“రచ్చ” చేయడం అందుకేనా.. రమ్మంటున్నారా?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ప్రధానంగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఆయన నిత్యం కామెంట్స్ చేస్తున్నారు. రచ్చబండ పేరుతో [more]

Update: 2021-01-06 12:30 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ప్రధానంగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఆయన నిత్యం కామెంట్స్ చేస్తున్నారు. రచ్చబండ పేరుతో రఘురామకృష్ణంరాజు రోజు జగన్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నా వైసీపీ మాత్రం కిమ్మనడం లేదు. నిజానికి రఘురామకృష్ణంరాజు పై లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటీషన్ వైసీపీ నేతలు ఇచ్చి ఆరు నెలలు దాటుతుంది. ఇప్పటి వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఎక్కువగా ఢిల్లీలోనే….

ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉండటంతో ఎప్పటికప్పుడు స్పీకర్ కార్యాలయంలో ఫాలో అప్ చేసుకుంటున్నారు. అలాంటిదేమీ లేకపోవడంతో రఘురామకృష్ణంరాజు నిత్యం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వైసీపీ నేతలు కూడా బీజేపీ పెద్దలను కలిసినప్పుడల్లా రఘురామకృష్ణంరాజు అంశాన్ని ప్రస్తావిస్తూనే వస్తున్నారు. కానీ బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోవడం, రఘురామకృష్ణంరాజు ఆరోపణలు శృతిమించడంతో వైసీపీ నేతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

రాజుగారు బిందాస్ గా…..

అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం బిందాస్ గా ఉన్నారంటున్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో తన మిత్రపక్షమైన జేడీయూ నుంచి ఆరు గురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు తన సన్నిహితుల వద్ద గుర్తు చేస్తున్నారట. మిత్రపక్షాన్నే కలుపుకున్న బీజేపీ వైసీపీని కేర్ చేస్తుందని తాను అనుకోవడం లేదని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజు మాత్రం బీజేపీలో చేరే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిసింది.

బీజేపీలో చేరేందుకు ……

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక కేంద్ర మంత్రి ద్వారా తన ప్రయత్నాలను రఘురామకృష్ణంరాజు మొదలు పెట్టారంటున్నారు. కేంద్ర మంత్రి భర్త కూడా తన జిల్లా కావడంతో ఆయన ద్వారా సులువుగా పనిచేయించుకునే పనిలో ఉన్నారు రఘురామకృష్ణంరాజు. మరి ప్రయత్నం సఫలమయితే తనకు త్వరలోనే బీజేపీ నుంచి ఆహ్వానం అందుతుందని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారట. అప్పుడు వైసీపీకి మరింత సినిమా చూపిస్తానంటున్నారు. మరి రఘురామకృష్ణంరాజు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News