ఇప్పటికైనా అర్థమయిందా.. ఇమ్రాన్….?

భారత్ పై గుడ్డి వ్యతిరేకతనే విధానంగా మలచుకుని ముందుకు సాగుతున్న దాయాది దేశమైన పాకిస్థాన్ అంతర్జాతీయంగా అభాసు పాలవుతోంది. దౌత్య మర్యాదలను, అంతర్జాతీయ సంప్రదాయాలను విస్మరించి ఏకపక్షంగా [more]

Update: 2021-03-20 16:30 GMT

భారత్ పై గుడ్డి వ్యతిరేకతనే విధానంగా మలచుకుని ముందుకు సాగుతున్న దాయాది దేశమైన పాకిస్థాన్ అంతర్జాతీయంగా అభాసు పాలవుతోంది. దౌత్య మర్యాదలను, అంతర్జాతీయ సంప్రదాయాలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల అప్రతిష్ఠను మూటగట్టుకుంటోంది. అదే సమయంలో భారత్ హుందాగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ సమాజం మనన్నలు అందుకుంటోంది. ఒక్క కశ్మీర్ మినహా మిగిలిన ఏ విషయంలోనూ భారత్ కు పాక్ తో ఎలాంటి పేచీ లేదు. దీనిని కూడా శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెబుతుంటోంది. కానీ ఇస్లామాబాదే ఈ విషయాన్ని విస్మరిస్తూ కయ్యానికి కాలు దువ్వుతుంటోంది. ఫలితంగా ఉభయ దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.

ఇమ్రాన్ పర్యటనకు ….

ఇక తాజా విషయానికి వస్తే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక పర్యటనకు సంబంధించి భారత్ హుందాగా వ్యవహరించింది. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఇమ్రాన్ కొలొంబో అధికారిక పర్యటనకు వెళ్లారు. ఇస్లామాబాద్ నుంచి కొలొంబో వెళ్లేందుకు భారత గగనతలాన్ని వాడుకునేందుకు భారత్ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా అనుమతులు మంజూరు చేసి తన పెద్ద మనసు చాటుకుంది. తద్వారా అంతర్జాతీయ సంప్రదాయాలను గౌరవించింది. పాక్ నుంచి లంక వెళ్లాలంటే అనివార్యంగా భారత గగనతలం మీదుగా ప్రయాణించాల్సి ఉంది. ఇదే పాకిస్థాన్ గతంలో రాష్ర్టపతి రామనాధ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు పాకిస్థాన్ గగనతలాన్ని వాడుకునేందుకు ఇస్లామాబాద్ నిరాకరించి తన కురచ బుద్ధిని చాటుకోవడం గమనార్హం.

చుట్టూ తిరిగి…..

2019లో రాష్రపతి రామనాధ్ కొవింద్ ఐరోపా పర్యటనకు వెళ్లేందుకు తన గగనతలాన్ని వాడుకునేందుకు పాక్ నిరాకరించింది. దీంతో కొవింద్ చుట్టూ తిరిగి ఐరోపాకు వెళ్లాల్సి వచ్చింది. అదే ఏడాది సెప్టెంబరులో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా గగనతలాన్ని వాడుకునేందుకు పాక్ నిరాకరించింది. అదే ఏడాది అక్టోబరులో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్లేందుకు సిద్ధమవ్వగా మళ్లీ తన గగనతలాన్ని వాడుకునేందుకు పాక్ నిరాకరించి తన చిన్న బుద్ధిని చాటుకుంది. సాధారణంగా దేశాధినేతల పర్యటనలకు సంబంధించి సంబంధించి ఇతర దేశాల గగనతలాన్ని వాడుకనేందుకు ఏ దేశం అభ్యంతరం చెప్పదు. ఇది అంతర్జాతీయంగా, దౌత్యపరంగా చిరకాలంగా వస్తున్న సంప్రదాయం. దీన్ని ఏ దేశం ఉల్లంఘించదు. కానీ భారత్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న పాక్ దీనిని విస్మరించి తన వక్రబుద్ధిని చాటుకుంది. కానీ భారత్ మాత్రం గతాన్ని విస్మరించి ఇమ్రాన్ పర్యటన విషయంలో ఉదారంగా వ్యవహరించి తన పెద్ద మనసును చాటుకుంది. రెండు దేశాల వ్యవహార శైలికి ఇంతకు మించిన మరో నిదర్శనం అక్కరలేదు.

ఇమ్రాన్ ఆ గౌరవం దక్కలేదు….

ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇమ్రాన్ పర్యటనలో లంక పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. కానీ ఈ సందర్భంగా కశ్మీర్ విషయాన్ని ప్రస్తావిస్తారన్న అనుమానంతో ఏకంగా ఈ కార్యక్రమాన్నే లంక రద్దు చేసింది. దీనివల్ల భారత్ తో సంబంధాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరించింది. తమ పర్యటనల్లో ఆయా దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించడం అరుదైన గౌరవంగా దేశాధితనేతలు పరిగణిస్తారు. గతంలో పాక్ దివంగత అధినేతలు ఆయూబ్ ఖాన్ (1963), జుల్ఫికర్ ఆలీభుట్టో (1975)ఈ గౌరవాన్ని పొందారు. ఇమ్రాన్ ఈ గౌరవానికి నోచుకోలేదు. దివంగత భారత ప్రధానులు నెహ్రూ (1962), ఇందిరాగాంధీ (1973), మొరార్జీ దేశాయ్ (1979)ఈ గౌరవాన్నిపొందారు. తాజాగా 2015లో లంక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. ఇమ్రాన్ ఆ గౌరవానికి నోచుకోకపోవడం కేవలం ఆయన స్వయంకృతాపరాధం అని చెప్పక తప్పదు.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News