అందుకే వైసీపీలోకి రాకుండా ఆగుతున్నారట

ఆయనది పదేళ్ళ రాజకీయ జీవితం. విశాఖలో వ్యాపారం రిత్యా వచ్చి సెటిల్ అయిన ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి తొలి విడతలోనే ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తరువాత [more]

Update: 2020-05-18 14:30 GMT

ఆయనది పదేళ్ళ రాజకీయ జీవితం. విశాఖలో వ్యాపారం రిత్యా వచ్చి సెటిల్ అయిన ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి తొలి విడతలోనే ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తరువాత రెండు పార్టీలు మారి టీడీపీలోనూ ఒక వెలుగు వెలిగారు. అక్కడా ఎమ్మెల్యే అయ్యారు. మూడవసారి మాత్రం ఫేట్ మారింది. దాంతో ఆయన గత ఏడాది ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇపుడు టీడీపీకి కూడా రాజీనామా చేసి ఖాళీగా ఉన్నారు. ఆయన చూపు వైసీపీ వైపు ఉందని తెలుస్తున్నా ఎందుకో అడుగు మాత్రం ముందుకుపడడంలేదు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పయనమెటు అన్న దాని మీద విశాఖలో రాజకీయ చర్చ సాగుతోంది.

అలా అదృష్టం….

విశాఖ జిల్లాలో బుద్ధిగా వ్యాపారం చేసుకుంటున్న ఆయనకు రాజకీయ వాసన తగిలింది మెగాస్టార్ ఇంటి నుంచే. ఆయన మెగా బ్రదర్ నాగేంద్రబాబుకు దూరం బంధువు అంటారు. దాంతో ప్రజారాజ్యం పెట్టినపుడు ఆయనని విశాఖ రాజకీయాలు చూడమని పురమాయించారని చెబుతారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అప్పటికే ప్రజారాజ్యంలోకి దూకడంతో ఆయనతో కలసి పంచకర్ల రమేష్ జిల్లాలో పార్టీని పటిష్టం చేసే పనిలో కష్టించారు. దానికి ప్రతిఫలంగా ఆయన్నే ఎమ్మెల్యేగా పోటీ చేయమని ప్రజారాజ్యం పెద్దలు పెందుర్తి సీటు ఇచ్చేశారు. నాడు టీడీపీలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని, మరో వైపు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండి బాబ్జిని ఓడించి పంచకర్ల రమేష్ భారీ మెజారిటీతో గెలిచి సంచలనమే సృష్టించారు.

టీడీపీ ప్రెసిడెంట్ గా….

ఇక గంటా గ్రూపులో ఉంటూ కాంగ్రెస్ లోకి దూకి, అటునుంచి తెలుగుదేశం పార్టీలోకి కూడా పంచకర్ల రమేష్ చేరిపోయారు. 2014లో ఎలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి విజయం సాధించారు. ఇక బలమైన కాపు సామాజికవర్గం నేతగా ఉన్న పంచకర్ల రమేష్ ను రూరల్ టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ గా చంద్రబాబు చేశారు. పార్టీ కోసం పనిచేసిన పంచకర్లకు బాబు వద్ద మంచి మార్కులే వచ్చాయి. ఇక 2019 ఎన్నికలనాటికి తనకు విశాఖ ఉత్తరం సీటు ఇమ్మని పంచకర్ల రమేష్ కోరారు. అలా అయితేనే తాను గెలుస్తాననిచెప్పుకున్నారు. కానీ చంద్రబాబు చివరి నిముషంలో హ్యాండ్ ఇవ్వడంతో తప్పనిసరిగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ ఓడిపోయారు. దాంతో ఆయన టీడీపీ బంధం అయిదేళ్ల కధగా ముగిసింది. పోతూ పోతూ బాబు మీద, లోకేష్ మీద హాట్ కామెంట్స్ చేశారు.

జగన్ ని ఎత్తేస్తున్నారు….

ఇక తాజాగా ఆయన జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతున్నారు. విశాఖ గ్యాస్ లీకేజి ఘటనలో బాధితులకు తక్షణ సాయం అందించి జగన్ సర్కార్ బాగా పనిచేసిందని పంచకర్ల రమేష్ మెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు విపత్తు వేళ కూడా విచక్షణ మరచి మాట్లాడుతున్నారంటూ గట్టిగానే తగులుకున్నారు. ఇవన్నీ చూసినపుడు ఆయన వైసీపీలో చేరుతారని అంతా అనుకుంటున్నారు. కానీ పంచకర్ల రమేష్ వేచి చూసే ధోరణిలోనే ఇంకా ఉన్నారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి.

ఆ సీటు కోసమే….?

ఇక పంచకర్ల రమేష్ బాబుకు విశాఖ ఉత్తరం సీటు కావాలి. ఆయన నివాసం కూడా అక్కడే. ఆయన పెందుర్తి, యలమంచిలి నుంచి పోటీ చేసినపుడు కూడా అక్కడికి వెళ్ళి వస్తూండేవారు. దాంతో స్థానికేతరుడు ఎమ్మెల్యే అన్న ముద్ర పడింది. అలా కాకుండా ఉత్తరాన్ని పర్మినెంట్ సీటుగా ఉంచుకుని రాజకీయం చేయాలని పంచకర్ల రమేష్ ఆశ. అయితే వైసీపీలో ఇప్పటికే జగన్ సన్నిహితుడుగా ఉన్న రియల్ వ్యాపారి, గత ఎన్నికల్లో పోటీ చేసి త్రుటిలో ఓటమిపాలు అయిన కేకే రాజు ఉన్నారు. ఆయనే ఇపుడు వైసీపీకి అక్కడ ఇంచార్జి. ఆ సీటు ఇస్తే పంచకర్లేమిటి మాజీ మంత్రి గంటాయే వైసీపీలోకి వస్తారని కూడా చెబుతారు. అయితే విజయసాయిరెడ్డి ఈ మధ్యనే తమ ఎమ్మెల్యే అభ్యర్ధి కేకే రాజు అని ప్రకటించేశారు. దాంతో పంచకర్ల రమేష్ వైసీపీలోకి రావడానికి ఆగుతున్నారని టాక్. ఏది ఏమైనా ఆయన్ని వైసీపీలోకి తెస్తారని అంటున్నారు. ఆయనకు సైతం వేరే ఆప్షన్ కూడా లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఆ రాక ఎపుడో.

Tags:    

Similar News