వైసీపీలో రాజుల యుద్ధం.. చివరికి ఏం జరుగుతుంది..?
అధికార వైసీపీలో కీలక సామాజిక వర్గమైన క్షత్రియుల మధ్య తీవ్ర యుద్ధం తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తెర చాటుకు మాత్రమే పరిమితమైన ఈ యుద్ధం [more]
అధికార వైసీపీలో కీలక సామాజిక వర్గమైన క్షత్రియుల మధ్య తీవ్ర యుద్ధం తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తెర చాటుకు మాత్రమే పరిమితమైన ఈ యుద్ధం [more]
అధికార వైసీపీలో కీలక సామాజిక వర్గమైన క్షత్రియుల మధ్య తీవ్ర యుద్ధం తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తెర చాటుకు మాత్రమే పరిమితమైన ఈ యుద్ధం రసకందాయంలో పడింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు పార్టీలో గడిచిన ఏడాది కాలంగా తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాను గెలిచింది వైసీపీలోనే అయినా.. ఆయన కేంద్రంలోని బీజేపీతో టచ్‌లో ఉంటూ వచ్చారు. అదే సమయం లో పార్టీ కార్యక్రమాలను, మరీ ముఖ్యంగా వైసీపీ అదినేత, సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలపై కూడా విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.
తొలి నుంచి అంతే….
రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచిన నెల రోజుల వ్యవధిలోనే నేరుగా ఢిల్లీ వెళ్లి కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే సమయంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అప్పటి అధ్యక్షుడు అమిత్ షాతోనూ నేరుగా మంతనాలు జరిపారు. ఇక నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలతో అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తెలుగు మీడియం రద్దుపై నోటీసులు ఇచ్చి, దీనిపై అత్యవసరంగా చర్చించాలని కూడా పట్టుబట్టారు. ఇలా ఆది నుంచి వివాదాస్పదంగానే వ్యవహరించారు. దీంతో స్థానికంగా ఆయన మిత్రులు అయిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వంటి సొంత సామాజిక వర్గం నేతలు కూడా ఆయనకు దూరం దూరంగా ఉంటూ వచ్చారు.
మార్చుకోవాలని చెప్పినా….
అంతేకాదు, ఎన్నికల సమయంలో తనకు ఎంతో సాయంగా ఉన్న నాయకులు కూడా రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై గుర్రుగా ఉన్నా రు. ఇక, ఈ వ్యవహారంపై పార్టీ అధినేత జగన్ ఒకదఫా.. ఇప్పటికే.. రఘురామకృష్ణంరాజును నేరుగా తాడేపల్లికి పిలిపించి చర్చించి.. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే, ఇటీవల ఆయన మళ్లీ తన పంథాలోనే ప్రయాణం సాగించారు. ఇసుక, మద్యం అమ్మకాలపై ప్రతిపక్షాలను మించిపోయిన విధంగా విమర్శలు చేశారు. లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్ర యించడమేంటని ప్రతిపక్షం ఆరోపణలు చేయకముందుగానే రఘురామకృష్ణంరాజు ప్రభుత్వం తీరుపై ఓ మీడియా ఛానెల్‌లో విరుచుకుపడ్డారు. ఇక, ఇసుక విషయంలోనూ ఆయన విమర్శలు గుప్పించారు.
దూరం పెడుతూ వచ్చినా….
దీంతో ఇప్పటికే ఆయనను పార్టీలో స్థానిక నాయకులు దూరం పెట్టారు. ఆయనతో సంబంధం లేకుండానే కార్యక్రమాలు చేసు కుంటున్నారు. తాజాగా ప్రసాదరాజు.. ఓ మీడియాతో మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజుపై విమర్శలు గుప్పించడం మరింతగా వివాదాన్ని పెంచేసింది. దీంతో రెచ్చిపోయిన రఘురామకృష్ణంరాజు రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. విమర్శలు సంధించారు. పేరుచివర ఆ రెండు అక్షరాలు ఉన్నవారికే పదవులు దక్కుతాయని అనడంతోపాటు.. తాను జగన్ దయతో గెలవలేదని, తన దయవల్లే.. పశ్చిమలో పార్టీ గెలుపు గుర్రం ఎక్కిందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు అగ్నికి ఆజ్యం పోసినట్టు తయారయ్యారు.
సవాల్ మీద సవాల్….
ఇప్పుడు మొత్తంగా జిల్లా నేతలు మూకుమ్మడిగా రఘురామకృష్ణంరాజుపై యుద్ధం ప్రకటించారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న మంత్రి చెరుకువాడ రంగనాథ రాజుతో పాటు ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణతో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పేర్ని నానిలు రఘురామ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నువ్వు జగన్ బొమ్మ పెట్టుకుని గెలవకపోతే రాజీనామా చేసి గెలవాలని చెప్పారు. ఆ వెంటనే వీళ్లను పందులతో పోలుస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో వీడియో విడుదల చేశారు. సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులు గుంపులుగా వస్తాయని చెప్పడంతో పాటు మంత్రి రంగరాజు పెద్ద దొంగ అని విమర్శించారు.
ఎమ్మెల్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు…
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను ఇసుక దొంగ అన్న ఆయన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇళ్ల స్థలాల్లో కోట్లు నొక్కేస్తున్నారంటూనే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాత్రం నిజాయితీ పరులు అని ప్రశంసించారు. ఆ తర్వాత ఓ ప్రముఖ మీడియా లైవ్ డిబేట్‌లోనూ ఇదే ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీల మధ్య జరిగిన మాటల యుద్ధంలో రఘురామకృష్ణంరాజు వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేశారు.
జగన్ కోర్టుకు చేరడంతో…
క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణంరాజుకు అదే వర్గానికి చెందిన మంత్రి రంగరాజుతో పొసగడం లేదు. ఇక ఇటు ముదునూరి ప్రసాదరాజు సైతం అధిష్టానం ఒత్తిడి మేరకు ఎంపీని టార్గెట్ చేస్తున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే మంత్రిగా ఉన్న రంగరాజుకు.. రేపో మాపో మంత్రి పదవి దక్కబోయే ప్రసాదరాజుకు మధ్య కూడా భీకర యుద్ధం నడుస్తోంది. ఇలా వైసీపీలో రాజులు వర్సెస్ రాజుల మధ్య బహిరంగ వార్ నడుస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో రఘురామకృష్ణంరాజు తెగేదాకా లాగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం జగన్ కోర్టుకు చేరింది. ఈపరిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.