ఇక దానికోసమే ఆరాటం

మతం అత్యంత సున్నితమైన అంశం. భారత రాజ్యాంగం సైతం మత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించింది. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం ఒక అవగాహనకు రాలేకపోయింది. [more]

Update: 2019-11-15 18:29 GMT

మతం అత్యంత సున్నితమైన అంశం. భారత రాజ్యాంగం సైతం మత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించింది. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం ఒక అవగాహనకు రాలేకపోయింది. విస్తృత రాజ్యాంగధర్మాసనానికి నివేదించింది. విషయపరమైన తీవ్రతే ఇందుకు కారణం. మెజార్టీ మతస్తుల మనోభావాలు, పౌరులందరికీ లింగవివక్షకు తావు లేకుండా కల్పించిన రాజ్యాంగ హక్కుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు న్యాయస్థానమే మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి సైతం భాష్యం చెప్పే బాధ్యత , అందులోని అధికరణాన్ని నిర్వచించే స్వేచ్ఛ ఉన్నతన్యాయస్థానాలకు ఉంటుంది. అందువల్లనే రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తలపండిన న్యాయనిపుణులు సుదీర్ఘ కసరత్తుతో తీర్పు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశ విషయంపై సమీక్షను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ఇది న్యాయవ్యవస్థ విచక్షణ, మత, రాజ్యాంగ లక్ష్యాలతో ముడిపడిన అంశం. తీర్పు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందనే అంశాన్ని పక్కనపెడితే.. ఇది దేశ రాజకీయాలను సైతం మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏకతా సూత్రం…

అన్ని మతాల ప్రార్థన స్థలాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించి సంపూర్ణ న్యాయం చేసేందుకు న్యాయస్థానం ఒక ఉమ్మడి విధానానికి రూపకల్పన చేయాల్సిన సమయం ఆసనమైందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తే వ్యాఖ్యానించారు. తరచూ తలెత్తుతున్న మతపరమైన అంశాలు, మహిళలు, పురుషుల మధ్య లింగ వివక్ష విషయంలో చోటు చేసుకుంటున్న వివాదాలను ఒక్కసారే పరిష్కరించాలన్న వివేచన సుప్రీం తీర్పులో కనిపిస్తోంది. కేవలం హిందూ మతానికే పరిమితం చేయకుండా అన్ని మతాలకు సంబంధించి కూడా ఈ అంశాన్ని అనువర్తింపచేయాల్సిన అవసరాన్ని సైతం న్యాయస్థానం గుర్తించింది. నిజానికి శబరిమల ఆలయంలో 10 నుంచి 50 సంవత్సరాల మహిళల ఆలయప్రవేశంపై ఆంక్షలు కొన్ని శతాబ్దాలుగా ఉంటూ వస్తున్నాయి. అది ఒక సంప్రదాయంగా, ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. దీనిపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎన్నడూ చోటుచేసుకోలేదు. ఇటీవలి కాలంలో పుంజుకున్న హక్కుల ఉద్యమ కార్యకర్తలు రాజ్యాంగంలో స్త్రీ పురుష సమానత్వ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ ఈ వివాదాన్ని న్యాయపరిధిలోకి తెచ్చారు. రాజ్యాంగం ప్రకారం మహిళల ప్రవేశానికి అభ్యంతరం కూడదని గత ఏడాది సెప్టెంబర్ లోనే సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చి చెప్పేసింది. తీర్పు న్యాయస్థానం గడప దాటిందే తప్ప అమలు సాధ్యం కాలేదు. ప్రజల్లో ఉన్న బలమైన సెంటిమెంటు కారణంగా సంప్రదాయమే అమలవుతోంది. ఒకరిద్దరు ఉద్యమ కార్యకర్తలు ఆలయ ప్రవేశానికి చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి. తన సమీక్షలో భాగంగా కేవలం హిందూమతానికే పరిమితం చేయకుండా మిగిలిన మతాల్లో సైతం మహిళల ఆలయప్రవేశంపై ఉన్న వివక్షను సైతం పరిశీలించాల్సిందేనని న్యాయస్థానం స్థూలంగా అభిప్రాయపడింది. అందులో భాగంగానే విస్త్రుత ధర్మాసనానికి నివేదించింది.

