ఎవరికెంత లాభం..?

పవన్ కల్యాణ్ తో చేతులు కలపడంలో భారతీయ జనతాపార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుందనే భావన వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్ లోనూ, కర్ణాటకలోనూ సామాజిక సమీకరణలతో అనూహ్య విజయాలను [more]

Update: 2020-01-18 15:30 GMT

పవన్ కల్యాణ్ తో చేతులు కలపడంలో భారతీయ జనతాపార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుందనే భావన వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్ లోనూ, కర్ణాటకలోనూ సామాజిక సమీకరణలతో అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ ఆ రకమైన రాజకీయ ఉత్థానానికి ఆంధ్రప్రదేశ్ లోనూ అవకాశాలున్నట్లుగా గుర్తిస్తోంది. అందుకు పవన్ కల్యాణ్ తురుపుముక్కగా ఉపకరిస్తారనేది బీజేపీ అగ్రనాయకత్వం అంచనా. సొంతంగా ఎదగడం ప్లాన్ ఏ అయితే , మిత్రుల అండదండలతో పార్టీని విస్తరించుకోవడం బీజేపీ ప్లాన్ బీ. ఈ ద్విముఖ వ్యూహంలో భాగంగా ప్లాన్ బీ లో పవన్ భవిష్యత్తులో కీలక భూమిక పోషిస్తారనేది బీజేపీ శ్రేణుల విశ్వాసం.

ఆంధ్రాలో అండదండలు…

తెలుగు రాష్ట్రాల్లో రెండు బలమైన సామాజిక వర్గాలు ప్రధాన పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఆర్థికంగా, అంగబలం రీత్యా ఆయా సామాజిక వర్గాలకు ఉన్న ప్రాముఖ్యం, ప్రాధాన్యం తోసిపుచ్చలేనిది. జనాభా రీత్యా అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయాధికారం, ఆర్థికబలం విషయానికొచ్చేసరికి పవన్ కల్యాణ్ సామాజిక వర్గం వెనకబాటునకు గురై ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఆ వర్గంలో నెలకొన్న అసంతృప్తి సెగలే ముద్రగడ పద్మనాభం వంటి వారు ఉద్యమం చేసినప్పుడు బలమైన మద్దతు లభించడానికి కారణం. అయితే రాజకీయాధికారం దిశలో నడిపే ఏకసూత్రం కానీ స్థిరమైన నాయకత్వం కానీ ఆ వర్గానికి లభించడం లేదు. ఫలితంగా తాత్కాలిక సర్దుబాట్లతోనే సరిపోతోంది. అటు టీడీపీలో, ఇటు వైసీపీలో ఆ సామాజిక వర్గం నాయకులు మంత్రులుగా, మరికొన్ని కీలక పాత్రల్లో ఉన్నప్పటికీ వారిది ద్వితీయశ్రేణి ప్రాధాన్యమే. ఈ లోపాన్ని పూరించడానికి బీజేపీ కన్నాలక్ష్మీనారాయణకు రాష్ట్రశాఖ పగ్గాలు అప్పగించింది. అయినప్పటికీ జనసేన రంగంలో ఉండటంతో బీజేపీ బలపడటానికి ఆస్కారం ఏర్పడలేదు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు జట్టుకట్టడంతో బీజేపీ విస్తరణకు సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది ఒక అంచనా. రాష్ట్రజనాభాలో 16 శాతం పైచిలుకు ఉన్నటువంటి వర్గం ఈ కూటమిని సొంతం చేసుకోగలిగితే రాజకీయ ప్రాధాన్యం సహజంగానే పెరుగుతుంది. ఆ తర్వాత రాజకీయ ప్రాధాన్యం లేని మిగిలిన వర్గాలను చేరువ చేసుకునేందుకు, ఆకట్టుకునేందుకు కూటమి ద్వారా ప్రయత్నించవచ్చని బీజేపీ భావిస్తోంది. రాజకీయాధికారానికి జరిగే రేసులో తాము కూడా ప్రధాన పోటీదారులమన్న నమ్మకం కలిగిస్తేనే బీజేపీ, జనసేన కూటమిని ప్రజలు ఆదరిస్తారు. పవన్ చేరిక ఆ దిశలో పాజిటివ్ సంకేతంగా బీజేపీ విశ్వసిస్తోంది.

