ఇంకెందుకు ఆలస్యం..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతం రెడ్డి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పనిచేస్తే అదే రాజధాని అని తేల్చేశారు. సాంకేతికంగా రాజధాని కాకపోవచ్చు. కానీ [more]

Update: 2021-09-05 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతం రెడ్డి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పనిచేస్తే అదే రాజధాని అని తేల్చేశారు. సాంకేతికంగా రాజధాని కాకపోవచ్చు. కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమంత్రి పనిచేసే చోటు రాజధాని ప్రతిపత్తిని పొందుతుంది. గడచిన ఆరేడు సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసాన్నే కార్యాలయంగా మార్చుకున్నారు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. గడచిన ఆరేడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం క్యాంపు కార్యాలయంనుంచే అన్ని రకాల సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తప్పనిసరి అయిన సందర్బాల్లోనే వెలగపూడి సచివాలయానికి వెళుతున్నారు. రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించినది మొదలు రాష్ట్రంలో రాజకీయ అలజడి కొనసాగుతూనే ఉంది. న్యాయపరమైన పోరాటాలు పెరిగిపోయాయి. దీనికి ముగింపు పలికే దిశలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రతిపక్షాలు, రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం మినహా ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. ప్రభుత్వపరంగానూ, ఉద్యోగవర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. అసలు రాజధాని తరలివెళుతుందా? లేదా? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రకటన చేసి వదిలేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రకటనలతో జీవం…

విశాఖ పట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తామంటూ అప్పుడప్పుడు ప్రకటనలు వెలువడుతుంటాయి. అదే జరిగితే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అక్కడికి తరలివెళ్లాలి. అమరావతి ప్రాంతం ఏడాదికి రెండు మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలకే పరిమితమవుతుంది. అది కూడా గ్యారంటీ ఉండదు. విశాఖలోనే తాత్కాలికంగా సమావేశాలు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. మూడు రాజధానులను ఇతర రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రజల్లో ఒక వర్గం మాత్రం మద్దతునిస్తోంది. వైసీపీ హయాంలో అమరావతిని పూర్తిస్థాయి నగరంగా అభివృద్ది చేసే ఆలోచన లేదు. ఇప్పటికే వసతులతో పెద్ద నగరం స్థాయి ఉన్న విశాఖ కేంద్రంగా యాక్టివిటీ మొదలు పెట్టడమే మేలు. అక్కడకు పెట్టుబడులు, ఇతర సౌకర్యాలు తరలివస్తాయి. ప్రభుత్వం చేసిన ప్రకటనకు వాస్తవిక కార్యాచరణ వస్తుంది. అయితే న్యాయపరమైన వ్యాజ్యాలను సాకుగా చూపుతూ ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించుకుంటే న్యాయస్థానాలు అడ్డు చెప్పలేవు. ప్రభుత్వ చిత్తశుద్ధి వెల్లడవుతుంది. అప్పుడప్పుడూ విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నాయకులు ప్రకటనలు చేస్తూ విశాఖ ప్రజల ఆశలను సజీవంగా ఉంచుతున్నారు. ముఖ్యమంత్రిని మాత్రం ప్రభావితం చేయలేకపోతున్నారు.

ఆశ,నిరాశలు..

అమరావతి ప్రాంతంలోని రైతులు ఆరువందల పైచిలుకు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా పోలీసు వలయంగా కొనసాగుతోంది. ఆందోళన శిబిరాల మీదుగా వెళ్లడం ఇష్టం లేక ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లడం లేదు. దాంతో అధికారులు, సచివాలయ సిబ్బంది సైతం కార్యాలయాలకు సక్రమంగా హాజరు కావడం లేదు. మనసు పెట్టి పని చేయడం లేదు. కోవిడ్ పుణ్యమా? అని అసలే పరిపాలన అంతంతమాత్రంగా ఉంది. దానికి తోడు యంత్రాంగం నిర్లిప్తత ప్రభుత్వాన్ని నిస్తేజం చేసేస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు , పారిశ్రామికీకరణ అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిద్దామని , ముఖ్యమంత్రిని కలుద్దామని వచ్చే వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు నిరాశ ఎదురవుతోంది. పాడైపోయిన రహదారులు , తుప్పలు నిండిన నూతన భవనాలు, ఖాళీగా ఎడారిని తలపించే స్థలాలు దర్శనిమిస్తున్నాయి. ఎక్కడా జీవం తొణికిసలాడటం లేదు. అమరావతిని కొనసాగించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతం రాజధాని అన్న మాటను సందర్భకులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు మార్చుకుంటే దానంతటదే సమస్య సద్దుమణిగిపోతుంది. ఉద్యమస్థలంగా ఉన్న ప్రాంతంలో మళ్లీ ప్రజలు సాధారణ కార్యకలాపాలను పునరుద్దరించుకొంటారు. ప్రత్యామ్నాయ ప్రణాళికతో ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతం అటు ఇటుకాని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

న్యాయవ్యవస్థకు స్పష్టత…

న్యాయస్థానాలు రాజ్యాంగ బద్ధంగా నియమాలు, నిబంధనలు చెప్పగలవు. అంతే తప్ప ప్రభుత్వం ఎక్కడి నుంచి పనిచేయాలనే అంశం వాటి పరిధిలోకి రాదు. రైతులతో గత ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది కాబట్టి కేసులు నడుస్తున్నాయి. చిట్టచివరికి ప్రభుత్వ వాదనే నెగ్గుతుందనేది న్యాయనిపుణుల అభిప్రాయం. ఒకవేళ రాజధానిని విశాఖకు తరలించకుండా వేరే పార్టీ ప్రభుత్వం వస్తే మాత్రమే నిర్ణయంలో మార్పు రావచ్చు. లేకపోతే ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయమే అమలవుతుంది. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందంలోని క్లాజుల కారణంగానే శాసన రాజధానిని ఇక్కడే ఉంచుతున్నామంటూ ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల న్యాయవ్యవస్థ కూడా నిస్సహాయంగానే మిగిలిపోవచ్చు. పరిపాలన రాజధాని విషయంలో ప్రభుత్వాన్ని శాసించడం కష్టమే. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. విశాఖకు వెళ్లడం వల్ల ప్రభుత్వం రాజధాని తరలింపునకు కట్టుబడి ఉందన్న సందేశం, సంకేతం న్యాయస్థానాలకు పంపినట్లవుతుంది. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థల కారణంగా ఎక్కడి నుంచైనా, ఎవరితోనైనా సీఎం సమావేశం కావచ్చు. పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలు ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలోనే కలుస్తారు. అందువల్ల రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతమున్న అనిశ్చిత వాతావరణంలో పెట్టుబడుల పరంగానూ ముందడుగు పడటం లేదు. ప్రభుత్వం ప్రకటనల హడావిడిని విడిచిపెట్టి పరిపాలన రాజధాని ఏర్పాటు దిశలో ముందడుగు వేయాల్సి ఉంది. తొలిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతోనే అందుకు శ్రీకారం చుట్టవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News