పవన్ వాటిని పట్టించుకోరా..?

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేన తనకు పట్టున్న ప్రాంతాన్ని వదిలి ఇతర జిల్లాలపై దృష్టి సారించారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయన ఇటీవల పర్యటించి [more]

Update: 2019-03-08 06:30 GMT

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేన తనకు పట్టున్న ప్రాంతాన్ని వదిలి ఇతర జిల్లాలపై దృష్టి సారించారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయన ఇటీవల పర్యటించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కడప కోటను బద్దలు కొడతామని ప్రకటించారు. కుటుంబ పాలనను అంతం చేస్తామని ప్రకటించారు. అయితే, ప్రస్తుత రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మూడున్నర కోట్ల ప్రజల వ్యక్తిగత వివరాలు ప్రైవేటు కంపెనీకి వెళ్లాలయనే కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రెండు రాష్ట్రాలూ పరస్పరం కేసులు పెట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో ఫారం – 7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.

వివాదాల జోలికి పాకుండా…

వారం రోజులుగా ఈ వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. అంతకుముందు కూడా దొంగ ఓట్లు ఉన్నాయంటూ వైసీపీ ఎన్నికల సంఘాన్ని, కోర్టును ఆశ్రయించింది. అయితే, ఇప్పుడు జరగుతున్న వ్యవహారంపై రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న జనసేన కానీ, అధినేత పవన్ కళ్యాణ్ కానీ స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంతో తనకు అవసరం లేదన్నట్లుగా ఆయన ఉన్నారు. ఇది రెండు రాష్ట్రాలు, కేసీఆర్, చంద్రబాబు అనే బలమైన ఇద్దరు నాయకుల మధ్య గొడవగా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆయన ఒక కామెంట్ మాత్రం చేశారు. వాస్తవానికి ఇది రెండు రాష్ట్రాల మధ్య గొడవగానే ఉన్నా ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు ప్రైవేటు కంపెనీ వద్ద ఉన్నాయనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యవహారం అయినా పవన్ కళ్యాణ్ ఇది చంద్రబాబు, కేసీఆర్ మధ్య వివాదంగా ప్రకటించేసి తప్పుకున్నారు. గతంలో ఓటుకు నోటు కేసు విషయంలోనూ పవన్ కళ్యాణ్ స్పందించకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. మరి, ప్రధాన పార్టీ అధినేతగా ఉండి కీలక వ్యవహారాలపై తన అభిప్రాయం చెప్పకపోవడంతో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.

దృష్టంతా ఎన్నికలపైనే..!

ఇక, ఎన్నికలపై కసరత్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో పొత్తును ఖరారు చేసుకునే దిశగా చర్చలు జరుపుతున్నారు. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ లెఫ్ట్ పార్టీలో చర్చిస్తున్నారు. ఇక, ఈ నెల 14వ తేదీన పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని జనసేన భావిస్తుంది. రాజమండ్రిలో ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, రాజమండ్రిలో ఇప్పటికే కవాతు నిర్వహించినందున ఇతర ప్రాంతంలో ఆవిర్భావ నిర్వహిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక, ఎంపీ అభ్యర్థుల వేటలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన ఎంపీ అభ్యర్థులను బరిలో దింపడానికి పలువురు ఇతర పార్టీల నేతలతో జనసేన నాయకులు టచ్ లో ఉన్నట్లు సమాచారం. టీడీపీ, వైసీపీలో సీట్లు దక్కే అవకాశం లేని కొందరు జనసేనలో చేరే అవకాశం ఉంది. మొత్తానికి పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న డేటా చోరీ, పారం -7 దుర్వినియోగం వ్యవహారాలను మాత్రం పట్టించుకోవడం లేదు.

Tags:    

Similar News