ఆ తిక్కకు ఒక లెక్క సెట్ చేసే పనిలో ఉన్నారా?

జగన్ కొన్ని విషయాల్లో చంద్రబాబు రూట్లోనే వెళ్తునారనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించాలంటే వారి కులం వారితోనే తిట్టించేవారు. ఇపుడు జగన్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. [more]

Update: 2020-07-01 13:30 GMT

జగన్ కొన్ని విషయాల్లో చంద్రబాబు రూట్లోనే వెళ్తునారనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించాలంటే వారి కులం వారితోనే తిట్టించేవారు. ఇపుడు జగన్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. పైగా ఎవరు అటాక్ చేస్తే అవతల వారు బాగా మానసిక క్షోభ పడతారో వారినే ముందు పెట్టి రాజకీయ పోరాటాన్ని రక్తి కట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అంటే అదో రకం అసూయ. ఎందుకంటే ఆయన తన అన్నగారు చిరంజీవి పెట్టిన పార్టీ ద్వారా రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఇంతదాకా వచ్చి వెలిగిపోతూంటే తాను మాత్రం ఇంకా అసెంబ్లీ గేటు దాకా కూడా రాకుండా పోయారు. ఆ బాధతోనే తరచూ పవన్ కళ్యాణ్ కన్నబాబుని టార్గెట్ చేస్తూ వచ్చారు. పైగా కాపులకు గుండెకాయ లాంటి గోదావరి జిల్లాలకు చెందిన యువ నాయకుడు కన్నబాబు. ప్రజాదరణతో పాటు, రాజకీయ వ్యవహారాలు, వ్యూహాల్లో కూడా ఆయన చాలా ముందున్నారు.

కాపు కార్డుతో …..

పవన్ కళ్యాణ్ కి అదేంటో కానీ ముందు వద్దంటారు, ఆ తరువాత అదే ముద్దంటారు. అంటే మనసులో కోరిక ఉన్నా బయట మాత్రం హిపోక్రసీ ప్రదర్శిస్తారన్న మాట. తాను అందరివాడిని అని పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పదే పదే చెప్పుకున్నారు. తనకు కులం మతం లేవని కూడా డాంబికాలు పలికారు, దాన్ని ఇంకా విడమరచి చెబుతూ తన భార్య రష్యన్ అని, ఆమె క్రిస్టియన్ అని, తమ ఇంట్లో అన్ని మతాల పూజలు ఉంటాయని కూడా ఒకానొక సందర్భంలో ఇదే పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు. తాను ఒక చట్రంలో ఇమిడే మనిషిని కానని చెప్పుకున్న పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో మాత్రం కాపులు అధికంగా ఉన్నవే. ఒకటి గాజువాక. రెండు భీమవరం. ఈ రెండూ కూడా కాపుల ఓట్లు గంపగుత్తగా తన ఖాతాలో పడి గెలిపించేస్తాయని పవన్ కల్యాణ్ భ్రమించడం వెనక కాపు కార్డే ఉందంటారు.

ఆ ఆయుధంతో ….

కాపుల విషయంలో రిజర్వేషన్ల బాధ ఉంది. దాన్ని పట్టుకుని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. మరి నాడు ఆయనకు ఏ మాత్రం మద్దతు ఇవ్వకుండా నాటి సీఎం చంద్రబాబు వెన్నంటి ఉన్న పవన్ కల్యాణ్ కి ఇపుడు హఠాత్తుగా కాపులను బీసీలలో చేర్చాలన్న సంగతి గుర్తుకువచ్చిందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇక కన్నబాబు అయితే పవన్ తో చెడుగుడు ఆడుకున్నారు. మీకు చంద్రబాబే ప్రపంచ సంస్కర్తగా కనిపిస్తారు. జగన్ అంటే మీకు పడదు కాబట్టి ఏం చేసినా మెచ్చుకోరు, ఇపుడే మీకు కాపులు గుర్తుకువచ్చారా. ముద్రగడను పోలీసులు చిత్రహింసలు పెట్టినపుడు ఏమయ్యారు అంటూ బాగానే కౌంటర్లు వేశారు. కాపు నేస్తం పధకం అధ్బుతం, మీరు పొగడకపోయినా కాపులకు మేలే చేస్తున్నాం, మీ సర్టిఫికేట్లు కూడా అవసరం లేదని ఘాట్ రిప్లై ఇచ్చేశారు.

డిప్యూటీగా ….

ఇక పవన్ కల్యాణ్ తిక్కకు ఒక లెక్కను సెట్ చేసే పనిలో జగన్ ఉన్నారని టాక్. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా గోదావరి జిల్లాలను, కాపులను నమ్ముకుని రాజకీయం చేయడానికి పవన్ కల్యాణ్ తయారుగా ఉన్నారు. దాంతో ఆయనకు చెక్ పెట్టడానికి కన్నబాబునే ముందు పెడుతున్నారు జగన్. ఇక రాబోయే రోజుల్ల విస్తరణ జరిగితే కన్నబాబుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని జగన్ గట్టిగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. అదే జిల్లా నుంచి డిప్యూటీ సీఎం గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్తున్నందున ఆ జిల్లా నుంచే డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని జగన్ భావిస్తున్నారుట. మొత్తం మీద ఫ్యూచర్ పాలిటిక్స్ ని బాగా స్టడీ చేసి మరీ జగన్ కన్నబాబుని పవన్ కల్యాణ్ మీదకు అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. మరి పవన్ దీనికి కౌంటర్ అటాక్ ఎలా చేస్తారో చూడాలి.

Tags:    

Similar News