రాజుగారూ.. అసలు విషయం చెప్పండి

బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారంతా బీజేపీ చెంతకు చేరుతున్నారు. తమ వ్యాపారాలను నిర్వహించుకోవడం కోసం వారు కేంద్రంలో అధికార పార్టీని ఆశ్రయించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో కావూరి [more]

Update: 2020-06-16 14:30 GMT

బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారంతా బీజేపీ చెంతకు చేరుతున్నారు. తమ వ్యాపారాలను నిర్వహించుకోవడం కోసం వారు కేంద్రంలో అధికార పార్టీని ఆశ్రయించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో కావూరి సాంబశివరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసుల్లో ఉన్నారు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆ ఖాతాలోనే చేరిపోయారు. రఘురామ కృష్ణం రాజు తన వ్యాపార ప్రయోజనాల కోసమే వైసీపీని కవ్విస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

బీజేపీ కూడా…..

రఘురామ కృష్ణంరాజు వైసీపీలో కంఫర్ట్ గా ఉండాలి. ఎందుకంటే వైసీపీ కూడా బీజేపీతో స్నేహాన్నే కోరుకుంటుంది. బీజేపీ కూడా వైసీపీని పెద్దగా టార్గెట్ చేయడం లేదు. టీడీపీని ఏపీలో లేకుండా చేయడమే ప్రస్తుతం బీజేపీ ముందున్న లక్ష్యంగా కన్పిస్తుంది. అయితే రఘురామ కృష్ణంరాజు మరిన్ని ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు కేంద్రంలో కీలక పదవి కోసం రఘురామ కృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

బ్యాంకు రుణాల ఎగవేత…

దీంతో పాటు తన బ్యాంకు రుణాల ఎగవేత కేసు నుంచి కూడా తప్పించుకోవడానికే ఆయన వైసీపీ పై విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. 2018 లోనే బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. కేసు నమోదయింది. వైసీపీలోనే కొనసాగితే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఆయన సాధారణ ఎంపీగానే కొనసాగాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ విజయసాయరెడ్డి, మిధున్ రెడ్డి వంటి నేతల డామినేషన్ ఉంటుంది. వారిని కాదని తనకు భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన రఘురామ కృష్ణంరాజు వైసీపీపై కాలుదువ్వుతారంటున్నారు.

జగన్ ను నేరుగా….

అందుకోసమే రఘురామ కృష్ణంరాజు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ కు గురైతే నేరుగా బీజేపీ కండువా కప్పేసుకోవచ్చన్నది రఘురామ కృష్ణంరాజు ఆలోచనగా ఉంది. అందుకే నిన్న మొన్నటి వరకూ వైసీపీ సర్కార్ పై విమర్శలు చేసి, జగన్ ను ప్రశంసించిన రఘురామ కృష్ణంరాజు నేడు జగన్ పై నేరుగా విమర్శలు చేస్తున్నారు. తాను జగన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి గెలవలేదని కూడా రఘురామ కృష్ణంరాజు అన్నారంటే ఆయన పార్టీ నుంచి వైదొలగేందుకే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News