గంటా వస్తే ఆయన రారట

విశాఖ రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమెష్ బాబు ఇపుడు ఊగిసలాటలో ఉన్నారని అంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడడం ఖాయమన్న [more]

Update: 2019-10-05 14:30 GMT

విశాఖ రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమెష్ బాబు ఇపుడు ఊగిసలాటలో ఉన్నారని అంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడడం ఖాయమన్న మాట నిన్నటివరకూ వినిపించింది. అయితే ఆయన విశాఖ‌ జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అనుచరుడుగా ముద్ర ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఇపుడే అదే గంటా మీద గురి పెట్టారు. ఆయన ఉన్న చోట తాను ఉండనని ఒట్టేసుకుంటున్నారు. వైసీపీలో గంటా చేరితే తాను ఆ పార్టీలోకి వచ్చేది లేదని పంచకర్ల రమేష్ బాబు సందేశం పంపిస్తున్నారట. ఇదేం రాజకీయం అంటే ఇందులోనే అసలైన వ్యూహం దాగుందని అంటున్నారు.

ఎదగలేమనేనట….

గంటా శ్రీనివాస‌రావు అటు అవంతి శ్రీనివాసరావుని, ఇటు పంచకర్ల రమేష్ బాబుని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఇద్దరూ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేలుగా తొలిసారి పోటీ చేసి గెలిచారు. తరువాత కాంగ్రెస్ లో చేరి కీలకమైన పాత్ర పోషించారు. విభజన సమయంలో టీడీపీలో చేరిన గంటా బ్యాచ్ లో వీరు ఉన్నారు. వీరిని తన మద్దతుదారులుగా చూపించి గంటా మంత్రి పదవి కొట్టేసారన్న బాధ అవంతిలోనూ, పంచకర్ల రమేష్ బాబు లోనూ ఉంది. అందుకే ఎలాగైనా మంత్రి కావాలని అవంతి ఎన్నికల ముందు వైసీపీలోకి దూకేశారు. పంచకర్ల రమేష్ బాబుకు ఉత్తరం సీటు ఖరారు చేయకపోవడంతో టీడీపీలోనే ఉండిపోయారు. ఇపుడు కూడా ఆయన వైసీపీలోకి రావాలనుకుంటే ఉత్తరం సీటు ఇవ్వాలన్నది డిమాండ్. అదే గంటా కనుక వైసీపీలో చేరితే సిట్టింగ్ ఉత్తరం ఎమ్మెల్యేగా ఆయనకే మరో మారు సీటు ఇస్తారు. దాంతో తాను చేరినా ఉపయోగం లేదని పంచకర్ల రమేష్ బాబు భావిస్తున్నట్లుగా అయన వర్గం అంటోంది.

గంటా జంప్ చేస్తే టీడీపీ నుంచే…

ఇక గంటా వైసీపీలోకి వెళ్ళడం దాదాపుగా ఖాయం అంటున్నారు. ఆయన వైసీపీలో చేరాలంటే జగన్ పెట్టిన షరతు ప్రకారం ఉత్తరం ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయాలి. దాంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నికల్లో గంటా నిలబడినా మరొకరు నిలబడినా కూడా వారికి ఎదురుగా టీడీపీ నుంచి పోటీ చేయాలన్నది పంచకర్ల రమేష్ బాబు ఆలోచనగా ఉంది. అదే వైసీపీలో చేరితే గంటాను కాదని తనకు టికెట్ ఇచ్చే ప్రశ్నే ఉండదని పంచకర్ల రమేష్ బాబు భావిస్తున్నారు. ఇక గంటా కనుక వైసీపీలో ఉంటే ఆయనకే తొలి ప్రాధాన్యత ఉంటుందని, దాంతో తాము కొత్త పార్టీలో చేరినా అనుచరులుగానే ఉండాలి తప్ప పొజిషన్ పెరగదన్న ముందు చూపుతో పంచకర్ల రమేష్ బాబు ఉన్నారని అంటున్నారు. అందువల్ల ఆయన గంటా గోడ దూకుడు మీదనే కన్నెసి ఉంచారు. గంటా రాజకీయ అడుగులను బట్టే తాను కూడా వేయాలని పంచకర్ల రమేష్ బాబు ఆలోచిస్తున్నట్లుగా ఆయన వర్గీయులు చెబుతున్నారు.

Tags:    

Similar News