ఢిల్లీ డీల్….ఒకే

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారాల్లో భారతీయ జనతాపార్టీ అగ్రనాయకత్వం జనసేనాని పవన్ కల్యాణ్ తో సంప్రతింపుల అంశం చర్చనీయమవుతోంది. ఇప్పటికే పార్టీతో పాటు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా కావాల్సినంత [more]

Update: 2020-01-11 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారాల్లో భారతీయ జనతాపార్టీ అగ్రనాయకత్వం జనసేనాని పవన్ కల్యాణ్ తో సంప్రతింపుల అంశం చర్చనీయమవుతోంది. ఇప్పటికే పార్టీతో పాటు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా కావాల్సినంత సమాచారం కేంద్రం వద్ద సిద్ధంగా ఉంది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ తో భేటీ వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో ముడిపడి ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని జనసేన బీజేపీ సంబంధాల పునరుద్ధరణ దిశలో అడుగులు పడుతున్నాయనే చెప్పుకోవాలి.

పిలుపుతో మలుపు…

ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని పటిష్టం చేయడానికి కాలం కలిసి వస్తోందని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. వైసీపీ సర్కారు దుందుడుకు నిర్ణయాలు అయాచిత వరంగా , అవకాశంగా మలచుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను తురుపుముక్కగా వినియోగించుకునే అవకాశం ఉందేమోనని బేరీజు వేస్తోంది. పవన్ కల్యాణ్ ను పూర్తిస్థాయి రాజకీయ వేత్తగా చెప్పలేం. సందర్బాన్ని, సమయాన్ని బట్టి ఆయన స్పందనలుంటాయి. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి నష్టపోయిందనే విషయాన్ని పవన్ కల్యాణ్ ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ గెలిచి ఉండేది కాదనే బలమైన భావనను పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తున్నారు. నరేంద్రమోడీని వ్యక్తిగతంగా లక్ష్యం చేయడంతో చంద్రబాబు నాయుడు బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు నేరుగా బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి సంప్రతింపులు జరపలేకపోతున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగింపుపై కేంద్రం మదిలో ఏముందనే విషయంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. తన కలల స్వప్నమైన అమరావతిని కొనసాగించే విషయంలో సాయం చేయాలని అభ్యర్థించే విషయంలో టీడీపీ అధినేతకు మొహమాటం అడ్డు వస్తోంది.

మధ్యేమార్గం…

చంద్రబాబు నాయుడు తరహాలో పవన్ కల్యాణ్ బీజేపీతో సంబంధాలను పూర్తిగా చెడగొట్టుకోలేదు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేసినప్పటికీ మోడీ, అమిత్ షా లతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ప్రజాకర్షణ రీత్యా ఒక బలమైన నాయకుడు పవన్ లో ఉన్నాడనేది అమిత్ షా అంచనా. బీజేపీలో కలిసిపోయి పార్టీ ప్రచార బాధ్యతలు స్వీకరించాలని గతంలో అమిత్ షా పవన్ ను అభ్యర్థించారు. దానిని తీవ్రంగా వ్యతిరేకించి సొంతంగానే జనసేనను ముందుకు తీసుకెళ్లారు పవన్. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీని తెలుగుదేశం, జనసేనలు విడివిడిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించాయి. మూడు రాజధానుల విషయంలో ఒకేమాటపై నిలిస్తేనే కొంతమేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించగలవు. అంతేకాకుండా కేంద్రం నుంచి రాజకీయ , నైతిక మద్దతు తోడైతే మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. సెక్రటేరియట్, అసెంబ్లీ ఒకేచోట ఉండాలని పవన్ కల్యాణ్ బలంగా భావిస్తున్నారు. మరోవైపు తన పాలనకాలంలో వేసిన అంచనాలు తలకిందులైన వాస్తవాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలన్న సీమ వాసుల సెంటిమెంటును, డిమాండును పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు రాజకీయ తప్పిదానికి పాల్పడ్డారు. ఫలితం అనుభవించారు. ఎన్నికల్లో టీడీపీ కి సీమలో కనిపించిన తీవ్ర వ్యతిరేకత అదే విషయాన్ని స్పష్టం చేసింది. హైకోర్టు కర్నూలులో పెట్టినా అసలు రాజధాని అమరావతిలో ఉంటే చాలని ఇప్పుడు కోరుకుంటోంది టీడీపీ. పవన్ కల్యాణ్ సైతం రాజధాని రైతులతో సమావేశం తర్వాత అమరావతివైపు స్పష్టంగా మొగ్గు కనబరుస్తున్నారు.

ఎట్టకేలకు ఏకాభిప్రాయం…

బీజేపీ రాష్ట్రశాఖ రెండు రకాల అభిప్రాయాలతో ఇంతవరకూ కొంత గందరగోళానికి తావిచ్చింది. అగ్రనాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఎట్టకేలకు ఏకాభిప్రాయానికి వచ్చారు. అమరావతి కొనసాగింపునే బీజేపీ కోరుకుంటోందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల కోరిక కూడా అదే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చు. సెక్రటేరియట్ తరలింపు విషయంలో రాష్ట్రసర్కారు దూకుడు కనబరిస్తే హైకోర్టు విషయంలో కేంద్రం మోకాలడ్డితే వైసీపీకి మొదటికే మోసం వస్తుంది. ఈ స్థితిలో పవన్ కల్యాణ్ తో బీజేపీ సంప్రతింపులు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య మళ్లీ మైత్రి చిగురించేందుకు ఒక ప్రాతిపదిక సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటు టీడీపీతోనూ, ఇటు బీజేపీతోనూ సత్సంబంధాలు ఉండి అగ్రనేతలతో నేరుగా చర్చలు జరపగల స్థాయి పవన్ కల్యాణ్ కు ఉందని రాజకీయ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. టీడీపీ, జనసేనలు రాష్ట్రంలో పరిష్కరించుకోవాల్సిన ప్రథమ సమస్య రాజధాని. వైసీపీపై ఆధిపత్యం నిరూపించుకోవాలనుకున్నా ఇదే ప్రధాన బాధ్యత. కర్తవ్యం కూడా. ఈ విషయంలో అవసరమైతే రాజకీయంగా రాజీపడి కేంద్రం ముందు మోకరిల్లాల్సి రావడమూ ఒక అనివార్యతే. ఇప్పటికే బీజేపీ రాష్ట్రశాఖ రాజధానిపై ఏకగ్రీవ తీర్మానం చేయడం టీడీపీ, జనసేనలకు గ్రీన్ సిగ్నల్ గానే భావించాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News