జగన్ కు ఆప్షన్లు పెంచుతున్న పీకే

ఈ రోజు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వారిలో ప్రశాంత్ కిశోర్ ముందుంటారు అని చెప్పాలి. రాజకీయ వ్యూహకర్త స్థాయి నుంచి ఆయన రాజకీయ చాణక్యుడిగా ఎదిగారు. [more]

Update: 2021-07-27 06:30 GMT

ఈ రోజు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వారిలో ప్రశాంత్ కిశోర్ ముందుంటారు అని చెప్పాలి. రాజకీయ వ్యూహకర్త స్థాయి నుంచి ఆయన రాజకీయ చాణక్యుడిగా ఎదిగారు. ఆయన దేశంలో చిందరవందరగా ఉన్న రాజకీయ పార్టీలను ఒక్కటిగా చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక్కడ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేకు కలసివచ్చే అంశం ఏంటి అంటే ఆయన వ్యూహాలతో చాలా రాష్ట్రాలలో ముఖ్యామంత్రులుగా అయిన వారు ఉన్నారు. ఆ పరిచయాలు, మొహమాటాలు అన్నీ కూడా వాడేసుకుని మరీ బీజేపీ వ్యతిరేక‌ కొత్త రాజకీయ వంటకాన్ని జాతీయ స్థాయిలో తయారు చేస్తున్నారు.

పుష్కర కాలం క్రితం….

దేశంలో కాంగ్రెస్ వైభవం బాగా వెలిగిపోతున్న వేళ రెండవమారు అధికారంలోకి వచ్చి కొద్ది నెలలు కూడా కాని వేళ జగన్ సోనియాగాంధీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఈ రోజుకు పుష్కర కాలం అయింది ఈ బంధం తెగిపోయి. జగన్ కాంగ్రెస్ అన్న మాట కూడా అసలు ఎత్తడంలేదు. కానీ రాజకీయాలల్లో ఇలాంటివి అసలు కుదరవు. ఎవరితో ఎపుడు ఏ అవసరం పడుతుందో కూడా తెలియదు. జాతీయ రాజకీయాన మోడీ హవా ముగుస్తున్న వేళ దేశంలో వాతావరణం మారుతోంది. దానికి సూత్రధారిగా జగన్ మిత్రుడు ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. దాంతో కాంగ్రెస్ తో తెగిన బంధాన్ని మళ్ళీ బిగించేందుకు ప్రశాంత్ కిశోర్ తయారుగా ఉన్నారని అంటున్నారు.

పక్కా ప్లాన్ తోనే ….?

ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని బీజేపీ కాంగ్రెస్ రెండూ అంచనాలు వేస్తున్నాయి. మమతకు కూడా ఆ సంగతి తెలుసు. దాంతో అందరి చూపూ జగన్ మీదనే ఉంది. అయితే జగన్ ఇప్పటికిపుడు బీజేపీతో వైరం కోరి తెచ్చుకోలేరు. అలాగని తానుగా కాంగ్రెస్ తో చేతులు కలపరు. అందుకే ప్రశాంత్ కిశోర్ సంధాన కర్తగా ఉంటారని అంటున్నారు. జగన్ తో పాత వైరాలు మరచి స్వాగతించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఈ మేరకు చేయాల్సినవి అన్నీ ప్రశాంత్ కిశోర్ చేశారని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే జగన్ దీనికి ఓకే అనాలి. పీకే ఆ దిశగా జగన్ ని మార్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టారట.

ఆరు నెలల ముందు….

జగన్ ఇపుడేమీ సౌండ్ చేయరు. ఆయన బీజేపీ తో కోరి శతృత్వం కూడా తెచ్చుకోరు. ఆయన ఎన్నికలకు ఆరు నెలలు ముందు మాత్రమే తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తారు. కచ్చితంగా ఆయన నాటి రాజకీయం బట్టి ఏ వైపు అయినా మొగ్గు చూపుతారు అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ వంటి మితృడు జాతీయ రాజకీయ చక్రాన్ని పట్టడమే జగన్ కి వరంగా మారుతోంది అంటున్నారు. అలా కనుక చూస్తే జగన్ కి ఇపుడు ఆప్షన్లు కూడా పెరిగాయి అంటున్నారు. ఒకనాడు చంద్రబాబుకు ఉన్న అవకాశాలు అన్నీ కూడా ఇపుడు జగన్ కి అలా కలసివస్తున్నాయి. జగన్ మాత్రం 2023 చివరి దాకా తన జాతీయ రాజ‌కీయ పంధాపైన కనీస సమాచారం కూడా ఇవ్వరు అంటున్నారు. అపుడే ఆయన పావులు కదుపుతారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తో జగన్ కలిస్తే మాత్రం అది జాతీయ రాజకీయాల‌లో పెద్ద సంచలనం. అంతే కాదు బీజేపీ హ్యాట్రిక్ ఆశల మీద కూడా పిడుగుపాటుగా మారుతుంది అంటున్నారు.

Tags:    

Similar News