అదే వదిలేశారు…దీని సంగతేంటి?

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం ఎదుర్కొన్న నేప‌థ్యంలో నాయ‌కులు ఇప్పటికీ గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. [more]

Update: 2019-08-29 05:00 GMT

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం ఎదుర్కొన్న నేప‌థ్యంలో నాయ‌కులు ఇప్పటికీ గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ముఖ్యంగా ప‌రిటాల ఫ్యామిలీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న తాజా ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. ప‌రిటాల ర‌వి వార‌సుడిగా రంగంలోకి దిగిన ప‌రిటాల శ్రీరాం రాప్తాడు నుంచి పోటీ చేశారు. అయితే, ఈయ‌న గెలుపు ఖాయ‌మ‌ని, ఇక‌, మెజారిటీపైనే అంచ‌నాల‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ప‌రిటాల వార‌సుడిగా ప‌రిటాల శ్రీరాం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంతో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఎన్నికల తర్వాత….

అయితే, అనూహ్యంగా ఎన్నిక‌ల్లో ప‌రిటాల శ్రీరాం ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఇప్ప టి వ‌ర‌కు ఏ కార్యక్రమంలోనూ అటు ప‌రిటాల సునీత కానీ, ఇటు ఆమె కుమారుడు ప‌రిటాల శ్రీరాం కానీ ఎక్కడా బ‌యట‌కు రాలేదు. రాప్తాడులో టీడీపీ శ్రేణుల‌ను న‌డిపించే నాయ‌కుడు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఎక్కడి క‌క్కడ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. సునీత రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డంతో ప‌రిటాల శ్రీరాం ఇప్పుడు ఇక్కడ దిక్కయ్యాడు.

నడిపించే వారు లేక….

ఈ నేప‌థ్యంలో రాఫ్తాడు ఫ్యూచ‌ర్‌పై అంద‌రూ త‌లలు ప‌ట్టుకున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మ‌రోప‌క్క, ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇక్కడ నిన్న మొన్నటి వ‌ర‌కు పార్టీ కార్యక‌లాపాలు చూసిన వ‌ర‌దాపురం సూరి.. ఇటీవ‌ల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ధ‌ర్మవ‌రంలో టీడీపీ శ్రేణుల‌కు దారి చూపించే నాథుడు క‌రువ‌య్యారు. అయితే, గ‌తంలో ఇక్కడ కూడా ప‌రిటాల ప్రభావం ఉండ‌డంతో దీనిని కూడా ఈ కుటుంబానికే అప్పగించాల‌ని పార్టీ అధినేత చంద్రబాబు భావించారు.

ప్రయోజనం ఉంటుందా?

ఈ క్రమంలోనే ఆయ‌న ఇక్కడ ఇటీవ‌ల ప‌ర్యటించి, ధ‌ర్మవ‌రం పార్టీ బాధ్యతల‌ను త్వర‌లోనే ప‌రిటాల కుటుంబానికి అప్పగిస్తామ‌ని ప్రక‌టించారు. రాఫ్తాడుతో పాటు ధ‌ర్మవ‌రంలోనూ ప‌రిటాల ఫ్యామిలీయే పార్టీ బాధ్యత‌లు చూసుకుంటుంద‌ని… సునీత‌, ప‌రిటాల శ్రీరాంల‌లో ఎవ‌రు ఎక్కడ బాధ్యత‌లు తీసుకుంటారో ? కూడా వాళ్లకే వ‌దిలేస్తున్నాన‌ని చెప్పారు. చంద్రబాబు ప్రక‌ట‌న వినేందుకు బాగానే ఉన్నా.. సిట్టింగ్ నియోజ‌క‌వ‌ర్గం రాప్తాడులోనే ప‌ట్టు నిలుపుకోలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న ఈ కుటుంబానికి ఇప్పుడు ధ‌ర్మవ‌రం ఇచ్చినా ప్రయోజ‌నం ఉంటుందా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

పట్టుకోసం…..

వాస్తవంగా చూస్తే పెనుకొండ ప‌రిటాల ఫ్యామిలీకి కంచుకోట‌. అక్కడ నుంచి బాబు ఈ ఫ్యామిలీని రాఫ్తాడుకు మార్చారు. తాజా ఎన్నిక‌ల్లో అక్కడ శ్రీరామ్ ఏకంగా 27 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఓడిపోయారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అటు రాఫ్తాడులోనే ప‌రిటాల ఫ్యామిలీ ప‌ట్టు నిలుపుకోలేని ప‌రిస్థితి. ఇక త‌ల్లి, కుమారుడు రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ హ‌వా కొన‌సాగించ‌డం అంత ఈజీ కాద‌ని టీడీపీ వ‌ర్గాలే చెపుతున్నాయి. ఏదేమైనా ఒక‌ప్పుడు రాష్ట్ర స్థాయిలో క్రేజ్ ఉన్న ప‌రిటాల ఫ్యామిలీ ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ప‌ట్టుకోసం ఆప‌సోపాలు ప‌డుతోంది.

Tags:    

Similar News