అంత పెద్ద ఆఫర్ వద్దనుకున్నారా..?
సినిమారంగంలో స్టార్. చిత్ర రంగంలో పవర్ తమ చుట్టూ తిప్పుకునే మెగా ఫ్యామిలీలో పెద్ద తార. అందులో సందేహమేమీ లేదు. మిగిలిన మెగా సభ్యులతో అంటీముట్టనట్లుగా ఉన్న [more]
సినిమారంగంలో స్టార్. చిత్ర రంగంలో పవర్ తమ చుట్టూ తిప్పుకునే మెగా ఫ్యామిలీలో పెద్ద తార. అందులో సందేహమేమీ లేదు. మిగిలిన మెగా సభ్యులతో అంటీముట్టనట్లుగా ఉన్న [more]
సినిమారంగంలో స్టార్. చిత్ర రంగంలో పవర్ తమ చుట్టూ తిప్పుకునే మెగా ఫ్యామిలీలో పెద్ద తార. అందులో సందేహమేమీ లేదు. మిగిలిన మెగా సభ్యులతో అంటీముట్టనట్లుగా ఉన్న ప్పటికీ కుటుంబంలోనూ , ప్రేక్షకుల్లోనూ అతనికున్న ఆదరణే వేరు. కానీ రాజకీయ రంగంలో అడుగడుగునా ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. చంచలమైన మనస్తత్వం కలిగి , దృఢమైన వైఖరితో ముందుకువేళ్లే ప్రణాళిక లేకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోంది పవన్ కల్యాణ్ పరిస్థితి. బీజేపీతో , తెలుగుదేశంతో విభేదించి 2019లో వామపక్షాలతో జట్టు కట్టారు. అస్తిత్వం కనుమరుగైపోతున్న కమ్యూనిస్టులతో కలిసి నడిస్తే రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టడమే అని గ్రహించారు. మళ్లీ కమలంతో చెలిమి చేశారు. ఇప్పుడు మరోసారి బీజేపీకి గుడ్ బై చెబితే ఎలా ఉంటుందనే పునరాలోచనలో పడ్డట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ దక్షిణభారతంలో రజనీకాంత్, పవన్ కల్యాణ్ లకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇద్దరిలో పొటెన్షియల్ లీడర్లను చూడాలనుకున్నారు. దానిని ఇద్దరూ చేజేతులారా వదిలేసుకున్నారనేది బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శ.
డబుల్ గేమ్..డైలమా..
2019 ఎన్నికలకు ముందు బీజేపీ జనసేనతో చెలిమి చేయాలని తహతహలాడింది. 2016 ప్రాంతంలో నరేంద్ర మోడీ తరఫున స్వయంగా అమిత్ షా పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. జనసేనను బీజేపీలో విలీనం చేయాల్సిందిగా కోరారు. అందుకు ప్రతిగా భవిష్యత్తులో బీజేపీ తరఫున ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రతిపాదించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈలోపు బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు పవన్ కల్యాణ్ కు కేంద్రమంత్రి పదవిని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అప్పటికే బీజేపీ అధిష్ఠానం లో వెంకయ్యనాయుడిని పక్కకి పెట్టాలనే ఆలోచన మొగ్గ తొడిగింది. చంద్రబాబు నాయుడితో వెంకయ్య నాయుడి అతి సాన్నిహిత్యం కారణంగా బీజేపీ అవకాశాలు దెబ్బతింటున్నాయని అగ్రనాయకుల అంచనా. పవన్ కల్యాణ్ ద్వారా పార్టీ పునర్వ్వవస్థాపన చేయాలనే భావనతో అగ్రనాయకులు అతనిని సంప్రతించారు. అప్పటికి పవన్ కల్యాణ్ సైతం సినిమారంగాన్ని వదిలేసి పూర్తిగా రాజకీయాల్లో కొనసాగాలనే ఆలోచనతోనే ఉన్నారు. తాను స్థాపించిన పార్టీ అటు వైసీపీ, ఇటు టీడీపీకి దీటుగా ఎదుగుతుందనే భ్రమలో బీజేపీ ఇచ్చిన ఆఫర్లను పవన్ కల్యాణ్ తోసిపుచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవా చూసిన తర్వాత బీజేపీ తన వైఖరిని మార్చుకుంది. భవిష్యత్ అవసరాల ద్రుష్ట్యా వైసీపితో అంతర్గత చెలిమి కొనసాగించాలని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. పవన్ తో చేతులు కలపడం ద్వారా రాష్ట్రంలో క్రమేపీ బలపడటం, అదే సమయంలో వైసీపీతో రాజకీయ అవసరాలను తీర్చుకోవడమనే ద్వంద్వ విధానాన్ని అమలు చేసేందుకు పూనుకున్నారు. అందులో బాగంగానే వైసీపీ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్న సోము వీర్రాజును అధ్యక్షునిగా ఎంపిక చేసుకున్నారు.
