జగన్ బెయిల్ వెనక ఇంత కధ నడిచిందా?

వెనకటికి పరిటాల రవి ని హత్య చేసిన మొద్దు శ్రీను ఇదంతా ఎందుకు చేశావూ అంటే బావ కళ్లలో ఆనందం చూడాలని తాపీగా చెప్పాడు. ఆ తరువాత [more]

Update: 2021-04-29 06:30 GMT

వెనకటికి పరిటాల రవి ని హత్య చేసిన మొద్దు శ్రీను ఇదంతా ఎందుకు చేశావూ అంటే బావ కళ్లలో ఆనందం చూడాలని తాపీగా చెప్పాడు. ఆ తరువాత ఆ డైలాగు బాగా పాపులర్ అయిపోయి సినిమాల్లోనూ తెగ వాడేశారు. సరే ఇపుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మొత్తానికి ఏపీ సీఎం జగన్ కి సీబీఐ నుంచి నోటీసులు ఇప్పించగలిగారు. ఆ విధంగా చేసి ఆయన ఎవరి కళ్లలో ఆనందం చూడాలనుకున్నారో లేక తన కళ్ళకే కొత్తానందం తెచ్చుకున్నారో తెలియదు కానీ జగన్ మీద పై చేయి మాత్రం సాధించారు.

నానుతున్నదే …?

జగన్ కు మళ్లీ జైలూ, బెయిల్ రద్దూ అన్నది గత కొంతకాలంగా నానుతూనే ఉంది. అయితే పరిస్థితులు కూడా అనుకూలించాలిగా. ఇపుడు వైరి పక్షానికి కలసివచ్చాయని భావిస్తున్నారేమో కానీ ఎక్కడ లేని హుషార్ రఘురామ కృష్ణంరాజు లో కనిపిస్తోంది. జగనూ ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ గట్టిగానే కేకలేస్తున్నారు. రచ్చ బండ పేరిట వైసీపీని నానా మాటలు అంటున్నారు. ఆయన ధీమా అంతటికీ కారణాలు తెర వెనక వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు ఎవరి ఊహలకు వారికే వదిలేసినా ఒంటి కొమ్ము ఎంపీగా వైసీపీని ధిక్కరించి జగన్ కి ఎదురు నిలిచి గత ఏడాది కాలంగా రఘురామ కృష్ణంరాజు బాగా పాపులర్ అయిపోయారు. అంతే కాదు జగన్ ఆయన్ని మాజీ ఎంపీ చేయాలనుకున్నారు. కానీ ఇపుడు ఆయనే జగన్ని మాజీ సీఎం చేయాలని చూస్తున్నారు. అది కదా మ్యాటర్.

ఇబ్బందే సుమా…?

జగన్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అన్నది ఇపుడు ఏపీలో హాట్ టాపిక్. ఇంతకాలం లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు. తిరుపతి ఎవరి పరం అవుతుంది ఇవే చర్చగా ఉండేవి. కానీ ఇపుడు మాత్రం జగన్ డేంజర్ లో పడ్డారని ఒక సెక్షన్ మీడియా అదే పనిగా కధనాలు ప్రచారం మొదలెట్టేసింది. అదే సమయంలో జగన్ బెయిల్ రద్దు అవడం ఖాయమని కూడా కొందరు న్యాయ నిపుణులతో కూడా చెప్పిస్తున్నారు. ఇక రఘురామ కృష్ణంరాజు ఉత్సాహం ఏ రేంజిలో ఉంది అంటే ఈ కోర్టు కాకపోతే పై కోర్టు మొత్తానికి నా న్యాయ పోరాటం ఆగదు, జగన్ జైలుకు వెళ్లాలి. అపుడే నేను మా వూరు నర్సాపురం వెళ్తాను అంటూ గట్టి శపధాలే చేస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట జగన్ బెయిల్ రద్దు అవుతుంది అన్న మాట అయితే వినిపిస్తోంది.

దీని భావమేమి…?

ఇదిలా ఉంటే విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు జగన్ వచ్చే మూడేళ్ళూ పూర్తిగా ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటాడని తాను అనుకోవడంలేదన్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి ఆయన అలాగా అంటే కనుక కాస్తా ఆలోచించాల్సిందే. ఇక్కడ కాస్ట్ ఫీలింగ్ కాదు కానీ ఈయనా రాజే. రఘురామ కృష్ణంరాజు రాజే. ఇద్దరూ ఒకే భావనతో ఉండడమే రాజకీయ విశేషం. మరో వైపు బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ డియోధర్ తిరుపతి ఎన్నికల వేళ నోరు జారేసి జగన్ బెయిల్ రద్దు అవుతుందనేశారు. ఇక రఘురామ కృష్ణంరాజు అదే బీజేపీతో బాగా అంటకాగుతారు అన్న ప్రచారమూ ఉంది. మొత్తానికి చూస్తూంటే జగన్ బెయిల్ కధ వెనక చాలానే ఉన్నట్లుంది అని ఆ మాత్రం రాజకీయం తెలిసిన వారికి అర్ధమయ్యే విషయం. ఏది ఏమైనా రెబెల్ ఎంపీ విషయంలో జగన్ ఇంతకాలం ఏమీ చేయకపోవడం వల్లనే ఇలా జరిగింది అన్న వారే ఇపుడు వైసీపీలో ఉన్నారట. అదే మాట మరోలా చెప్పుకుంటే జగన్ రాజు విషయంలో ఫెయిల్ అయ్యారనేగా అర్ధం.

Tags:    

Similar News