చిన్నమ్మ….. పెద్దమ్మ అవుతుందా ?

ఏపీ బీజేపీలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్నటి దాకా తెరమీద కనిపించిన నాయకులు ఇపుడు పూర్తిగా సైడ్ అయ్యారు. బీజేపీ కీలక నేతలుగా చలామణీ అయిన [more]

Update: 2021-01-01 13:30 GMT

ఏపీ బీజేపీలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్నటి దాకా తెరమీద కనిపించిన నాయకులు ఇపుడు పూర్తిగా సైడ్ అయ్యారు. బీజేపీ కీలక నేతలుగా చలామణీ అయిన వారణాశి రాం మాధవ్ ఇపుడు ఎక్కడ ఉన్నారో తెలియదు, జీవీఎల్ నరసింహారావు తరచుగా మీడియాతో మాట్లాడుతున్నా కూడా మునుపటి ధాటి జోరూ ఆయనలో ఆసలు లేదు. ఇక సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక కొందరు నేతలు గమ్మున్నారు. ఇపుడిపుడే వారు నెమ్మదిగా కదులుతున్నారు. ఆరు నెలల సోము అధ్యక్ష పాలన చూసిన తరువాత అధినాయకత్వం వైపు నుంచి స్పందన గమనించాక కొత్త ఆలోచనలతో పాత నాయకులు కొందరు అడుగులు వేస్తున్నారు.

తెరపైకి ఆమె….

కాంగ్రెస్ లో ఉన్నపుడు కూడా నందమూరి వారి ఆడపడుచు అంటూ దగ్గుబాటి పురంధేశ్వరికి బాగానే మర్యాదలు దక్కాయి. ఆమెని ఏకంగా కేంద్ర మంత్రిని చేశారు. ఇక బీజేపీలో మొదట అయిదేళ్ళలో జాతీయ మహిళా మోర్చాలో ముఖ్య బాధ్యతలు అప్పగించిన బీజేపీ పెద్దలు ఇపుడు ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. దాంతో బీజేపీలోని ఒక సామాజికవర్గంలో పెద్ద ఎత్తున హుషార్ కనిపిస్తోంది. చిన్నమ్మతో నిన్నటి దాకా అంటీ ముట్టని వారు కూడా బీజేపీలో మరో సామాజిక వర్గానికి కాపు కాసే పరిస్థితులను చూసి తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అందుకే ఈ వైపుగా జరుగుతున్నారని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

అది అనూహ్యమేనా…?

విశాఖలో తాజాగా పురంధేశ్వరి పర్యటన చేస్తే ఒక అనూహ్య సంఘటన జరిగింది. బీజేపీలో సీనియర్ నేత, మాజీ ఎంపీ అయిన కంభంపాటి హరిబాబు ఆమెకు ఏకంగా విమానాశ్రయంలో స్వాగతం పలకడం విశేషం. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన హరిబాబు గత కొంతకాలంగా మౌనమే నా భాష అంటున్నారు. పూర్వాశ్రమంలో వెంకయ్యనాయుడు శిష్యుడిగా ఉన్న హరిబాబు ఆలోచనలు కూడా చాలా లోతుగా ఉంటాయని అంటారు. ఆయనకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గిందా పెరిగిందా అన్నది పక్కన పెడితే హరిబాబు మళ్ళీ యాక్టివ్ కావడం పురంధేశ్వరికి నేరుగా స్వాగతం పలకడం మాత్రం బీజేపీ రాజకీయాల్లో అది చర్చనీయాంశంగానే ఉంది.

పై చేయి కోసమేనా…?

బీజేపీలో ఇపుడు కాపుల ఆధిపత్యం కావాలని ఒక వర్గం గట్టిగా కోరుకుంటోంది. అదే సమయంలో దశాబ్దాలుగా కమ్మలు బీజేపీలో రాజకీయంగా ఉన్నత స్థానాలు అందుకున్నారు. ఒక విధంగా వారు శాసించారు. అటువంటి బలమైన సామాజికవర్గం ఇపుడు మళ్ళీ పార్టీలో పై చేయి సాధించడానికి చూస్తోందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు, ఆయన ఫైర్ బ్రాండ్ తత్వం, ఆఖరుకు మిత్ర పక్షం జనసేనతో సైతం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్న తీరు ఇవన్నీ కూడా హై కమాండ్ దృష్టిలో ఉన్నాయని అంటున్నారు. దానికి తోడు బీజేపీలో పురంధేశ్వరి పాత్ర కూడా పెరగడంతో ఆమెను అల్లుకుని కాషాయం పార్టీలో సరికొత్త రాజకీయానికి బలమైన ఒక వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టిదని అంటున్నారు. మరి చూడాలి ఈ పరిణామాలు ఏ వైపునకు దారి తీస్తాయో.

Tags:    

Similar News