పన్నీర్ ప్రయోగం ఫలిస్తుందా…??

అధికార అన్నాడీఎంకే పార్టీలో వారసత్వ రాజకీయాలకు అసలు చోటుండదు. ఎంజీ రామచంద్రన్, జయలలిత దగ్గర నుంచి ఇదే పద్ధతిని పాటించారు. ఎంజీఆర్ సతీమణి రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా [more]

Update: 2019-03-27 17:30 GMT

అధికార అన్నాడీఎంకే పార్టీలో వారసత్వ రాజకీయాలకు అసలు చోటుండదు. ఎంజీ రామచంద్రన్, జయలలిత దగ్గర నుంచి ఇదే పద్ధతిని పాటించారు. ఎంజీఆర్ సతీమణి రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా రాణించలేదు. వారసురాలు కాకున్నా జయలలితకే పెద్ద పీట వేశారు తమిళనాడు ప్రజలు. అయితే జయలలిత మరణం తర్వాత వీటికి ఆ పార్టీ తిలోదకాలిస్తున్నట్లు తెలుస్తోంది. వారసులను రాజకీయాల్లోకి తెచ్చేందుకే అధికార అన్నాడీఎంకేలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీపముండగానే చక్కదిద్దుకోవాలన్న సామెతను అక్షరాలా అనుసరిస్తున్నారు.

అమ్మ ఆశీస్సులు…..

ఓ. పన్నీర్ సెల్వం… ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి. ఆయన జయలలితకు నమ్మినబంటుగా పేరు. అందుకే జయలలిత బతికి ఉన్నప్పుడే రెండు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న పన్నీర్ సెల్వం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. కాలం కలసి రాకపోవడంతో రాజీ పడక తప్పలేదు. అయిష్టంగానే పదవిలో కొనసాగుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 18 శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు, 40 స్థానాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటంతో ిఇది పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.

కుమారుడిని బరిలోకి దించి…..

అయితే ఈ ఎన్నికల్లో పన్నీర్ సెల్వం ప్రయోగానికి సిద్ధమయ్యారు. తేని లోక్ సభ నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాధ్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయనను గెలిపించుకోవడం పన్నీర్ సెల్వానికి సవాల్ గా మారింది. లోక్ సభ ఎన్నికల్లో కూటమిగా వెళుతుండటంతో పన్నీర్ సెల్వం అతి విశ్వాసంతో తేని నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కుమారుడి భవిష్యత్తును ఈ ఎన్నికల్లో చూద్దామనుకుంటున్నారు. మధురై జిల్లాలో ఈనియోజకవర్గం ఉండటంతో తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు.

పట్టున్న ప్రాంతంలో…..

మధురై జిల్లా అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది జల్లికట్టు. ఈ జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడం తమకు లాభిస్తుందన్న అంచనాలో పన్నీర్ సెల్వం ఉన్నారు. తన కుమారుడి విజయం కోసం ఆయన కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మధురై జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తానే పోటీ చేస్తున్నట్లు భావించాలని తేని నియోజకవర్గం ప్రజలను పన్నీర్ సెల్వం కోరుతుండటం గమనార్హం. మొత్తం మీద పన్నీర్ సెల్వం వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రయోగం చేశారంటున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందనేది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News