మత హక్కులు…

సహజ న్యాయసూత్రాలు, పౌరహక్కులు, రాజ్యాంగ సమానత్వం, మత సంప్రదాయాలు, ఆచారాల మధ్య సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఒకదానికొకటి పరస్పరం సంఘర్షించుకుంటున్న పరిస్థితులుంటాయి. కానీ అంతిమంగా మెజార్టీ ప్రజల మనోభావాలే కట్టుబడిగా అమలైపోతుంటాయి. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం కూడా ఆ కోవకు చెందినదే. ప్రజల విశ్వాసాలతో ముడిపడిన మతహక్కులు పరిరక్షించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో సైతం కొంత వెసులుబాటు కనిపిస్తుంది. 25 వ అధికరణ పౌరులు తమకు నచ్చిన మతాన్ని అవలంబించుకునే హక్కు కల్పిస్తుంది. అదే విధంగా 26 వ అధికరణ ఏ మతానికైనా తమ మత వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ కల్పిస్తోంది. ఈ స్వేచ్ఛలో భాగంగా సంప్రదాయాలు, ఆచారాలను తీసుకోవాలా? లేకపోతే సహజన్యాయసూత్రాల్లో భాగంగా రాజ్యాంగం ప్రకారం స్త్రీపురుష వ్యత్యాసం లేకుండా ఆలయాల్లో వివక్ష కు స్వస్తి పలకాలా? అన్నదే ధర్మ మీమాంస. అది తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఏడుగురు సభ్యుల విస్త్రుత రాజ్యాంగ ధర్మాసనంపై పడుతోంది.

ఉమ్మడి పౌరస్మృతికి…

శబరిమల అంశం దేశంలో ఏకత్వానికి దారితీయాలనే ఆశ కేంద్రానికీ ఉంది. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ మౌలిక సంస్కృతి. అనేక రకాల మతాలు, ఉపమతాలు ఇక్కడ వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. వాటి ఆచారాలు, వ్యవహారాలు భిన్నమైనవి. మతాలను అనుసరించి సాంఘిక జీవన శైలి సైతం మారుతోంది. మతం కారణంగా కొన్ని హక్కులనూ కోల్పోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలే బాధితులుగా మిగిలిపోతున్నారు. మతపరమైన ప్రత్యేక హక్కులు లేకుండా ఉమ్మడి పౌరస్మృతి తేవాలనేది భారతీయ జనతాపార్టీ ముఖ్య సిద్దాంతం. ఆ పార్టీ వ్యవస్థాపనలోని మూడు కీలకాంశాల్లో ఇది కూడా ఒకటి. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి విషయాల్లో స్పష్టత వచ్చేసింది. పార్లమెంటు ద్వారా ఆర్టికల్ 370 ని రద్దు చేసేసింది. న్యాయస్థానం తీర్పు ద్వారా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక మిగిలింది ఉమ్మడి పౌరస్మృతి మాత్రమే. రాజ్యాంగ బద్ధంగా ఉమ్మడి పౌరస్మ్రుతికి ఎటువంటి ఆటంకాలు లేవు. అయితే మతమే ఇక్కడ ఒక అవరోధంగా చూడాలి. ఎవరి ఆచారవ్యవహారాలు వారికున్నాయి. స్త్రీపురుష సమానత్వంలో భాగంగా మతపరమైన వివక్షను రూపుమాపుతూ న్యాయస్థానం నుంచి క్లారిటీ లభిస్తే ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ముందడుగు వేయవచ్చనేది కమలనాథుల ఆకాంక్ష.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News