కళ్లెం వేస్తున్నాయా..?

దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు శృతి మించుతున్నాయి. ప్రజాప్రయోజనాలు, రాజ్యాంగ రక్షణ వంటి అంశాలను పక్కనపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు, పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న ఉదంతాలు [more]

Update: 2020-02-28 16:30 GMT

దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు శృతి మించుతున్నాయి. ప్రజాప్రయోజనాలు, రాజ్యాంగ రక్షణ వంటి అంశాలను పక్కనపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు, పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న ఉదంతాలు నానాటికీ పెరుగుతున్నాయి. అనేక అంశాల్లో న్యాయవ్యవస్థపై సైతం విమర్శలు ఉన్నప్పటికీ ఎంతోకొంత మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసే బాధ్యతను న్యాయస్థానాలు తీసుకోవడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. పార్టీల మధ్య ప్రతీకార వైఖరులు, ఆధిపత్య ధోరణులు పెరిగిపోవడంతో ప్రజాస్వామ్యం సైతం ప్రమాదంలో పడుతోంది. పౌరహక్కులు, చట్ట బద్ద పాలన విషయంలో రాజ్యాంగానికి భాష్యం చెప్పి ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేసే అధికారం , హక్కు న్యాయస్థానాలకే ఉంది. అందుకే పలు సందర్బాల్లో హైకోర్టు, సుప్రీం కోర్టు వంటి సర్వోన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఎన్నికైన ప్రభుత్వాలకు కొంచెం అవమానకరమే. అధికార పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన సున్నితమైన విభజన రేఖ చెరిగిపోయింది. దాంతో న్యాయస్థానాలు క్రియాశీలతను ప్రదర్శించాల్సి వస్తోంది. ఎన్నికైన సర్కారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదనేందుకు సూచకంగానే కోర్టుల జోక్యాన్ని పరిగణించాల్సి ఉంటుంది.

పక్కా పాలిటిక్స్…

ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర, దేశ ప్రగతి వంటి అంశాలపై పెద్దగా యోచన చేయడం లేదని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ తక్షణం లభించే రాజకీయ ప్రయోజనాల గురించే వాటి లెక్కలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం తొలి దశలో చాలా మేరకు పార్టీల మద్దతు కూడగట్టగలిగింది. నిజానికి దీనివల్ల దేశంలో ఉన్న ముస్లింల హక్కులకు భంగం వాటిల్లదని చట్టంలోనే స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఆయా వర్గాలకు ముందస్తుగా చెప్పే ప్రయత్నం సాగలేదు. ఫలితంగా కొన్ని అపోహలతో, బీజేపీ దూకుడుని చూసి మైనార్టీ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయి. తాడోపేడో తేల్చుకోవాలనే స్థితికి వచ్చాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎలాగూ ఆజ్యం పోస్తాయి. ఫలితంగానే ఢిల్లీలో చోటు చేసుకున్న తీవ్ర పరిణామాలు అంతర్జాతీయ సమాజంలో భారత ప్రతిష్ఠను పలచబార్చాయి. దీనివల్ల బీజేపీ, కాంగ్రెసు, వామపక్షాలు, ఇతర విపక్ష పార్టీలు పొందే ప్రయోజనమేమిటో ఎవరికీ అర్థం కాదు. ఒకవైపు సమాజంలో అశాంతి నెలకొంటుంటే పరస్పరం నిందించుకుంటూ ఫిర్యాదులు, ఆరోపణలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారు నాయకులు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రజల దృష్టిలో పార్టీల నేతల పట్ల గౌరవం మరింతగా దిగజారుతుంది.

రాజ్యాంగ విలువలు…

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పార్టీకి చెందిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. విధానపరమైన నిర్ణయాల్లో సైతం వారికి భాగస్వామ్యం ఉంటుంది. అయితే దాని అర్థం ప్రభుత్వం, పార్టీ ఒకటే అని కాదు. గతంలో కేంద్రంలో కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడే పార్టీ అధ్యక్షుడు, ప్రధాని వేర్వేరుగా ఉన్నప్పుడు విధానపరమైన విషయాల్లో విభేదించుకున్న సందర్బాలు సైతం ఉన్నాయి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. కానీ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి వ్యవస్థలన్నిటినీ పార్టీకి విధేయంగా మార్చేయాలనుకోవడమే నేటి తప్పిదం. ఢిల్లీ అల్లర్ల విషయంలో ఇదే అంశాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవైపు హింసాకాండ చెలరేగుతున్నప్పటికీ తమ బాధ్యతలు నిర్వహించకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంలోని ఆంతర్యాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు నిలదీశాయి. తమ పొలిటికల్ బాసులు చెప్పేవరకూ వేచి చూస్తామనే ధోరణి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేసింది. కనీసం మత ఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన నాయకులపై కేసుల నమోదుకు సైతం సాహసించలేదు. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతున్నతీరుకు ఇదో నిదర్శనం.

తెలుగు రాష్ట్రాల్లోనూ…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతీకార రాజకీయాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. తొలిదశలో తెలంగాణ ప్రభుత్వం దుందుడుకు నిర్ణయాలు తీసుకున్న ప్రతి సందర్భంలోనూ న్యాయస్థానమే సరిదిద్దింది. జోక్యం చేసుకుంది. ప్రజాస్వామిక ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పూచీకత్తుగా నిలిచింది. వైసీపీ సర్కారు, టీడీపీ ల పోరులో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి అంశమూ వివాదాల మయమవుతోంది. మూడు రాజధానుల అంశం ఎలాగూ పెద్ద విషయం . దానిపై కేంద్రం సహా మొత్తం వ్యవస్థలన్నీ స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి సాధారణ నిర్ణయాలు సైతం న్యాయసమీక్షకు లోనవుతున్నాయి. విశాల హితం అన్న భావనతో వ్యవహరించినప్పుడు సాధారణంగా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న ఉద్దేశాలు అనవసర ప్రతిష్ఠకు, పేచీలకు దారి తీస్తున్నాయి. తాడోపేడో తేల్చుకోవాలనే ధోరణితో పార్టీలు తెగిస్తున్నాయి. ఫలితంగా న్యాయస్థానం పరిపాలన విషయాల్లోనూ తీర్పులు చెప్పక తప్పని స్థితి నెలకొంటోంది. విశాఖ పట్నంలో ప్రతిపక్ష నాయకుని పర్యటన సాధారణ రాజకీయ అంశం. దానిని నిరోధించడం ద్వారా ప్రభుత్వమూ, పోలీసు శాఖ నిందితులుగా న్యాయస్థానం ముందు నిలవాల్సి వచ్చింది. విధానపరమైన విషయాలు, సంక్షేమం, రాష్ట్ర ప్రగతి లక్ష్యాలుగా ప్రభుత్వాలు ముందడుగు వేస్తే ప్రతిపక్షాలు ఎంతగా యాగీ చేసినా ప్రజాకోర్టులో మంచే జరుగుతుంది. లేకపోతే సాధారణ కోర్టులో పేచీలతోనే అధికార,ప్రతిపక్షాలకు సమయం సరిపోతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News