దాదా… దరిచేరిందిలా…!!
ప్రణబ్ ముఖర్జీ…… భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడులాంటి వారు. అయిదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను, ఎత్తుపల్లాలను చూశారు. ఆదర్శ రాజకీయ నాయకుడిగా ప్రస్థానం సాగించారు. [more]
ప్రణబ్ ముఖర్జీ…… భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడులాంటి వారు. అయిదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను, ఎత్తుపల్లాలను చూశారు. ఆదర్శ రాజకీయ నాయకుడిగా ప్రస్థానం సాగించారు. [more]
ప్రణబ్ ముఖర్జీ…… భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడులాంటి వారు. అయిదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను, ఎత్తుపల్లాలను చూశారు. ఆదర్శ రాజకీయ నాయకుడిగా ప్రస్థానం సాగించారు. నిరంతర అధ్యయనం, విషయ పరిజ్ఞానం, నేర్పు, ఓర్పు, సంయమనం, సమయోచితంగా వ్యవహరించడంలో ఆయన దిట్ట. ఇతరులను తన వాదనాపటిమతో ఒప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. పెద్దగా ప్రజాదరణ లేనప్పటికీ అయిదు దశాబ్దాల పాట ప్రజాజీవితంలో కొనసాగడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. చేపట్టిన పదవులకు తనదైన పనితీరుతో వన్నెతెచ్చిన నాయకుడు. నేటి తరం నాయకులకు ప్రణబ్ ముఖర్జీ ఆదర్శమనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇందిర దృష్టిలో పడి….
పశ్చిమ బెంగాల్ కు చెందిన “మిరాట్” లో 1935 డిసెంబరు 11న జన్మించిన ప్రణబ్ ఉన్నత విద్యను అభ్యసించారు. చరిత్ర, రాజకీయ శాస్త్రంలో పీజీ చేయడంతో పాటు న్యాయశాస్త్రాన్ని చదివారు. రాజకీయ కుటుంబం కావడంతో కాంగ్రెస్ లో చేరారు. 1969లో జరిగిన బంగ్లా కాంగ్రెస్ సమావేశంలో ధాటిగా ప్రసంగిస్తున్న ఓ యువకుడిని చూసి ప్రధాని ఇందిరాగాంధీ ముగ్దులయ్యారు. అతని ప్రసంగం తీరు, విషయ పరిజ్ఞానం ఆమెను ఆకట్టుకుంది. ఆయనే ప్రణబ్ ముఖర్జీ. ఇలాంటి నాయకుడు తన బృందంలో ఉండాలని భావించి వెంటనే రాజ్యసభకు ఎంపిక చేశారు. అప్పటికి ఆయన వయస్సు 34 సంవత్సరాలు. రాజ్యసభకు పెద్దల సభ అని పేరుంది. అంటే వివిధ రంగాల నిపుణులు, రాజకీయంగా తలనెరిసిన వారు ఇందులో సభ్యులుగా ఉంటారు. అలాంటిది ఒక నవ యువకుడు కొత్తగా సభలోకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక ప్రణబ్ కు వెనుదిరిగి చూసే పరిస్థితి రాలేదు. పార్టీలో ఇందిరకు అత్యంత విధేయుడిగా ఎదిగారు. సొంతంగా తొలిసారి 1973లో కేంద్రమంత్రి అయ్యారు. 1982లో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ సారథిగా వ్యవహరించారు. అప్పటికి ఆయన వయస్సు 47 ఏళ్లు. అంత చిన్న వయస్సులో ఆర్థిక శాఖ మంత్రి అయినది రాజకీయ చరిత్రలో ఆయన ఒక్కరే కావడం విశేషం. అప్పట్లో ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించారు. అదే మన్మోహన్ మంత్రివర్గంలో 2004 నుంచి 2012 వరకూ మంత్రిగా పనిచేయడం రాజకీయ వైచిత్రిగా పేర్కొనవచ్చు.
రాజీవ్ పక్కన పెట్టడంతో…..
