పది మంది జంప్ అయినట్లేనా…?

కర్ణాటక రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనపడుతోంది. సంకీర్ణ సర్కార్ కు ధోకా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని జంప్ చేసేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు కాంగ్రెస్ [more]

Update: 2019-01-14 18:29 GMT

కర్ణాటక రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనపడుతోంది. సంకీర్ణ సర్కార్ కు ధోకా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని జంప్ చేసేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు కాంగ్రెస్ నేతలను కలవరపెడుతున్నాయి. దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఢిల్లీకి చేరుకుని తమతో మంతనాలు జరుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆనుపానులపై ఆరాతీయడం ప్రారంభించింది. కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లినట్లు ధృవీకరించుకున్న కాంగ్రెస్ పార్టీ వారితో మాట్లాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

పండగ తర్వాత…..

సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని యడ్యూరప్ప ప్రకటించారు. తాము ఎవరినీ ఆహ్వానించడం లేదని, తమంతట తాముగా తమ చెంతకు వస్తే వారిని కాదనబోమని కూడా ఆయన తేల్చి చెప్పడం విశేషం. మొత్తం పదిమంది నుంచి పాతిక మంది వరకూ సంకీర్ణ సర్కార్..ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. వీరంతా ఒకచోట సమావేశం కాకపోయినా ఎవరికి వారే బీజేపీ కేంద్ర నాయకత్వంలోకి టచ్ లోకి వెళుతున్నట్లు అంటున్నారు.

జేడీఎస్ అసంతృప్తితో….

కాంగ్రెస్ నేత, మంత్రి డీకే శివకుమార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం విశేషం. ముగ్గురు ఎమ్మెల్యేలు ముంబయిలో ఉన్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. కొన్నాళ్లుగా ముంబయి వేదికగానే ఆపరేషన్ కమల్ స్టార్టయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కాంగ్రెస్ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో జంప్ జిలానీలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటారోనన్న ఉత్కంఠ కన్నడ రాష్ట్రంలో నెలకొంది.

Tags:    

Similar News