఇపుడు మోడీ జగన్ కూడా ఆలోచిస్తున్నారు. పోలవరం సక్సెస్ లో బీజేపీకి వాటా ఇవ్వడానికి జగన్ ఓకే అంటున్నారు. ఇక పోలవరం విషయంలో జగన్ ముఖ్యమంత్రిగా కీర్తిని కొంత సొంతం చేసుకోవడానికి బీజేపీ కూడా సరేనంటోంది. మరికేం రెండు పార్టీలకు వరం అందుతుంది. పుణ్యం దక్కుతుంది. పాపాలూ శాపాలూ ఏవైనా ఉంటే అవి టీడీపీ సహా విపక్షాలకే మరి.

విమర్శల నుంచి అలా…..

ఏపీకి ఎన్నో నిధులు ఇచ్చాం, ఆ పధకానికి ఈ పధకానికీ నిధులు ఇచ్చేది మేమే అంటూ తెల్లారి లేస్తే బీజేపీ నేతలు గప్పాలు కొడతారు. కానీ కామన్ మాన్ కి అవేవీ బుర్రకెక్కవు. ఎందుకంటే దివంగత నేత ఎన్టీఆర్ చెప్పినట్లుగా కేంద్రం మిధ్య. రాష్ట్రాలే నిజం. అందువల్ల ఏది చేసినా రాష్ట్రమే చేస్తుంది. అలా జనాలకూ వారే కనిపిస్తారు. పైగా కేంద్రానికి నిధులు ఎక్కడివి. రాష్ట్రాల నుంచే కదా. ఈ రకమైన లాజిక్ ఇన్నేళ్ళకు బీజేపీకి బోధపడింది. ఇక ఏపీ జనాల విమర్శల గోల సెగ కూడా బాగానే తగిలినట్లుంది. ఏపీకి బీజేపీ నిఖ్సార్సుగా ఏం చేసింది అన్న ప్రశ్నకు జవాబు కమలనాధుల వద్ద ఇప్పటికీ లేనే లేదుగా.

క్రెడిట్ దక్కుతుందిగా…?

ఇపుడు తాము చేసే పని ఒకటి ఏపీలో ఉందని బీజేపీ చెప్పుకోవడానికి పోలవరం అవకాశం ఇస్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్, నిధులు మొత్తం కేంద్రానివి, నిర్వహణ రాష్ట్రానిది. అయినా సరే నాడు చంద్రబాబు బడాయి మాటలు డబాయింపులతో కేంద్రంలోని బీజేపీకి చిర్రెత్తింది. పైగా తమ వారికి కాంట్రాక్టులు ఇచ్చి మరీ టీడీపీ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని కూడా బీజేపీ హై కమాండ్ కి నివేదికలు వెళ్లాయి. ఏలూరు మీటింగులో ఏకంగా ప్రధాని మోడీ స్వయంగా పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని కూడా అనేశారు. ఇక జగన్ విషయం వస్తే రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులను తగ్గించారు. అదుపు పొదుపు చేశారు. ప్రాజెక్ట్ వేగం పెరిగిది. ఇక పోలవరం క్రెడిట్ లో బీజేపీకి వాటా ఇచ్చేందుకు కూడా జగన్ రెడీ అయ్యారు. దాంతో ఇపుడు ఎన్నడూ లేని శ్రధ్ధని బీజేపీ పోలవరంపై చూపిస్తోంది.

లాభమే మరి……

ఏపీలో పోలవరం అనుకున్న టైం కి పూర్తి అయితే ముఖ్యమంత్రిగా జగన్ కి ఎంతో పేరు వస్తుంది. ఆయన తండ్రి వైఎస్సార్ దాన్ని స్టార్ట్ చేస్తే జగన్ నిర్మించారని కూడా జనం చెప్పుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ కి పోలవరం పెద్ద ఎత్తున ప్లస్ పాయింటుగా మారుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే తాము నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశామని చెప్పుకునే వీలుంది. ఇలా ఉభయ పార్టీలు రాజకీయ లాభాన్ని భారీగా పొందేలా పోలవరం ప్రాజెక్ట్ ని ట్రంప్ కార్డులా వాడుకుంటారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ బీజేపీ హఠాత్తుగా కదుపుతున్న పావులు ఏపీలో టీడీపీకి సరికొత్త ఇబ్బందులనే తేనున్నాయి అంటున్నారు.

Tags:    

Similar News