ఇందిరాగాంధీ హత్య సందర్భంగా 1984 అక్బోబరులో ఆమె తర్వాత సీనియర్ అయిన ప్రణబ్ ప్రధాని అవుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఆమె కుమారుడు రాజీవ్ గాంధీకి పగ్గాలు లభించాయి. ప్రధాని పదవికి పోటీ పడ్డారన్న ఉద్దేశ్యంతో రాజీవ్ గాంధీ ప్రణబ్ ను శంకరగిరి మాన్యాలను పట్టించారు. రాష్ట్ర రాజకీయాలకు పంపారు. దీంతో ఆగ్రహించిన ప్రణబ్ సొంతంగా రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ (ఆర్.ఎస్.సి.)ను స్థాపించారు. 1987 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో కాంగ్రెస్ లో విలీనం చేశారు. 1991లో రాజీవ్ హత్యానంతరం పీవీ నరసింహారావు ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో ప్రణబ్ దశ తిరిగింది. ఆయన హయాంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, విదేశాంగ మంత్రిగా, వాణిజ్య మంత్రిగా పనిచేశారు. 1998లో సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంలో ప్రణబ్ పాత్ర కీలకం. అప్పటి నుంచి ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు.
రెండుసార్లు ఆశించినా…..
2004 లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన తర్వాత ప్రధాని పదవి చేపట్టబోనని సోనియా ప్రకటించారు. దీంతో అందరి దృష్టి సీనియర్ అయిన ప్రణబ్ పైకి మళ్లింది. ఆయన కూడా ప్రధాని పదవిని ఆశించారు. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలుసుకున్న బృందంలో సోనియా, ప్రణబ్, మన్మోహన్ ఉన్నారు. అందరూ ప్రణబ్ పేరు వెల్లడిస్తారని భావించారు. కానీ సోనియా అనూహ్యంగా మన్మోహన్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రణబ్ కు నిరాశ ఎదురైంది. మంత్రివర్గంలో కనీసం కీలక శాఖ కూడా లభించలేదు. ఆయనకు అత్యంత ఇష్టమైన ఆర్థిక శాఖను కాకుండా అంతగా ప్రాధాన్యం లేని రక్షణ శాఖను కేటాయించారు. తర్వాత విదేశాంగ శాఖను కేటాయించారు. 2009లో యూపీఏ రెండోసారి విజయం సాధించిన తర్వాత కూడా ప్రధాని పదవికి దూరంగా పెట్టారు. చివరికి ఆర్థికశాఖను అప్పగించారు. సంస్కరణవాదిగా పేరుగాంచిన ప్రణబ్ 2010లో ఆసియా అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా అవార్డు పొందారు. అంతకుముందు 2008లో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని పొందారు. ఆర్థికవేత్తగా, ఐఎంఎఫ్ , ఆసియా డెవలెప్ మెంట్ బ్యాంకులకు బోర్డు ఆఫ్ గవర్నర్ గా వ్యవహరించారు. అర్థ శాస్త్రాన్ని చదవనప్పటికీ గొప్ప ఆర్థికవేత్త కావడం విశేషం.
రాష్ట్రపతిగా ఎన్నికైనా……
ప్రతిభాపాటిల్ పదవీ విరమణ అనంతరం 2007లో రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవికి ఆయన నూరుశాతం అర్హుడు. అత్యున్నత పదవిలో ఉంటూనే పార్టీకి, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేవారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం గత ఏడాది నాగపూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరుకావడం వివాదాస్పదమైంది. ప్రణబ్ భార్య సువ్రా ముఖర్జీ అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడు అభిజిత్ ముఖర్జీ బెంగాల్ లోని జంగీపూర్ పార్లమెంటు సభ్యుడు. గతంలో ప్రణబ్ ఇక్కడి నుంచి 2004, 2009లో ఎన్నికయ్యారు. ఆయన కుమార్తె నాట్యకళాకారిణి అయిన శర్మిష్టా ముఖర్జీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. “ఈ దేశానికి నేను చేసినదానికన్నా దేశం నాకు ఎక్కువ ఇచ్చింది” అన్న ప్రణబ్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు, వినమ్రతకు నిదర్శనం. నేటితరం నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సి ఉందనడంలో సందేహం లేదు. అందుకే ఆయనకు భారతరత్న దరిచేరింది.
-ఎడిటోరియల్ డెస్క్