ఈయనకు ముహూర్తమే త‌రువాయి? రాజు గారికి రెడీ చేశారట

రాజ‌కీయాల్లో దూకుడు ఉండాలి. కానీ, అది పార్టీకి, సొంత పార్టీ ప్రభుత్వానికి చేటు చేసేలా ఉండ‌రాద‌నేది వాస్తవం. ఏం మాట్లాడినా సంచ‌ల‌నంగా ఉండాల‌ని దూకుడు ప్రద‌ర్శిస్తే.. ఎవ‌రికైనా [more]

Update: 2020-05-26 14:30 GMT

రాజ‌కీయాల్లో దూకుడు ఉండాలి. కానీ, అది పార్టీకి, సొంత పార్టీ ప్రభుత్వానికి చేటు చేసేలా ఉండ‌రాద‌నేది వాస్తవం. ఏం మాట్లాడినా సంచ‌ల‌నంగా ఉండాల‌ని దూకుడు ప్రద‌ర్శిస్తే.. ఎవ‌రికైనా అలాంటి దూకుడు చేటు చేస్తుందే త‌ప్ప.. మంచి కాదు. ఇప్పుడు ఇదే విష‌యం వైసీపీలో చ‌ర్చకు వ‌చ్చింది. రెండు పార్టీలు మారి.. ఎక్కడా కుదురుగా ఉండ‌లేక‌.. చివ‌రికి వైసీపీ తీర్థం పుచ్చుకుని.. జ‌గ‌న్ సునామీలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీగా విజ‌యం సాధించారు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగానే కాకుండా.. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయకుడు, వైఎస్ ఆత్మగా పేరున్న కేవీపీ రామ‌చంద్రరావు వియ్యంకుడుగా కూడా పేరున్న నాయ‌కుడు.

పార్టీని ఇబ్బందుల్లో పెడుతూ….

అయితే, ఎంత ప‌లుకుబ‌డి ఉన్నా.. త‌న‌కు ఎంత‌మంది తెలిసినా.. రాజ‌కీయాల్లో త‌న‌కు గుర్తింపు ఇచ్చి, ఎంపీగా గెలిచేందుకు అవ‌కాశం ఇచ్చిన సొంత పార్టీ. అమ్మలాంటి పార్టీ వైసీపీని బ‌జారున ప‌డేస్తున్నార‌నే వాద‌న ర‌ఘురామ‌ కృష్ణంరాజు చుట్టూ చ‌క్కర్లు కొడుతోంది. ఎంపీగా ఆయ‌న గెలిచి ఏడాది పూర్తయింది. ఇన్నాళ్లలో ఏనాడైనా.. అభివృద్ది కార్యక్రమాల పేరుతో ఆయ‌న మీడియాలో ఉన్నది లేదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యల ‌తోనే మీడియాలో నిలిచారు. అది కూడా సొంత పార్టీ వైసీపీపైన‌.. సీఎం జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయ‌డంలో ఆయ‌న దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల‌పైనా.. త‌న వ్యక్తిగ‌త అభిప్రాయం అంటూ.. విమ‌ర్శలు చేసి పార్టీని, జ‌గ‌న్‌ను కూడా ర‌ఘురామ‌ కృష్ణంరాజు ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.

మ్యానిఫేస్టో పైన కూడా…

నిజానికి అంద‌రికీ వ్యక్తిగ‌త అభిప్రాయాలు ఉంటాయి. అలాగ‌ని అన్నం పెట్టిన పార్టీని న‌డిబ‌జారుకు ఈడ్చేలా వ్యాఖ్యానించ‌డ‌మేనా? వ్యక్తిగ‌త అభిప్రాయం అంటే? అనేది ప్రశ్న. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఎంతో కీల‌కంగా.. బైబిల్‌, భ‌గ‌వ‌ద్గీత‌, ఖురాన్ అని పేర్కొనే మేనిఫెస్టోను కూడా అవ‌మాన‌క‌రంగా వ్యాఖ్యానించార‌ని ర‌ఘురామ‌ కృష్ణంరాజుపై వైసీపీ నేత‌లు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో విడ‌త‌ల వారీగా మ‌ద్య నిషేధం.. అమ‌లు చేస్తామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అంటే 2024 నాటికి సంపూర్ణంగా మ‌ద్య నిషేధం చేసి తీరుతామ‌ని జ‌గ‌న్ చెప్పారు. అదే స‌మ‌యంలో ధ‌ర‌లు పెంచుతామ‌ని షాక్ కొట్టేలా ఉంటాయ‌ని కూడా జ‌గ‌న్ మేనిఫెస్టోలోనే పేర్కొన్నారు.

రంగు మార్చాలనేనా?

అయితే, ఇప్పుడు దీనిపై త‌న సొంత అభిప్రాయం అంటూ గ‌ళం విప్పిన ర‌ఘురామ‌ కృష్ణంరాజు తూచ్‌! ఇలా చేయ‌డం వ‌ల్ల మందుబాబులు లైన్‌లోకి రార‌ని అస‌లు ఈ నిర్ణయ‌మే త‌ప్పన్నట్టుగా మాట్లాడిన ఆయ‌న ఇది త‌న అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు. మ‌రి ఆనాడు మేనిఫెస్టోలో త‌ప్పు పెట్టి ఉంటే.. ఇదే మేనిఫెస్టోను ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లి ఓట్లు ఎలా వేయించుకున్నారో గౌర‌వ‌నీ యులైన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్యక్తిగ‌తంగానే సెల‌వివ్వాల్సి ఉంటుంద‌ని నిల‌దీస్తున్నారు వైసీపీ నాయ‌కులు. ఎంపీగా గెలిచి ఏడాది కూడా పూర్తి కాకుండానే రంగులు మార్చాల‌ని ప్రయ‌త్నిస్తున్నారా? అంటూ. ఆయ‌న‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు.

బ్రేకులు తప్పవంటూ….

అటు స్థానికంగా న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సైతం ఆయ‌న‌కు ప్రయార్టీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌కు కూడా అధిష్టానుం నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ట‌. ఇక నేరుగా బీజేపీ అధిష్టానంతో పాత ప‌రిచ‌యాల నేప‌థ్యంలో సంబంధాలు పెట్టుకుంటోన్న ర‌ఘురామ‌ కృష్ణంరాజు వాటిని త‌న వ్యాపార అవ‌స‌రాల‌కు వాడుకుంటున్నార‌న్న టాక్ కూడా వైసీపీ వ‌ర్గాల్లో ఉంది. మొత్తానికి ఈయ‌న‌ దూకుడుకు జ‌గ‌న్ స‌రైన విధంగా స‌డెన్ బ్రేకులు వేస్తారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News