ఒంగోలులో వార్ వన్ సైడ్.. ఇది ఫిక్స్

ఎక్కడైనా ప్రత్యర్థి బలంగా ఉంటే ఎన్నికలు పోటా పోటీగా జరుగుతాయి. ప్రత్యర్థి బలహీనంగా ఉంటే వార్ వన్ సైడ్ అవుతుంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వన్ [more]

Update: 2021-02-27 06:30 GMT

ఎక్కడైనా ప్రత్యర్థి బలంగా ఉంటే ఎన్నికలు పోటా పోటీగా జరుగుతాయి. ప్రత్యర్థి బలహీనంగా ఉంటే వార్ వన్ సైడ్ అవుతుంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వన్ సైడ్ గా జరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం పోలింగ్ కు ముందే దాదాపు విజయం ఖాయమని తేలిపోయింది. ఇక్కడ ప్రతిపక్షం బలహీనంగా ఉండటమే కారణం.

ఒకప్పడు బలంగా….

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 2016లో ఏర్పడింది. అప్పటి నుంచి ఈ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగలేదు. మొత్తం యాభై వార్డులున్న ఈ కార్పొరేషన్ పరిధిలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది. బలమైన నాయకులు ఉండేవారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులంతా నేమ్ ప్లేట్లను తిప్పేశారు. ప్రధానంగా మొన్నటి వరకూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దామచర్ల జనార్థన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

నాయకత్వ లేమితో…..

దాదాపు ఇరవై నెలల నుంచి ఆయన ఒంగోలుకు అతి తక్కువ సార్లు వచ్చారు. అదీ పెళ్లిళ్ల వంటి కార్యక్రమాలకే అటెండ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలను కూడా మొక్కుబడిగానే చేస్తున్నారు. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్ష బాధ్యతలను నూకసాని బాలాజీకి అప్పగించినా పార్టీ ఏమాత్రం ముందుకు నడవడం లేదు. పార్టీని ఆర్థికంగా ఆదుకునే శిద్ధా రాఘవరావు వంటి నేతలు వైసీపీలో చేరడంతో మేయర్ అభ్యర్థి కూడా టీడీపీకి కరువయ్యారనే చెప్పాలి.

నమ్మకం దానిపైనే….?

ఇక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. కరణం బలరాం, శిద్ధారాఘవరావు వంటి నేతలు వైసీపీలోకి తీసుకురావడం కూడా ఈ ఎన్నికలే కారణం. వీరిద్దరూ ఒంగోలు పట్టణంలో ప్రభావం చూపగల నేతలు. అదే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేకపోవడంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశాలున్నాయి. అయితే పట్టణ ప్రాంతం కావడం, గత ఇరవై నెలలుగా అభివృద్ధి జరగకపోవడం, రోడ్లు, మంచినీటి సమస్యల ఉండటంతో తమకు అనుకూలంగా ఫలితాలు మారతాయని టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఒంగోలు కార్పొరేషన్ ఎన్నిక వన్ సైడ్ గా జరగుతుంది.

Tags:    

Similar News