మామ మీద కోడలు నెగ్గుతుందా…?

విజయనగరం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి గట్టి సవాల్ ఎదురవుతోంది. అది కూడా సొంత మామ నుంచే. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. [more]

Update: 2020-09-01 03:30 GMT

విజయనగరం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి గట్టి సవాల్ ఎదురవుతోంది. అది కూడా సొంత మామ నుంచే. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. కానీ పుష్ప శ్రీవాణి మాత్రం రచ్చ గెలుస్తోంది కానీ ఇంట గెలవలేకపోతోంది. దానికి కారణం ఆమె మామలు ఢక్కా మెక్కీలు తిన్న రాజకీయ నేతలు కావడమే. కురుపాం రాజవంశీకులుగా ఉన్న శత్రుచర్ల కుటుంబం నుంచి వచ్చిన వారు మాజీ మంత్రి, శత్రుచర్ల విజయరామరాజు. ఆయన శ్రీవాణికి పెద మామ అవుతారు. ఇక సొంత మామ చంద్రశేఖరరాజు కూడా మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా ఈ మధ్యన కోడలి పాలన మీద విమర్శలు సంధించారు.

వ్యూహంతో అలా…..

రాజకీయాల్లో తలపండిన విజయరామరాజు తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నారు. కోడలి మీద పై చేయి కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. లేటెస్ట్ గా ఆయన తన శిష్యుడు టీడీపీ ఎమ్మెల్సీ ద్వారంపూడి జగదీష్ ని వైసీపీలోకి పంపేందుకు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు అంటున్నారు. తాను ఈ గట్టున ఉండి ఆ గట్టున జరిగే రాజకీయాన్ని రక్తి కట్టించాలన్నది శత్రుచర్ల ప్లాన్. ఇక కోడలు పుష్ప శ్రీవాణి హవాను అడ్డుకునేందుకు కూడా ఆయన జగదీష్ ని బాణంగా వదులుతున్నారని అంటున్నారు. ఆయన త్వరలో పార్టీలో చేరుతారని వినిపిస్తుంది. అదే జరిగితే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కొత్త సవాల్ ఎదురవుతుంది అంటున్నారు.

ఆ జిల్లా కోసం …

ఇదే కాదు, మరో విషయంలోనూ విజయరామరాజు పావులు కదుపుతున్నారు. కొత్త గిరిజన జిల్లాగా పార్వతీపురం కావాలని రాజు గారు ఎత్తులు వేస్తున్నారు. ఇది చిరకాల డిమాండ్ అంటూ ఓ వైపు టీడీపీ ఆద్వర్యాన సంతకాల సేకరణ కూడా జరుగుతోంది. దానికి వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు కూడా మద్దతుగా ఉంటున్నాయి. నిజానికి పార్వతీపురం విజయనగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పట్లోనే జిల్లా చేయాలని డిమాండ్ ఉంది. దానికి తోడు 2009 వరకూ ఎంపీ సీటుగా కూడా ఉన్న పార్వతీపురం జిల్లా కావడానికి జగన్ చెప్పిన ప్రమాణం సరిపోతుందని వాదిస్తున్నారు. పైగా ఇక్కడ ఆర్డీవో స్థాయిఅధికారి ఏలుబడిలో పాలన సాగుతోందని కూడా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్వతీపురాన్నే జిల్లాగా చేయాలని అంటున్నారు.

కురుపాం కోసం…

ఇక ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కురుపాంను జిల్లాగా చేయాలని ఉంది. ఆమె అందుకోసమే జగన్ ని అడిగి మరీ రెండవ గిరిజన జిల్లాగా అనుమతి తెచ్చుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున నియోజకవర్గం జిల్లా అయితే రాజకీయంగా అడ్వాంటేజ్ తనకు దక్కుతుందని ఆమె లెక్కలు వేసుకుంటున్నారు. అరకు ఒక జిల్లాగా ఉంటే రెండవ జిల్లా కురుపాం అవుతుందని కూడా పుష్ప శ్రీవాణి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇపుడు పార్వతీపురమే గట్టి పోటీగా ఉంది. ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీష్ వంటి వారు అదే కోరుకుంటున్నారు. జిల్లా కేంద్రంగా ఉంటే తాను వైసీపీలోకి వస్తానని కూడా ఆయన అంటున్నారుట. మొత్తానికి పుష్ప శ్రీవాణి రాజకీయ చాణక్యానికి అతి పెద్ద సవాల్ వచ్చిపడింది. అది కూడా మామ నుంచే. ఆమె నెగ్గి శభాష్ అనిపించుకుంటా. తగ్గి పరపతి పోగొట్టుకుంటుందా అన్నది చూడాలి మరి.

Tags:    

Similar News