సాఫ్ట్ కార్నర్ అందుకేనా?

రాజకీయ బంధాలే తప్ప అనుబంధాలు చంద్రబాబునాయుడుకి లేవంటారు. ఆయన తనకు పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నది చరిత్ర చెప్పిన కధ. ఇక [more]

Update: 2019-12-05 14:30 GMT

రాజకీయ బంధాలే తప్ప అనుబంధాలు చంద్రబాబునాయుడుకి లేవంటారు. ఆయన తనకు పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నది చరిత్ర చెప్పిన కధ. ఇక తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును వెన్నుపోటు ఎపిసోడ్ లో వాడుకుని జాగ్రత్తగా పక్కన పెట్టారన్నది తెలిసిందే. మరో వైపు ఆరు నెలల వ్యవధిలో బావమరిది హరిక్రిష్ణను కూడా టీడీపీ నుంచి బయటకు పంపేసిన చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే చుట్టరికాలను కలుపుకుంటారు, వదులుకుంటారు. ఓ విధంగా ఎన్టీఆర్ టీడీపీలో దగ్గుబాటి అల్లుడిగా ఓ వెలుగు వెలిగారు తప్ప ఆనక ఆయన రాజకీయంగా ఇబ్బందులే పడుతూ వచ్చారు. ఇక ఆయన బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా కూడా తెలుగుదేశం నాటి వైభవం దక్కించుకోలేకపోయారు.

చిన్నమ్మ తగ్గుతున్నారా….?

నిజానికి టీడీపీలో వెన్నుపోటు ఎపిసోడ్ లో దగ్గుబాటి తెలివిగా వ్యవహరించి బాబు పంచన చేరకుండా ఉండి ఉంటే కధ మరో విధంగా ఉండేదని అంటారు. అక్కడ వేసిన తప్పటడుగు మూలంగా టీడీపీకి తొలి జెండాను పాతిన దగ్గుబాటి చివరికి అదే పార్టీ నుంచి పూర్తిగా దూరం కావాల్సివ‌చ్చింది. ఇక దగ్గుబాటి సతీమణి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కాంగ్రెస్ లో చేరి రెండు మార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. బీజేపీలో ఆమె ఇపుడు ఉన్నా ఏపీలో ఆ సామాజికవర్గం నుంచే పెద్ద పోటీ ఎదురవుతోంది. కొత్తగా టీడీపీ నుంచి జంప్ చేసిన సుజనా చౌదరికి కమ్మ సామాజికవర్గం నేతగా కమలనాధులు గుర్తిస్తున్నారు. ఆయన అంగబలం, అర్ధబలంతో పాటు, చంద్రబాబు రైట్ హ్యాండ్ కావడం వల్ల రేపటి రోజున ఉపయోగపడతాడేమోనని దగ్గరకు తీస్తున్నారు. దీంతో చిన్నమ్మకు బీజేపీలో ఉన్నానంటే ఉన్నాను అన్న పరిస్థితే ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో ఆమె కొంత తగ్గుతున్నారని అంటున్నారు.

వారసుడి కోసమేనా…?

దగ్గుబాటి దంపతులు రాజకీయంగా గుర్తింపు ఉండి కూడా వారసుడికి సరైన ఫ్లాట్ ఫారం ఇవ్వలేకపోతున్నారు. వైసీపీలో దగ్గుబాటి హితేష్ చెంచురాంని పంపి ఎమ్మెల్యేను చేద్దామని, తద్వారా ఆయనకు రాజకీయ బాట వేద్దామనుకుంటే పౌరసత్వం వివాదంతో దగ్గుబాటే చివరకు పోటీకి దిగాల్సివచ్చింది. ఇక దగ్గుబాటి అనూహ్యంగా ఓడిపోవడం, పార్టీకి దూరం కావడం జరిగింది. దీంతో వారసుడి కోసం దగ్గుబాటి ఫ్యామిలీ మధనపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇపుడున్న పరిస్థితుల్లో టీడీపీలోకి హితేష్ వెళ్ళడం బెటర్ అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. నిజానికి హితేష్ వైసీపీలో చేరాలని దగ్గుబాటి అంటే టీడీపీ నుంచి అరంగేట్రం చేయాలని పురంధేశ్వరి అనుకున్నారని ప్రచారం కూడా ఉంది.

బాబుకు మద్దతు….

ఈ పరిణామాల నేపధ్యంలోనే అమరావతిలో చంద్రబాబు మీద జరిగిన చెప్పులదాడిని పురంధేశ్వరి ఖండించారని అంటున్నారు. ఎపుడు చంద్రబాబు మీద గట్టిగా మాటల దాడి చేసే చిన్నమ్మ ఇపుడు సాఫ్ట్ కార్నర్ తో ఉండడం వెనక కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఉందని అంటున్నారు. నారా లోకేష్ కి హితైష్ కి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని టాక్ కూడా ఉంది. పైగా ఇపుడు టీడీపీలో లోకేష్ మాటే చలామణీ అవుతోంది. లోకేష్ సైతం పార్టీలో ఒంటరి పోరాటం చేస్తున్నాడు, పెద్దమ్మ కుమారుడు తోడుగా వచ్చి నిలబడితే కాదనేది లేదని కూడా అంటున్నారు. అంటే అన్నీ కుదిరితే దగ్గుబాటి హితైష్ రాజకీయ ప్రవేశం తాత ఎన్టీయార్ పెట్టిన టీడీపీ నుంచే ఉండొచ్చని అంటున్నారట. మరి చూడాలి ఈ ప్రచారం ఎంతవరకూ నిజమవుతుందో.

Tags:    

Similar News