అందుకే వద్దన్నారా..?
రాజకీయంగా ఎదగాలంటే పవన్ కల్యాణ్ కు బీజేపీ ప్రతిపాదించిన ఆఫర్ బంగారు బాట లాంటిదే. అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి జగన్, కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు నాయుడు అధికార పీఠానికి శాశ్వత హక్కుదారులుగా క్లెయిం చేసుకుంటున్నారు. ఈ స్తితిలో జనాభా రీత్యా వారికంటే పెద్ద సామాజిక వర్గానికి వల వేయాలని చూసింది బీజేపీ. అందుకు పవన్ కల్యాణ్ సరైన మార్గంగా వారికి కనిపించారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి చిరంజీవి కాపు కమ్యూనిటీలో తన ఇమేజ్ ను దెబ్బ తీసుకున్నారు. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే తనకు కూడా అదే రకమైన నష్టం వాటిల్లుతుందని పవన్ కల్యాణ్ భావించారు. దాంతో కమలనాథులు ఇచ్చిన సీఎం అభ్యర్థిత్వాన్ని, కేంద్రమంత్రి పదవిని వదిలేసుకున్నారనేది ఢిల్లీ వర్గాల అంచనా. ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలతో బీజేపీకి పవన్ కల్యాణ్ పూర్తిగా దూరమయ్యారు. వామపక్షాలతో చేతులు కలిపారు. వైసీపీకి, టీడీపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలని ప్రయత్నించారు. అయితే తనకు సొంతంగా అంత బలం లేదనే విషయం ఎన్నికల తర్వాతనే గ్రహించారు. బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ లో దిట్ట. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాల మేళవింపును చేయడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆరకమైన ప్రభావాన్ని చూపగలుగుతుందనుకున్నారు. కానీ పార్టీకి మూలాలు బలహీనంగా ఉండటంతో అది సాధ్యం కావడం లేదు.
తాజా సంఘర్షణ…
పవన్ కల్యాణ్ తో చేతులు కలపడంలో బీజేపీకి ఒక వ్యూహం ఉంది. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేయడం కమలనాథుల లక్ష్యం. గడచిన 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు ఆటంకంగా పరిణమించారనేది ఆ పార్టీ అంచనా. తెలుగుదేశంతో విడివడిన తర్వాత తెలంగాణలో చాలా వేగంగా ఆపార్టీ బలపడింది. ఏపీలోనూ చంద్రబాబుకు దూరమైతే పవన్ కల్యాణ్ వంటి వారి తోడ్పాటుతో పుంజుకోవచ్చని అంచనా వేశారు. అందుకే జనసేనతో జట్టు కట్టారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపికి ఉన్న సామాజిక సమీకరణలు బలమైనవి. అందువల్ల జనసేన, బీజేపీ కూటమి ఇప్పట్లో అధికారానికి చేరువ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగుదేశం పూర్తిగా దెబ్బతింటేనే ఆ చాన్సు దక్కుతుంది. అందుకే వైసీపీతో ఘర్షణ విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. పవన్ కల్యాణ్ మాత్రం వైసీపీతో ముఖాముఖి ఫైట్ కోరుకుంటున్నారు. టీడీపీ పట్ల ఉదాసీనత కనబరుస్తున్నారు. బీజేపీ మరో విధంగా ఆలోచిస్తోంది. టీడీపీని లక్ష్యంగా చేసుకుంటూ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ, జనసేన కూటమి ఆక్రమించాలని ఆశిస్తోంది. పరస్పర భిన్నమైన ఈ వైరుద్ధ్యం కారణంగానే జనసేనకు, బీజేపీకి మధ్య తాజా సంఘర్షణ మొదలైందని చెప్పవచ్చు.
-ఎడిటోరియల్ డెస్క్