ఉక్కు సెగతో ఉక్కిరిబిక్కిరి…?

ఏపీ బీజేపీకి ప్రాణ సంకటంగా ఉంది. కానీ కేంద్రంలోని పెద్దలకు మాత్రం చెలగాటంగా ఉంది. కేంద్రంలోని కాషాయం పార్టీ నేతలు తీసుకునే నిర్ణయాలు జాతీయ స్థాయిని దృష్టిలో [more]

Update: 2021-03-26 09:30 GMT

ఏపీ బీజేపీకి ప్రాణ సంకటంగా ఉంది. కానీ కేంద్రంలోని పెద్దలకు మాత్రం చెలగాటంగా ఉంది. కేంద్రంలోని కాషాయం పార్టీ నేతలు తీసుకునే నిర్ణయాలు జాతీయ స్థాయిని దృష్టిలో ఉంచుకుని సాగుతాయి. కానీ ఏపీ బీజేపీకి మాత్రం వాటి పొగలూ సెగలూ కక్కలేక మింగలేక అన్నట్లుగా మారుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న స్లోగన్ ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఇంతలోనే ఉక్కు పుట్టడం, పెరగడం, ప్రైవేట్ పరం కావడానికి సిద్ధంగా ఉండడం అన్నీ అలా చకచకా జరిగిపోతున్నాయి.

అర్ధ సత్యాలేనా…..?

కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు తమ పాలసీని కచ్చితంగా చెప్పేసారు. తాము నష్టాల్లో కష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో అసలు కొనసాగించబోం అంటూ బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయినా కానీ దాన్నిపట్టుకుని ఏదోలా అర్ధాలు పరమార్ధాలు మార్చడానికి ఏపీ బీజేపీ నేతలు పడుతున్న పాట్లు చూస్తేనే ఆశ్చర్యం వేస్తోంది. ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామని ఎపుడు చెప్పామని ఏపీ బీజేపీ పెద్ద సోము వీర్రాజు నిన్నటికి నిన్న అమాయకత్వం ప్రదర్శిస్తే నేడు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అబ్బే అలాంటిది ఏదీ లేదంటూ అర్ధ సత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ముందుందా ముప్పు….

జీవీఎల్ చెబుతున్న మాటలు వింటూంటే ఒకటి అర్ధమవుతోంది. స్టీల్ ప్లాంట్ కి ముప్పు ఉంది కానీ అది ఎపుడో ముందు ఉంది, ఇపుడపుడే కాదు అని ఆయన సౌండ్ ఇస్తున్నారు. కేంద్రం ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో విశాఖ ఉక్కు 35వ స్థానంలో ఉంది అని ఆయన అంకె కూడా చెబుతున్నారు. ఆ 34 సంస్థలను ప్రైవేట్ పరం చేస్తేనే తప్ప విశాఖ ఉక్కుని ఎవరూ టచ్ చేయరు కాబట్టి నింపాదిగా నిబ్బరంగా ఉండమని ఉక్కు కార్మికులకు ఆయన సలహా ఇస్తున్నారు. ఇక ప్రైవేటీకరణ అసలు జరగదు అన్న మాటను క్లారిటీగా చెప్పకుండా ఉక్కు ఉద్యోగుల భవిష్యత్తుని కేంద్రం చూసుకుంటుందని భరోసా మాత్రం ఇస్తున్నారు.’

చెప్పకనే చెప్పేశారా…?

అంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసినా కూడా ఉద్యోగులకు ఏం కొంప మునగదు అన్నదే ఎంపీ జీవీఎల్ గారి హామీ అనుకోవాలి. పైగా ఉక్కు ప్రైవేటీకరణ మీద ఉత్తుత్తి పోరాటాలను కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని ఆయన మండిపడుతున్నారు. మరి జీవీఎల్ లాంటి మేధావులే తిప్పి తిప్పి చెప్పినా కూడా అందులో సారమంతా కూడా ఉక్కు ప్రైవేటీకరణ మీదనే తిరుగుతోంది కదా. అలాంటపుడు వారూ వీరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ గుస్సా కావడం అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లే అంటున్నారు. మొత్తానికి ఉక్కు సెగతో ఇపుడు ఏపీ బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. ఏపీలో తమ భవిష్యత్తు మీద కూడా బెంగటిల్లుతున్నారు అనే చెప్పాలి.

Tags:    

Similar News