రాజు గారి వల్ల ఏమీ కాదు.. అయినా నష్టమే?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు ఏడాదిగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పార్టీ నుంచి కనీసం సస్పెండ్ చేయకపోవడం కూడా చర్చనీయాంశమైంది. [more]

Update: 2021-04-04 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు ఏడాదిగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పార్టీ నుంచి కనీసం సస్పెండ్ చేయకపోవడం కూడా చర్చనీయాంశమైంది. రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఫలితం లేదు. ఇదే అదనుగా చూసుకుని రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్లారు.

పార్టీకి ఇబ్బందికరమే….

రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పార్టీకి ఇబ్బంది కరమే. ఆయన ప్రతి రోజూ జగన్ పైనా, ఆయన ప్రభుత్వంపైనా చేస్తున్న కామెంట్స్ డ్యామేజీ చేసేవే. ఆయనను అలా వదిలేస్తే పార్టీకి మరింత నష్టం చేకూరుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన రఘురామ కృష్ణంరాజు అదే గుర్తుకు చెందిన పార్టీపై రాష్ట్ర పతికి, హోంమంత్రికి ఫిర్యాదు చేయాలనుకోవడం సాహసమే. ఎందుకంటే తనను పార్టీ ఏమీ చేయలేదనే ధైర్యం.

ఫిర్యాదులు చేసినంత మాత్రాన….

ఇప్పటికి కేవలం జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అవుతుంది. మరో మూడేళ్ల పాటు అధికారంలో ఉండాలి. రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటే మిగిలిన నేతలకు కూడా పార్టీ పట్ల, అధినాయకత్వం పట్ల చులకనగా మారే అవకాశముంది. నిజానికి రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో ఫిర్యాదులు చేయడం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఫిర్యాదుల మూలంగా జరిగే నష్టమూ ఏమీ లేదు.

వ్యక్తిగత బలం కూడా…..

దీంతో పాటు రఘురామ కృష్ణంరాజు వ్యక్తిగత బలం కూడా పెద్దగా లేదు. ఆయన ప్రాతినిధ్యం వహించే నర్సాపురం మున్సిపాలిటీనే వైసీపీ గెలుచుకుంది. నిజానికి రఘురామ కృష్ణంరాజు సొంత బలం ఉంటే వైసీపీకి అంతటి విజయం లభించేది కాదు. గత ఏడాదిన్నర నుంచి ఆయన నియోజకవర్గానికే రావడం లేదు. అలా బలమైన నేత కాదని ఉపేక్షించినా జగన్ పార్టీ నేతల్లో చులకన అవుతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద జగన్ త్వరగా రఘురామ కృష్ణంరాజు పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటేనే బెటర్ అన్న కామెంట్స్ ఫ్యాన్ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News