విజయన్ కు గుడ్ సిగ్నల్స్… మరోసారి?

కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు ఎన్నికలకు ముందు శుభసంకేతాలు అందినట్లే. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. [more]

Update: 2021-01-02 16:30 GMT

కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు ఎన్నికలకు ముందు శుభసంకేతాలు అందినట్లే. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. డిసెంబరు 8వ తేదీన కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మొత్తం 941 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 516కు పైగా స్థానాల్లో విజయం సాధంచడం విశేషం. కేరళ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం ఎల్డీఎఫ్ కు పెద్ద ఊరటేనని చెప్పుకోవాలి.

ఒకసారి గెలిచిన పార్టీని….

సహజంగా కేరళకు ఒక సంప్రదాయం ఉంది. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదు. గత ఎన్నికలలో ఎల్డీఎఫ్ విజయం సాధించింది. పినరయి విజయన్ ముఖ్యమంత్రి అయ్యారు. అనేక క్లిష్ట సమయాలను పినరయి విజయన్ ఎదుర్కొన్నారు. ఒకవైపు వరదలు, తుపానులతో కేరళ రాష్ట్రం విలవిలలాడింది. దీనిని విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోయినా విజయన్ బాధితులకు ఇబ్బంది కలిగించలేదు.

అన్ని ఇబ్బందులను…..

అలాగే కరోనా తొలి కేసు కూడా కేరళలో నమోదయింది. కరోనాను నియంత్రించడంలో పినరయి విజయన్ ముందున్నారు. ఇలా పినరయి విజయన్ కేరళను అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలన్నది ఇప్పటి వరకూ సీపీఎం ఆలోచన. బహుశా రానున్న కాలంలో ఆలోచన మారితే మారే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలిచేందుకు పినరయి విజయన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో…..

కానీ గోల్డ్ స్కామ్ కేసు పినరయి విజయన్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. విపక్షాలు ఈ స్కామ్ ను తమకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆయన ప్రమేయం లేకపోయినా బురదచల్లే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అయితే తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించడంతో విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మడం లేదని తేలిపోయింది. అలాగే పినరయి విజయన్ పై నమ్మకం సడలలేదని అర్ధమయింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తీరున ప్రజలు నిలబడితే మరోసారి పినరయి విజయన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.

Tags:    

Similar News