తాడిపత్రిలో మళ్లీ ఏకపక్షమే.. ఎందుకలా?

ఏ ఎన్నిక జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది తాడిపత్రి నియోజకవర్గం. ఇక్కడ జేసీ బ్రదర్స్ కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో తప్ప జేసీ బ్రదర్స్ [more]

Update: 2021-03-04 14:30 GMT

ఏ ఎన్నిక జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది తాడిపత్రి నియోజకవర్గం. ఇక్కడ జేసీ బ్రదర్స్ కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో తప్ప జేసీ బ్రదర్స్ కు ఓటమి అనేది తెలియదు. అలాంటిది ఇటీవల కాలంలో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ హవా తగ్గుతున్నట్లే కన్పిస్తుంది. దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ తాడిపత్రికి ప్రాతినిధ్యం వహించినా పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. తమ అనుయాయులకు తప్ప ఎవరికీ వీసమెత్తు ప్రయోజనం కూడా లేదు. అభివృద్ది కూడా పెద్దగా జరిగింది లేదు.

సానుభూతి ఉంటుందని…

అయినా జేసీ బ్రదర్స్ ను తాడిపత్రి ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోెనే జేసీ బ్రదర్స్ కు షాక్ తగిలింది. దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి వారి హవా తాడిపత్రిలో తగ్గడం ప్రారంభించింది. జేసీ బ్రదర్స్ పై అక్రమ కేసులు పెట్టడం, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారిని జైల్లో పెట్టడంతో సానుభూతి వెల్లువలా వస్తుందని భావించారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సయితం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడటం తనకు కలసి వస్తుందని జేసీ బ్రదర్స్ భావించారు.

మళ్లీ షాక్ ఇవ్వడంతో….

కానీ పంచాయతీ ఎన్నికలలో జేసీ బ్రదర్స్ కు ప్రజలు మళ్లీ షాక్ ఇచ్చారు. మొత్తం 82 పంచాయతీలకు తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 45 మంది వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఏడుచోట్ల వైసీపీ రెబల్ అభ్యర్థులు గెలిచారు. జేసీ బ్రదర్స్ బరిలోకి దింపిన వారిలో కేవలం 20 మంది మాత్రమే విజయం సాధించారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, తమపై సానుభూతి ఉంటుందని భావించిన జేసీ బ్రదర్స్ కు పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరాశను మిగిల్చాయి.

ఎన్నికలే ఫార్సు అంటూ…..

అందుకే పంచాయతీ ఎన్నికలను జేసీ బ్రదర్స్ ఒక ఫార్సుగా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల ఫలితాలను అధికార పార్టీ ఏకపక్షంగా ప్రకటించుకుందని స్టేట్ మెంట్ ఇచ్చి పారేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపెడతామని, తమకు నామినేషన్ వేసేందుకు మరోసారి అవకాశమివ్వాలని అభ్యర్థనకు దిగారు. ఇంతకాలం తాడిపత్రి నియోజకవర్గంలో తమ పట్టు సడలలేదని భావించిన జేసీ బ్రదర్స్ కు వైసీపీ గెలుచుకున్న సంఖ్య నిద్ర పట్టనివ్వడం లేదట. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News