ఇక చివరి ఆశలు ప్రియాంక మీదనే…?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఇప్పటికే తమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు తాము [more]

Update: 2021-02-05 17:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఇప్పటికే తమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. చిన్నా చితకా పార్టీలతో ఈ రెండు పార్టీలు కలసి వెళ్లే అవకాశముంది. కాంగ్రెస్ ను మాత్రం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు దరి చేరనివ్వమని తేల్చిచెప్పాయి. దీంతో కాంగ్రెస్ సొంతంగా తన పట్టును పెంచుకునేందుకు ప్రయత్నాలను గత పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచే ప్రారంభించింది.

త్వరలోనే బాధ్యతలు….

గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీకి ఉత్తర్ ప్రదేశ్ పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత మూడు దశాబ్దాలుగా ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. ఈసారైనా అధికారంలోకి ఖచ్చితంగా రావాలన్నది కాంగ్రెస్ పట్టుదల. అందుకోసమే ప్రియాంక గాంధీకి పూర్తి బాధ్యతలను అప్పగించేందుకు పార్టీ సిద్ధమయింది.

తామే బాధ్యత తీసుకోవాలని….

ఇప్పటి వరకూ రాజ్ బబ్బర్ వంటి నేతలకు పార్టీ బాధ్యతలను అప్పగించినా పెద్దగా ఫలితాలు కన్పించలేదు. ఉత్తర్ ప్రదేశ్ అంటే గాంధీ కుటుంబం సొంత రాష్ట్రంగా భావిస్తారు. నెహ్రూ నుంచి రాహుల్ వరకూ అక్కడే పోటీ చేస్తూ వచ్చారు. అధికారంలోకి రాలేకపోతుండటంతో అన్ని రాష్ట్రాల్లో లాగానే ఉత్తర్ ప్రదేశ్ లోనూ ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడుతూ వచ్చింది. దీంతో క్యాడర్ అనేక నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు మళ్లిపోయింది.

పార్టీని బలోపేతం చేసేందుకు….

ఇప్పుడు తిరిగి 403 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిని కాంగ్రెస్ ప్రియాంక గాంధీకి అప్పగించనుంది. గతంలో కేవలం తూర్పు ప్రాంతానికే ప్రియాంక గాంధీని ఇన్ ఛార్జిగా నియమించారు. అయినా ఆ ప్రాంతంలోనూ పెద్దగా ఫలితాలు రాలేదు. అయినా సరే గాంధీ కుటుంబమే ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలను తీసుకోవాలని భావించింది. రెండున్నరేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కు కీలకంగా మారనున్నారు. మరి ప్రియాంక కాంగ్రెస్ కు వేవ్ తీసుకువస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News