Pawan kalyan : ప్రయోగం చేయరట.. వాళ్లని ఒప్పిస్తారట

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పుడు వేరే దిక్కులేదు. బీజేపీలో కొనసాగితే మళ్లీ 2019 ఫలితాలు రిపీట్ అవుతాయి. అదే టీడీపీతో చేయి కలిపితే ప్రజలు [more]

Update: 2021-11-12 05:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పుడు వేరే దిక్కులేదు. బీజేపీలో కొనసాగితే మళ్లీ 2019 ఫలితాలు రిపీట్ అవుతాయి. అదే టీడీపీతో చేయి కలిపితే ప్రజలు విశ్వసించరు. దీంతో పవన్ కల్యాణ‌్ రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారని గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన కొట్టి పారేయలేదు. అలాగని సమర్థించనూ లేదు.

ఏడేళ్ల నుంచి….

పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టింది 2014లో. పార్టీ పెట్టిన ఏడేళ్లలో అనేక పార్టీలతో జతకట్టారు. పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న ముద్ర పడిపోయింది. 2014లో జనసేన పోటీ చేయకపోయినా పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు పాలనపైన కన్నా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీనే పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. దీనిపై పూర్తిగా వ్యతిరేకం రావడంతో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ లపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

గత ఎన్నికల్లో ఫలితాలు…

చివరకు 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగానే పోటీ చేశారు. ఒంటరిగా అంటే కమ్యునిస్టులు, బీఎస్పీలతో కలసి పోటీ చేశారు. కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పార్టీని మరో ఐదేళ్లు నడపలేక తిరిగి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పవన్ కల్యాణ‌్ బీజేపీ చెంత చేరారు. ఇక పార్టీని నడపాలంటే పైసలు అవసరం. దీంతో ఆయన మేకప్ వేసుకుని తిరిగి సినిమా షూటింగ్ లకు సిద్ధమయిపోయారు.

బీజేపీని ఒప్పించి….

మరోసారి తాను రాజకీయాల్లో ప్రయోగాలు చేయకూడదని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకోకున్నా టీడీపీతో ప్రయాణానికి రెడీ అయిపోయారు. ఆయన ఈ మధ్య కాలంలో పంపుతున్న సంకేతాలన్నీ అవే. బీజేపీ ఇక ఏపీలో ఎదగడం కష్టం. బీజేపీతో కలిసి పోటీ చేస్తే బూడిద తప్ప మరేదీ మిగలదు. అందుకే బీజేపీని ఒప్పించి టీడీపీతో జట్టు కట్టాలన్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News