విజయన్ కూడా అందరిలాంటోడే…?
సంప్రదాయ పార్టీలకు, సిద్ధాంత బలం గల పార్టీలకు ఎంతో తేడా ఉంది. సంప్రదాయ పార్టీల్లో కుటుంబాలకే ప్రాధాన్యం. కుటుంబంలోని వారు ఒకరి తరవాత మరొకరు బలాబలాలు, శక్తి [more]
సంప్రదాయ పార్టీలకు, సిద్ధాంత బలం గల పార్టీలకు ఎంతో తేడా ఉంది. సంప్రదాయ పార్టీల్లో కుటుంబాలకే ప్రాధాన్యం. కుటుంబంలోని వారు ఒకరి తరవాత మరొకరు బలాబలాలు, శక్తి [more]
సంప్రదాయ పార్టీలకు, సిద్ధాంత బలం గల పార్టీలకు ఎంతో తేడా ఉంది. సంప్రదాయ పార్టీల్లో కుటుంబాలకే ప్రాధాన్యం. కుటుంబంలోని వారు ఒకరి తరవాత మరొకరు బలాబలాలు, శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా వారసత్వంగా అధికారాన్ని చేపడతారు. జాతీస్థాయిలో కాంగ్రెస్, వివిధ రాష్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఇందుకు నిదర్శనం. భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు సిద్ధాంత బలం గల పార్టీలు. ఈ పార్టీల్లో వారసత్వ ఛాయలే ఉండవు. ఎవరైనా వ్యక్తిగత సామర్థ్యం, ప్రజల్లో బలం గల నాయకుడికే పదవులు లభిస్తాయి. ఇప్పటివరకూ ఈ పార్టీల్లో నడుస్తున్న చరిత్ర ఇదీ. ఉదాహరణకు నరేంద్ర మోదీనే తీసుకుంటే ఆయన ఓ సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి అత్యున్నత స్థాయికి కేవలం తన ప్రతిభా పాటవాలతోనే చేరుకున్నారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. వామపక్ష పార్టీలు కూడా ఇప్పటివరకూ ఇదే బాటలోనే నడిచాయి. ఒక నాయకుడి ఎదుగుదలలో సిద్ధాంత బలం, పార్టీ నిర్మాణంలో అతని పాత్ర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునేవి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఆయన ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా మేనల్లుడు. తెలంగాణకు చెందిన సురవరం సుధాకరరెడ్డి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో ఎన్నికయ్యారు.
వామపక్ష పార్టీల్లోనూ…?
కానీ ఇటీవల కాలంలో వామపక్ష పార్టీల్లో ముఖ్యంగా సీపీఎంలో కొంత సంప్రదాయం మొదలైంది. త్రిపుర, బెంగాల్ లో కొడిగట్టిన సీపీఎం కేరళలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఇందుకు కారణం ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వ బలం తప్ప పార్టీ బలం కాదన్నది చేదు నిజం. కేరళ చరిత్రలో నాలుగు దశాబ్దాల తరవాత రెండోసారి గెలవడం ద్వారా పినరయి విజయన్ నూతన చరిత్రను లిఖించారు. ఈ నేపథ్యంలో పాత మంత్రివర్గాన్ని పూర్తిగా రద్దు చేసి పూర్తిగా కొత్తవారితో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తన అల్లుడు పి.ఎ. మహమ్మద్ రియాజ్ ను మంత్రివర్గంలోకి
తీసుకోవడం ద్వారా సంప్రదాయ పార్టీలకు, సీపీఎంకు పెద్ద తేడా లేదని నిరూపించారు. వామపక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు.
అతీతులు కారని….?
ఎవరెవరిని మంత్రులుగా తీసుకోవడమన్నది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిన అధికారం. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. అయినప్పటికీ తన సొంత అల్లుడిని కేబినెట్ సహచరుడిగా ఎంపిక చేసుకోవడం ద్వారా పినరయి విజయన్ ఒక దుస్సంప్రదాయానికి తెరతీశారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా పార్టీ ప్రాభవం కొడిగడుతున్న నేపథ్యంలో రాష్ర్టంలో రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా పినరయి విజయన్ పార్టీపై పూర్తిగా పట్టు బిగించారు. ప్రస్తుతం పార్టీలో ఆయన మాటకు ఎదురులేదు. నిర్ణయాలకు తిరుగులేదు. పినరయి విజయన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం ఈ విషయంపై మౌనం వహించడం గమనార్హం. ఆయన నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
గత ఏడాది వివాహం…
కోజికోడ్ జిల్లాలోని బేపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రియాజ్ పార్టీ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఇండియా) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తరవాత పార్టీ యువజన విభాగం డీవైఎఫ్ఐ (డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో కోజికోడ్ నుంచి పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయారు. గత ఏడాది జూన్ లో పినరయి విజయన్ కూతురు వీణను వివాహం చేసుకన్నారు. వీరిద్దరిది రెండో పెళ్లి. బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థ అధిపతి అయిన వీణకు తొలి వివాహం ద్వారా ఒకరు, రియాజ్ కు మొదటి పెళ్లి ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. బేపూర్ నుంచి 28వేలకు పైగా మెజార్టీతో ఎన్నికైన రియాజ్ పీడబ్యూడీ, పర్యాటక శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయవాది అయిన రియాజ్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో సందేహం లేదు. కానీ ఆయన పినరయి విజయన్ అల్లుడు కాకపోతే మంత్రి అవుతారా అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం లభించడం కష్టమే.
-ఎడిటోరియల్ డెస్క్