పీవీని అలా మోసం చేశారట

పాములపర్తి వెంకట నరసింహారావు… సంక్షిప్తంగా పీవీ గా సుపరిచితులైన ఈ తెలుగుబిడ్డ గురించి తెలియని వారుండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి గా పని [more]

Update: 2019-11-22 16:30 GMT

పాములపర్తి వెంకట నరసింహారావు… సంక్షిప్తంగా పీవీ గా సుపరిచితులైన ఈ తెలుగుబిడ్డ గురించి తెలియని వారుండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి గా పని చేసిన ఆయన కేంద్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. హోంమంత్రిగా, విదేశాంగ, మానవ వనరుల మంత్రిత్వ శాఖల సారధిగా ఆయా శాఖలకు పీవీ నరసింహారావు వన్నె తెచ్చారు. 1984లో రాజీవ్ గాంధీ ఏర్పాటు చేసిన మానవ వనరుల మంత్రిత్వ శాఖకు తొలి మంత్రి పీవీనే కావడం విశేషం. 1991లో అనూహ్య పరిస్థితుల్లో అత్యున్నతమైన ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు దేశ ముఖచిత్రాన్ని మార్చేశారు. కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు సంబంధించి సరళీకృత విధానాలకు తెరదీసి పీవీ నరసింహారావు చరిత్ర సృష్టించారు. ఆ ఫలాలను దేశం ఇప్పుడు పొందుతోంది.

కొనితెచ్చుకున్న కళంకమే….

పీవీ నరసింహారావుకు సంబంధించి ప్రధానిగా మరో కోణాన్ని పరిశీలిస్తే కొంత కళంకం కనపడుతుంది. 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన నిస్సందేహంగా ఆయన ప్రతిష్టను మసక బార్చింది. రాజకీయంగా పీవీ నరసింహారావును సమాధి చేసింది. ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కే తీరని నష్టాన్ని కలిగించింది. ఇక అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఓ లౌకిక ప్రభుత్వం మైనారిటీల హక్కులను కాపాడలేకపోయిందన్న అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ విమర్శలు, ఆరోపణలను తోసిపుచ్చడం కష్టమే. పీవీ నరసింహారావు రాజకీయ ప్రత్యర్థులకు, సొంత పార్టీలోని వ్యతిరేక వర్గాలకు బాబ్రీ మసీదు ధ్వంసం ఘటన ఆయాచిత వరంగా మారింది. ఈ పేరుతో ఆయనపై ధ్వజమెత్తడం అప్పట్లో పరిపాటిగా మారింది. పీవీ నరసింహారావు నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లనే బాబ్రీ మసీదు ధ్వంసమయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్న విమర్శలకు కొదవలేదు. అప్పట్లో హోంమంత్రిగా మహారాష్ట్రకు చెందిన ఎస్.బి. చవాన్ ఉండేవారు. అప్పట్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన మాధవ్ గాడ్బోలే పీవీ నరసింహారావు ఉదాసీనతను తాను రచించిన “ది బాబ్రీ మసీద్ – మందిర్ డైలమా, యాన్ మసీద్ టెస్ట్ ఫర్ కానిస్టిట్యూషన్” పుస్తకంలో ఎండగట్టారు. మసీదు పరిరక్షణకు హోంశాఖ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అప్పట్లో పీవీ నరసింహారావు తిరస్కరించారని పేర్కొన్నారు. వినయ్ సీతాపతి రాసిన “నరసింహుడు” అనే పుస్తకంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను పీవీ నరసింహారావు పూర్తిగా విశ్వసించి కార్యాచరణ ప్రణాళికను తోసిపుచ్చారని పేర్కొన్నారు.

మసీదు కూల్చి వేతకు ముందు….

అంతిమంగా మసీదు పరిరక్షణకు పీవీ నరసింహారావు చర్యలు తీసుకోలేకపోయారన్న భావన విస్తృతంగా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కానీ పీవీ నరసింహారావు సన్నిహిత వర్గాల కథనం ప్రకారం ఇది వాస్తవం కాదు. మసీదు పరిరక్షణకు ఆయన తన పరిధిలో చైతనైనంత చేశారు. ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం గల నాగపూర్ లోనే ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అంతకు ముందు 1984లో నాగ్ పూర్ సమీపంలోని రామ్ టెక్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. నాటి ఆర్ఎస్ఎస్ నేత బాలా సాహెబ్ దేవరస్, మరో అగ్రనేత రాజేంద్ర సింగ్, వీహెచ్ పి అధినేత అశోక్ సింఘాల్, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, మరో అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయిలతో నవంబరు నెలలోనే విస్తృతంగా పీవీ నరసింహారావు చర్చించారు. వారి మధ్య నవంబరు 18న రహస్య సమావేశం జరిగింది. నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ స్వయంగా పీవీ నరసింహారావుని కలిశారు. మసీదు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, తాము పూర్తి బాధ్యత వహిస్తామని వారు ఆయనకు హామీ ఇచ్చారు. ఇంతమంది ప్రముఖులు హామీ ఇచ్చిన తర్వాత బలగాలను మొహరించడం వల్ల ఉపయోగం లేదని పీవీ నరసింహారావు భావించారు. అంతేకాకుండా శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఆందోళన చెందారు.

కూల్చిన తర్వాత…..

కానీ ఇచ్చిన హామీకి భిన్నంగా బీజేపీ నేతలు వ్యవహరించడంతో పీవీ నరసింహారావు కలత చెందారు. ఎంతో ఆవేదన, ఆందోళన చెందారు. కమలం పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహించారు. డిసెంబరు 6వ తేదీన (ఆదివారం) యధాప్రకారం రోజువారీ కార్యకలాపాలు ప్రారంభించిన పీవీ నరసింహారావు 1.220 గంటల ప్రాంతంలో మసీదు ధ్వంసమయిందని టీవీలో రగలి పోయారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయడానికి వచ్చిన డాక్టర్ శ్రీనాధ్ రెడ్డి పీవీ నరసింహారావు మానసిక పరిస్థితిని పరిశీలించారు. ఆయనకు గుండెపోటు, రక్తపోటు పెరిగింది. ఆందోళనగా ఉన్నారు. నాడి తీవ్రంగా కొట్టుకుంటోంది. మసీదు విధ్వంసం సంఘటనే ఆయన శారీరరక స్థితికి కారణాలని వైద్యుడు శ్రీనాధ్ రెడ్డి అప్పట్లోనే వెల్లడించారు. ఏ మనిషీ అనారోగ్యాన్ని కావాలని కొనితెచ్చుకోరని, మసీదు ఘటన ఆయన పరిస్థితి కారణమని డాక్టర్ తెలిపారు. తనను నమ్మించి మోసగించారన్న బాధ, ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమయింది. వాస్తవం ఇదికాగా భిన్నమైన వాదనలు ప్రజల్లోకి వెళ్లడం నిజంగా దురదృష్టకరం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News