స్టార్ క్యాంపెయినర్…

ఉత్తరభారతదేశంలో బీజేపీకి నరేంద్రమోడీ పెద్ద క్యాంపెయినర్. బాలీవుడ్ కూడా ఆయనతో సన్నిహితంగానే ఉంటుంది. దక్షిణాదిన రజనీకాంత్ ను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. రజనీ సొంతంగా పార్టీ ఏర్పాట్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఒడిసా, తమిళనాడుల్లో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలపై ప్రభావం చూపగల స్థాయి పవన్ కు ఉందని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. తమ పార్టీకి దక్షిణాది స్టార్ క్యాంపెయినర్ గా జనసేనాని ఉపయోగపడతారని విశ్వసిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అమ్ములపొదిలో పవన్ ప్రధానాస్త్రంగా ఉపకరిస్తారనేది వారి అంచనా. ఈ విషయంలో బీజేపీ చాలా తెలివిగానే పావులు కదుపుతోంది. అటు జగన్ మోహన్ రెడ్డికి, ఇటు చంద్రబాబు నాయుడికి పవన్ కల్యాణ్ ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తారని చెప్పడం లేదు. తమ కూటమి ఆయా పార్టీలకు ప్రత్యామ్నాయం అని మాత్రమే చెబుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రొజెక్టు చేయడం లేదు. కమలంతో చేతులు కలిపే ముందు పవన్ కూడా ఈ డిమాండ్ ను బీజేపీ నాయకుల ముందు ఉంచినట్లు లేదు.

ఆప్షన్ బీజేపీ చెంతనే…

రాజకీయాల్లో సామాజిక సేవ అంతర్భాగమే అయినప్పటికీ అంతిమ లక్ష్యం మాత్రం అధికారమే. తమ విధానాలు, సిద్దాంతాల ద్వారా ప్రజలను ప్రభావితం చేసి తాము ఆశించిన సమాజాన్ని నిర్మించడం పాలిటిక్స్ లో కనిపించే లక్షణం. అందుకు అధికారమే మార్గం. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రకటించు కోలేకపోవడం పవన్ లో కనిపించే ప్రధాన బలహీనత. ఆ ప్రకటన చేయగలిగితే కూటమిలో ఏది ప్రధాన పార్టీయో తేలిపోతుంది. పవన్ రాకను బీజేపీలో అందరు నాయకులు స్వాగతిస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఈ పరిణామం కచ్చితంగా దోహదం చేస్తుందని చెబుతున్నారు. బిహార్ లో నితీశ్ నాయకత్వంలో బీజేపీ, జేడీయూలు పోటీ చేస్తాయని చెప్పినంత స్పష్టంగా, ఆంధ్రప్రదేశ్ విషయంలో చెప్పడం లేదు. బీజేపీయే పెద్దన్న పాత్ర పోషించాలనే దూరాలోచనతోనే ఈ అంశాన్ని పెండింగులో పెడుతున్నారనేది పరిశీలకుల విశ్లేషణ.

సినీరంగంతో అనుబంధం…

బీజేపీకి బాలీవుడ్ తో ఉన్నంత అనుబంధం దక్షిణాది పరిశ్రమలైన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ లతో లేదనే చెప్పాలి. పవన్ రూపంలో ఇప్పుడొక అవకాశం లభించింది. దీనిని క్రమేపీ విస్తరించుకొంటూ పోవడానికి కూడా పవన్ ను వినియోగించుకోవచ్చు. తమకు పెద్దగా స్టేక్స్ లేని రాష్ట్రంలో అయాచితంగా కలిసి వచ్చిన వరంగా పవర్ స్టార్ ను బీజేపీ నాయకత్వం చూస్తోంది. అయితే పవన్ చంచల నిర్ణయాలు తీసుకుంటారనే భయం కూడా ఉంది. అందుకే చర్చలు మొదలు కూటమి కట్టడం వరకూ అగ్రనాయక ద్వయమైన మోడీ, అమిత్ షాలు బహిరంగంగా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మోడీ, అమిత్ షాలు నేరుగా పవన్ తో సమావేశం కాలేదు. అటు పార్టీకి,, ఇటు కేంద్ర ప్రభుత్వానికి వారే పెద్దలు. అయినప్పటికీ కేంద్రప్రభుత్వంతో అధికారికంగా సంబంధం లేకుండా పార్టీ పరంగా బీజేపీ, జనసేనలు కలిసి నడుస్తున్నాయనే విధంగానే వ్యవహరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ తప్పిదాలు, ప్రస్తుత వైసీపీ సర్కారు వైఫల్యాలను పవన్ ద్వారా బలంగా ప్రచారంలోకి తేగలిగినప్పుడే కూటమి ఏర్పాటు ప్రయోజనం సిద్ధి స్తుంది. పవన్ పై ఇప్పటికే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే ముద్ర ఉంది. నిరంతరం ప్రజల్లో ఉండే మోడీ, అమిత్ షా ల నుంచి ప్రేరణ పొంది తన శైలిని మార్చుకుంటేనే జనసేన, బీజేపీల కూటమిని ప్రజలు గుర్తిస్తారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News