పుష్ప శ్రీవాణికి అసమ్మతి పోటు ?

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఒక కల. చంద్రబాబు 2014న గెలిచిన తరువాత ఈ ఉప ముఖ్యమంత్రుల సంస్కృతిని మళ్ళీ తెచ్చారు. అధికారంలో తాను ఒక్కరే [more]

Update: 2020-06-10 11:00 GMT

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఒక కల. చంద్రబాబు 2014న గెలిచిన తరువాత ఈ ఉప ముఖ్యమంత్రుల సంస్కృతిని మళ్ళీ తెచ్చారు. అధికారంలో తాను ఒక్కరే అనుకున్న దాన్ని నుంచి బాబు కొంత తగ్గిన వైనమిది. అలా టీడీపీ ఏలుబడిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఏపీకి వస్తే అందులో ఒకటి కచ్చితంగా ఉత్తరాంధ్రకు వస్తుందని ఆశ పడ్డారు కానీ బాబు గోదావరి దాటి ముందుకు సాగలేదు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మాత్రం ఏకంగా అయిదుగురు డిప్యూటీ సీఎంలను ఇచ్చారు. అలా సామాజిక సమీకరణలు, ప్రాంతాల సమతూకాలు చూసి మరీ అందరికీ పంచిపెట్టారు. దీంతో విజయనగరం జిల్లా కురుపాం నుంచి రెండవసారి గెలిచిన పుష్ప శ్రీవాణి కేవలం 31 ఏళ్ళకే ఉప ముఖ్యమంత్రి అయిపోయింది.

దూకుడేదీ….?

విజయనగరం జిల్లా వైసీపీకే జై కొట్టింది. 2019 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం 9 అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ పరమయ్యాయి. అటువంటి నేపధ్యంలో డిప్యూటీ సీఎంగా పుష్ప శ్రీవాణి పనితీరు ఎలా ఉండాలి. కానీ ఆమె ఏడాది ఉప ముఖ్యమంత్రిత్వం మాత్రం ఏమీ లేదనిపించుకుంది. పైగా పేలవమైన ప్రదర్శన అన్న విమర్శలు ఉన్నాయి. ఆమె గిరిజన మహిళగా, చురుకైన నాయకురాలిగా ఉంటుందని జగన్ మెచ్చి ఉన్నత స్థానం ఇస్తే పుష్ప శ్రీవాణి తన పనితీరు మెరుగుపరచు కోలేకపోతున్నారు. దానికి తోడు భర్త పరీక్షిత్ రాజు మీద పూర్తిగా ఆధారపడతారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

బొత్స రాజ్యంలో…..?

రాజకీయంగా విశేష అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో ఉన్నారు. ఆయన ముందు పుష్ప శ్రీవాణి పూర్తిగా తేలిపోతున్నారు. చిత్రమేంటంటే ప్రోటోకాల్ ప్రకారం జిల్లాలో ఆమె మొదటి వరసలో ఉంటారు. ఆమె తరువాతనే బొత్స పేరు రాయాలి, పలకాలి. ఆయన సైతం పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జిల్లాలో జరిగే సమీక్షలకు, సమావేశాలకు హాజరు కావాలి. ఇంతటి అధికారం చేతిలో ఉన్నా కూడా పుష శ్రీవాణి రాజకీయ అపరిపక్వతతో ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. ఆమె తన సొంత నియోజకవర్గాన్ని దాటి ముందుకు సాగలేకపోతున్నారు. అలాగే గిరిజన అసెంబ్లీ సీట్లను కూడా కలుపుకుని పార్టీని పటిష్టం చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం ద్వారా పట్టు సంపాదించే సువర్ణ అవకాశాన్ని కూడా ఆమె ఉపయోగించుకోవడంలేదని అంటున్నారు.

ఇంట్లోనే పోరు….

ఇక పుష్ప శ్రీవాణికి సొంత ఇంట్లోనే అసమ్మతి రాగం వినిపించడమే విశేషం. విమర్శలు చేస్తున్నది ఎవరో కాదు తన భర్త తండ్రి తనకు సొంత మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు. కురుపాం ఏడాది కాలంలో అసలు అభివ్రుధ్ధి చెందలేదని సొంత మామే గాలి తీసేస్తే ఇక డిప్యూటీ సీఎం కిరీటం పుష్ప శ్రీవాణికి ఎందుకు అనిపించక మానదు. ఆమె సాధార‌ణ ఎమ్మెల్యే కాదు, కీలకమైన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. మరి అలాంటిది ఏడాది కాలంలో అభివ్రుధ్ధి పనులు చేపట్టమే కాకుండా పార్టీని ఒక్క త్రాటిపైకి తెచ్చుకుంటే ఈనాడు ఇంట్లో నుంచి అసమ్మతి గళం వినిపించి ఉండదని అంటున్నారు. మరి మామకు జవాబు చెప్పలేని కిరీటం గిరిజన ప్రాతాల్లో వైసీపీ జెండా ఎగిరేలా చూస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి. చూడాలి మరి జగన్ తాను ఏరి కోరి పెద్ద పదవి ఇచ్చిన చెల్లెమ్మ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో.

Tags:    

Similar News