మళ్లీ మారిపోతారటగా…!!

పనబాక దంపతులుగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న పనబాక కృష్ణయ్య, పనబాక లక్ష్మిల‌ భవితవ్యం ఏంటి? రాజకీయాలకు వారు దూరమయ్యారా? దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్టేనా ? రాజకీయ [more]

Update: 2019-08-07 00:30 GMT

పనబాక దంపతులుగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న పనబాక కృష్ణయ్య, పనబాక లక్ష్మిల‌ భవితవ్యం ఏంటి? రాజకీయాలకు వారు దూరమయ్యారా? దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్టేనా ? రాజకీయ వర్గాల్లో ఈ చర్చ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌లో ఈ ఇద్దరు దంపతులు 2004, 2009 సమయంలో చక్రం తిప్పారు. కేంద్ర మంత్రిగా కూడా పనబాక లక్ష్మీ పదవిని అలంకరించారు. కాంగ్రెస్‌లో ఎందరో ఉద్ధండులు ఉన్నప్పటికీ.. ఎస్సీ కోటాలో ఆమె కేంద్ర పదవిని దక్కించుకున్నారు. ఇక, పనబాక కృష్ణయ్య కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా రెండుసార్లు ఓడిపోయారు.

విభజన సమయంలోనూ….

ముఖ్యంగా నెల్లూరు, బాపట్ల నుంచి వరుస విజయాలు సాధించిన పనబాక లక్ష్మి కాంగ్రెస్ లో తిరుగులేని నాయకురాలిగా ఉన్నారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినడంతో పార్టీ నిలబెట్టేందుకు ప్రయత్నించిన నాయకుల్లో ఈ దంపతులు కూడా ఉండడం గమనార్హం. నిజానికి కాంగ్రెస్ లోని చాలామంది నాయకులు రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అయితే, పనబాక పనబాక లక్ష్మి మాత్రం దీనికి భిన్నంగా కేంద్రంలోని కాంగ్రెస్ వ్యూహానికి అనుకూలంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని కేంద్రంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఆమె ప్రశ్నించారు.

చాలా రోజుల పాటు…

అంతేకాదు, రాష్ట్ర విభజన పై సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే పనబాక లక్ష్మి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఎందరు అడ్డుకున్నా జరిగి తీరుతుందని, ఎవరూ ఆపలేరని, ఇప్పుడు మనకు ఏం కావాలో అడిగి తీసుకోవడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యమ‌ని ఆమె సూచించారు. అయితే, పనబాక కృష్ణయ్య మాత్రం ఈ విషయంలో మౌనం వహించారు. ఆయన తటస్థంగా ఉండిపోయారు. ఇంతలోనే రాష్ట్ర విభజన జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా చాన్నాళ్లు ఈ దంపతులు కాంగ్రెస్‌లోనే ఉన్నారు.

టీడీపీలో చేరి….

రాష్ట్రంలో కాంగ్రెస్ 2014లో ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ.. పార్టీ పునరుజ్జీవానికి తమ వంతు కర్తవ్యంగా వారు ప్రచారం కూడా చేశారు. కేడర్ జారిపోతున్నా కూడా.. తాము మాత్రం పార్టీ కోసం ఎంతో చేశార‌నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 2019 ఎన్నికల సమయానికి ఆరు మాసాల ముందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వంటి వారు కూడా పార్టీకి దూరం కావ‌డం, ఎంత ప్రయత్నించిన కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేకపోవడం, మరోపక్క, మళ్ళీ టిడిపినే అధికారంలోకి వస్తుందని ప్రచారం ఉదృతంగా సాగడంతో పనబాక లక్ష్మి దంపతులు ఇక‌, కాంగ్రెస్‌లోనే ఉంటే ఫలితం లేదని గ్రహించారు. ఇంతలోనే వైసీపీ నుంచి వారికి ఆఫర్ల వరద స్వాగతం పలికింది. కానీ, జగన్ అధికారంలోకి వచ్చేది లేదని స్వయంగా ప‌న‌బాక దంపతులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ పార్టీకి వెళ్లేందుకు సాహసం చేయలేదు.

మరోసారి ఓటమి పాలయి…..

ఈ నేపథ్యంలోనే స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడంతో పనబాక లక్ష్మి దంపతులు తమ రాజకీయ దారిని టిడిపి దిశగా మళ్ళించారు. ఈ క్రమంలో పనబాక లక్ష్మి తిరుపతి ఎంపి స్థానాన్ని చంద్రబాబు కేటాయించారు. ఇద్దరు దంపతులు టికెట్లు అడిగినా కృష్ణయ్య‌కు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు లక్ష్మికి తిరుపతి టికెట్ తో సరిపెట్టారు. ఆ స్థానం నుంచి లక్ష్మి గెలిచి తీరుతుంద‌నే ప్రచారం కూడా జోరుగానే సాగింది. బాబు స్వయంగా ఇక్కడ ప్రచారం కూడా నిర్వహించారు. అయితే, జగన్ సునామీ ముందు పనబాక లక్ష్మి దంపతులు పూర్తిగా చతికిల పడ్డారు. హోరంగా పనబాక లక్ష్మి ఓడిపోయారు. ఇక, ఓట‌మి తర్వాత ఇప్పటివరకు ఈ దంపతులు మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. ఇప్పటికే కృష్ణయ్య, పనబాక లక్ష్మిలు వివిధ సమస్యలతో ఉండడం, రాజకీయాల్లో పోటీ పడలేని పరిస్థితి ఉండడంతో భవితవ్యం లేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. పైగా టిడిపి కూడా మరో కాంగ్రెస్‌లా మారుతుందని వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరు దంపతులు ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే అంటున్నారు. అయితే మరో పక్క మాత్రం పనబాక శిబిరంలో బిజెపి ఆశలు రేకెత్తిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వారిని తమ పార్టీలోకి చేరాలని కోరుతున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News