పళని అమ్మలేని లోటును తీర్చినట్లేనా?

తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా సాగాయి. ఎన్నడూ లేని విధంగా ప్రచారం అన్ని పార్టీలూ నిర్వహించాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవల్సింది పళనిస్వామి గురించి. పళనిస్వామి ఈసారి [more]

Update: 2021-04-14 17:30 GMT

తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా సాగాయి. ఎన్నడూ లేని విధంగా ప్రచారం అన్ని పార్టీలూ నిర్వహించాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవల్సింది పళనిస్వామి గురించి. పళనిస్వామి ఈసారి ఎలాంటి ఇమేజ్ లేకుండా ఈ ఎన్నికలలో ప్రధాన నేతగా మారారు. జయలలిత లేని లోటును తీర్చేందుకు పళనిస్వామి శతవిధాలుగా ప్రయత్నించారు. ప్రధానంగా పళనిస్వామి పాలనపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా బీజేపీతో చెలిమి ఆయనకు అడ్డంకిగా మారింది.

బీజేపీకి దూరంగా…..

అందుకే పళినిస్వామి ఎన్నికల ప్రచారంలో బీజేపీతో దూరంగా ఉన్నారు. ఎక్కడా బీజేపీ, అన్నాడీఎంకే నేతలు కలిసి పనిచేసినట్లు కన్పించలేదు. తమపై బీజేపీ ముద్రపడకుండా పళనిస్వామి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మోదీపై ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత తమ పార్టీపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పళనిస్వామికి జయలలిత మాదిరి ఎటువంటి నేపథ్యం లేకపోయినా తన నాలుగేళ్ల పాలనపైనే ఆయన నమ్మకం పెట్టుకున్నారు.

విశ్వాసాన్ని పెంచుకునేందుకు…..

ఈసారి ఖచ్చితంగా తమను ఓటర్లు ఆశీర్వదిస్తారని పళనిస్వామి గట్టిగా విశ్విస్తున్నారు. స్టాలిన్ నాయకత్వంపై ప్రజల పట్ల అంత సానుకూలత లేకపోవడం కూడా పళనిస్వామికి కలసి వచ్చేట్లుంది. అందుకోసమే ఆయన అన్నీ అవకాశాలను ఉపయోగించుకున్నారు. తన తల్లిపై డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు. సభలోనే కన్నీళ్లు పెట్టుకుని సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా…..

ఎన్నికల మ్యానిఫేస్టో రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక దాకా పళనిస్వామి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పళనిస్వామి తనపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరగడానికి మ్యానిఫేస్టోను ఉపయోగించుకున్నారు. అయితే ఫలితాలు ఎలా ఉన్నా ఈసారి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చిందనే అంటున్నారు విశ్లేషకులు. ఫలితాలు వచ్చిన తర్వాత గాని తమిళ ఓటర్ల నాడి ఎటువైపు ఉంటుందో తెలియకున్నా, ఈ ఎన్నికల్లో మాత్రం పళనిస్వామి ఒంటరి పోరాటం చేశారనే చెప్పాలి.

Tags:    

Similar News