“గాలి” కొట్టేదెవరు…?

గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురు లేద‌నే మాట‌ వాస్తవం. ఇక్కడ నుంచి అనేక మంది మేధావులు, విద్యావేత్తలు, డాక్టర్లు కూడా ఈ పార్టీ త‌ర‌ఫున పోటీచేసి చ‌ట్టస‌భ‌ల‌కు [more]

Update: 2019-11-29 13:30 GMT

గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురు లేద‌నే మాట‌ వాస్తవం. ఇక్కడ నుంచి అనేక మంది మేధావులు, విద్యావేత్తలు, డాక్టర్లు కూడా ఈ పార్టీ త‌ర‌ఫున పోటీచేసి చ‌ట్టస‌భ‌ల‌కు ప్రాతినిథ్యం వ‌హించారు. 2014లో అయితే మెజార్టీ సీట్లలో ఈ జిల్లాలో టీడీపీ పాగా వేసింది. అయితే, కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పార్టీ ఇప్పటికీ డ‌మ్మీగానే ఉండ‌డం త‌మ్ముళ్లను క‌ల‌చి వేస్తోంది. పార్టీ అధికారంలోకి రాక‌ముందు, వ‌చ్చిన త‌ర్వాత‌, ఇప్పుడు కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఊసకూడా క‌నిపించ‌డం లేదు. అలాంటి నియోజ‌వ‌క‌ర్గాల్లో ఒక‌టి మాచ‌ర్ల. ప‌ల్నాడు ప్రాంతంలో ఉన్న మాచ‌ర్లలో టీడీపీ జెండా ఎగిరి దాదాపు 20 ఏళ్ల పైమాటే అయిందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

1999 నుంచి అంతే….

విష‌యంలోకి వెళ్తే.. 1999లో జూల‌కంటి దుర్గాంబ‌.. మాచ‌ర్ల టికెట్‌పై టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి ల‌క్ష్మారెడ్డిపై ఆమె విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత టీడీపీ ఇప్పటి వ‌ర‌కు ఇక్కడ గెలిచింది లేదు. ఆ త‌ర్వాత అనేక ఎన్నిక‌లు వ‌చ్చాయి. 2012లో ఉప ఎన్నిక కూడా వ‌చ్చింది. అయినా కూడా టీడీపీ ఇక్కడ పాగా వేయ‌లేక పోయింది. 2004, 2009లో టీడీపీ త‌ర‌ఫున‌ బ్రహ్మానంద‌రెడ్డి పోటీ చేశారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ త‌ర‌పున 2004లో పిన్మెల్లి ల‌క్ష్మారెడ్డి ఆ త‌ర్వాత 2009లో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పోటీ చేసి రెండు సార్లు విజ‌యం సాధించారు. త‌ర్వాత రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో పిన్నెల్లి లక్ష్మారెడ్డి వైసీపీ కి జై కొట్టారు.

ఎన్ని ప్రయోగాలు చేసినా….

ఈ క్రమంలోనే 2012లో ఉప ఎన్నిక వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల‌లో టీడీపీ అభ్యర్థిగా చిరుమామిళ్ల మ‌ధుబాబు రంగంలోకి దిగారు. అయితే, ఈయ‌న కూడా పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిపై విజ‌యం సాధించ‌లేక పోయారు. మాచ‌ర్లలో 1989 త‌ర్వాత టీడీపీ ప్రయోగం చేసి క‌మ్మ వ‌ర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దింపినా ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, 2014 ఎన్ని క‌ల్లో మ‌ళ్లీ పాత వారిని ప‌క్కన పెట్టిన టీడీపీ ఇక్కడ నుంచి కొమ్మారెడ్డి చెల‌మారెడ్డిని పోటీకి దింపింది. ఈయన కూడా ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్నారు. ఇక‌, తాజాగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్థానికుల‌ను ప‌క్కన‌పెట్టిన చంద్రబాబు.. అన్నపురెడ్డి అంజిరెడ్డిని తెచ్చి పోటీ చేయించారు. అయితే, జ‌గ‌న్ సునామీ, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి హ‌వా ముందు ఈయ‌న కూడా నిల‌బ‌డ‌లేక పోయారు.

వరసగా మారుస్తుండటం వల్లనే…

చిత్రం ఏంటంటే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి (వైసీపీ)ని ప‌క్కన పెట్టి అప్పటి గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుకు ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను అన‌ధికారికంగా అప్పగించారు. దీంతో ఇక్కడ పుంజుకోవాల‌ని ప్రయ‌త్నించారు. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి నాయ‌కుల‌ను మారుస్తుండ‌డంతో పార్టీలో కేడ‌ర్ క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితిని కోల్పోయింది.

మున్సిపల్ ఛైర్మన్లను కూడా….

మ‌రో విచిత్రం ఏంటంటే మాచ‌ర్లలో గ‌త మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచింది. ఐదేళ్లలో న‌లుగురు మునిసిపల్ చైర్మన్లను మార్చారు. దీంతో పార్టీలో బ‌లం త‌గ్గిపోయి.. కేడ‌ర్ క‌లిసి రాలేదు. ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌లు అయిన వెంట‌నే అంజిరెడ్డి హైద‌రాబాద్‌కు జంప్ చేసేవారు. దీంతో ఇప్పుడు ఇక్కడ పార్టీని ప‌ట్టించుకునే నాధుడేలేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రోప‌క్క, వ‌రుస‌ విజ‌యాల‌తో దూసుకుపోతున్న పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి మ‌రింత‌గా ప‌ట్టు పెంచుకునేందుకు నియోజ‌క‌వ‌ర్గాన్నే అంటి పెట్టుకుని, స‌మ‌స్యల‌పై పోరాటం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇక్కడ టీడీపీ పుంజుకుంటుందా ? ఇక ఆశ‌లు వ‌దులు కోవాల్సిందేనా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News