అటు అదానీ.. ఇటు టాటా ?

విశాఖ ఉక్కు కర్మాగారం. ఆధ్రుల హక్కు. ఏళ్లకు ఏళ్ళు పోరాడి సాధించుకున్న ప్లాంట్. దేశంలోనే సాగర తీరన వెలసిన ఒకే ఒక పరిశ్రమ. ఇపుడు అంగట్లో సరుకైంది. [more]

Update: 2021-09-01 11:00 GMT

విశాఖ ఉక్కు కర్మాగారం. ఆధ్రుల హక్కు. ఏళ్లకు ఏళ్ళు పోరాడి సాధించుకున్న ప్లాంట్. దేశంలోనే సాగర తీరన వెలసిన ఒకే ఒక పరిశ్రమ. ఇపుడు అంగట్లో సరుకైంది. ఇవాళ కాదు ఆరు నెలల క్రితమే దాన్ని అమ్మకానికి పెట్టేశారు. నాటి నుంచి ఉక్కు కార్మికులు ఉద్యమిస్తున్నారు. వారు తమ శక్తిమేరకు గల్లీ టూ ఢిల్లీ దాకా ఉక్కు సెగను రగిలించగలిగారు. కానీ చెవిటివారి ముందు శంఖం ఎంత గట్టిగా ఊదినా ప్రయోజనం లేదు. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ బలి పీఠం మీదనే ఉంది. అక్షరాలా ఇది నిజం. నమ్మకపోతే కొనేందుకు పోటీ పడుతున్న దిగ్గజ పారిశ్రామికవేత్తల ప్రకటనలను చూసి అయినా నమ్మి తీరాలి.

ఎవరైనా ఒకటే ….?

టాటాకు దేశంలో పెద్ద పారిశ్రామికవేత్తగా పేరుంది. గతంలో టాటా బిర్లాలు అనేవారు. ఇపుడు నవీన తరంలో అంబానీ అదానీలు దూసుకువచ్చారు. సరే ఎవరైనా కూడా కధ మామూలే. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో పాలకులు ఎపుడూ అంటకాగుతూనే ఉంటారు. వారి పంటను పండిస్తూనే ఉంటారు. నాటి పాలకులకు టాటాలు, బిర్లాలు తెగ నచ్చితే ఇపుడు అంబానీలు, అదానీల మీద మోజు పెరిగింది. ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోవడానికి అన్నట్లుగా ప్రభుత్వ రంగం కున్నారిల్లి ప్రైవేట్ బాట పడుతున్నపుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎవరు కొంటేనేంటి. ఎవరు కొత్త పెత్తందారు అయితేనేంటి అన్నదే కార్మిక లోకం వైరాగ్యం.

సడెన్ ఎంట్రీ తో ….

నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదానీలకే అప్పగిస్తారన్న ప్రచారం అయితే గట్టిగా సాగింది. దాని కోసమే అన్నట్లుగా పక్కనే ఉన్న గంగవరం పోర్టుని కూడా కొనేసి అదానీ అపుడే సర్వం సిద్ధం చేసుకున్నారని టాక్. పొయ్యి కాడ ఆకు మడి లెక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూడా తీసుకుంటే పోర్టు ద్వారా ట్రాన్స్ పోర్ట్ కి ఏ రకమైన ఇబ్బందులు ఉండవని కూడా ముందు చూపు. దానికి తోడు కేంద్ర పెద్దలకు అదానీ బాగా సన్నిహితుడు అని కూడా చెబుతారు. ఇక ఏపీ పాలకులకు కూడా అదానీ బాగా కావాల్సిన వాడే. దాంతో అదానీకే విశాఖ స్టీల్ ప్లాంట్ రాసి ఇచ్చేస్తారు అన్నది నిజం అనుకుంటున్న వేళ సడెన్ గా టాటా ఎంట్రీ ఇచ్చారు. తానే కొంటాను అంటూ సంచలన ప్రకటన చేశారు. దాంతో ఇపుడు స్టీల్ ప్లాంట్ కి కొత్త కొనుగోలుదారు పోటీగా వచ్చారు అంటున్నారు.

టాటా చెప్పేసి…

టాటా స్టీల్ ప్లాంట్ సీఈఓ తాము విశాఖ స్టీల్ ప్లాంట్ కొనడానికి కారణాలు కొంత చెప్పేశారు. సాగర తీరంలో ఉన్న ఏకైక పోర్టు. పోర్ట్ రవాణా కడు సులభం. అంతే కాదు, 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన అతి పెద్ద ఉక్కు పరిశ్రమ. ఇలాంటి ప్లస్ పాయింట్లు చాలానే ఉన్నాయని టాటా చెబుతూంటే విశాఖ జనాలు బాధ పడాల్సిందే. ఇంత చక్కని పరిశ్రమను నష్టాల పేరు చెప్పి తెగనమ్ముతారా అని కార్మిక లోకం కూడా కుములుతోంది. అయినా సరే కేంద్రం మొండిగా ఉంది. అమ్మడం ఖాయం. అది టాటాకా. అదానీకా అన్నది ప్రశ్న కాదు, ఎవరైనా కూడా విశాఖలోని స్టీల్ ప్లాంట్ పెద్ద టాటా చెప్పేస్తోంది. బీజేపీ వారి మాటల్లో అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు అక్కడే ఉంటుంది. కానీ అది మనది కాదు అన్న భావనతోనే ప్రజలు ఎప్పటికీ ఉంటారు. అలా వారు తమ మనసులో కూడా ప్లాంట్ తో అనుబంధానికి టాటా చెప్పేస్తారు. అలా ఈ కధను ముగించేయడానికి తెర వెనక చకచకా పావులు కదులుతున్నాయి.

Tags:    

Similar News