గుజరాత్ కు ఏమైంది? ఎందుకలా?

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కరోనా దెబ్బకు వణికిపోతోంది. మహారాష్ట్ర ను మించిపోయేలా ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్ర తర్వాత ఇప్పుడు [more]

Update: 2020-04-26 18:29 GMT

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కరోనా దెబ్బకు వణికిపోతోంది. మహారాష్ట్ర ను మించిపోయేలా ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్ర తర్వాత ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఉండటం గమనార్హం. ఇప్పటికే కేసులు మూడువేలకు చేరువలో ఉండటం ఆందోళన కల్గించే విషయమే. దీనిపై ప్రధాని మోదీ సయితం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి తో స్వయంగా మోదీ మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో…..

గుజరాత్ లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఎక్కువగా అహ్మదాబాద్, సూరత్ వంటి పట్టణాల్లోనే కరోనా పాజిటివ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దాదాపు వందకు చేరువలో కరోనా కారణంగా మరణించిన వారు ఉన్నారు. ముఖ్యమంత్రి విజయ్ రూపాని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ ను కూడా కట్టుదిట్టంగానే అమలు చేస్తున్నారు. అయినా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ప్రజాప్రతినిధులకు సయితం…..

గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కూడా కరోనా లక్షణాలు కన్పించాయి. ఆయన ముఖ్యమంత్రితో కూడా భేటీ కావడం ఆందోళన కల్గించింది. అయితే ముఖ్యమంత్రికి కరోనా వ్యాధి సోకలేదని ఆ తర్వాత పరీక్షల్లో నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్ లో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ విమర్శలు చేస్తుంది.

కాంగ్రెస్ విమర్శలు……

ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించడంలో విఫలమయిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అంతేకాకుండా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా గుజరాత్ ప్రభుత్వం తొలినాళ్లలో మీనమేషాలు లెక్కించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండపడుతుందన్న కారణంగానే కొన్ని నగరాల్లో లాక్ డౌన్ ను చూసీ చూడనట్ల వదిలేశారని కూడా కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. మొత్తం మీద గుజరాత్ లో కరోనా నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా సాధ్యం కావడం లేదు.

Tags:    

Similar News