బుద్ధి.. బుర్ర ..బ్యాలెన్స్ కష్టమే..?

ఒకరికి బుద్ధి లేదు. మరొకరికి బుర్ర లేదన్నట్గుగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. స్వపక్షంలో విపక్షంగా తలపోటుగా మారిన రఘురామకృష్ణంరాజు ఉదంతం విషమంగా మారింది. సరైన రీతిలో హ్యాండిల్ [more]

Update: 2021-05-17 08:00 GMT

ఒకరికి బుద్ధి లేదు. మరొకరికి బుర్ర లేదన్నట్గుగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. స్వపక్షంలో విపక్షంగా తలపోటుగా మారిన రఘురామకృష్ణంరాజు ఉదంతం విషమంగా మారింది. సరైన రీతిలో హ్యాండిల్ చేయలేకపోవడంతో న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి చిక్కులు ఎదురయ్యే వాతావరణం ఏర్పడింది. రాజకీయ అంశాలను రాజకీయంగా పరిష్కరించగలిగితేనే మేలు. పోలీసు చర్యల ద్వారా ప్రతీకారానికి పూనుకుంటే సీన్ రివర్స్ అవుతుంది. అందులోనూ మన రక్షక భటులు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలే తప్ప అందులోని యుక్తాయుక్త విచక్షణను అర్థం చేసుకునేంత తీరిక వారికి ఉండదు. వైఎస్ ఆర్ కాంగ్రెసు పార్టీ తరఫున ఎన్నికై ఆ పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్న రఘురామకృష్ణంరాజు నైతికంగా ఆ పదవికి అనర్హుడు. చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేసి కూడా వైసీపీ విఫలమైంది. మరోరకంగా చెప్పాలంటే బీజేపీ సహకరించలేదు. దాంతో రఘురామకృష్ణంరాజు రెచ్చిపోవడం మొదలు పెట్టారు. ప్రభుత్వాన్ని బాగా రెచ్చగొట్టారు. కేవలం వైసీపీ జెండా ఆధారంగానే నెగ్గిన ఆయనకు ప్రజల్లో పలుకుబడి లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గే సత్తా కూడా అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లో అతని అరెస్టు విస్తృత ప్రచారానికి దారి తీసింది. విపక్షాల విమర్శలకు మరో అంశాన్ని చేర్చింది.

కోరుకున్న వరం…

రఘురామకృష్ణంరాజు బీజేపీ అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. పార్టీతో సంబంధం లేకుండా ఇండివిడ్యువాలిటీ మెయింటెయిన్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఎంపీగా ఎన్నికైన తొలి ఆరునెలల్లోనే అతని వ్యవహారశైలిలో ఈ స్పష్టమైన మార్పు కనిపించింది. గతంలో పార్టీతో విభేదించి వెళ్లిపోయినా మళ్లీ చేరిన వెంటనే టిక్కెట్ ఇచ్చి జగన్ ఆదరించారు. లోక్ సభా పక్షం నాయకత్వం లేదా కీలకమైన స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ వంటి హోదాలు రఘురామకృష్ణంరాజు కోరుకున్నారు. కనీసం విప్ స్థాయినైనా తనకు కట్టబెడతారని ఆశించారు. అవేమీ నెరవేరకపోవడంతో క్రమేపీ అసమ్మతిని అలవాటు చేసుకున్నారు. అవసరం లేని అసమ్మతి అది. అధిష్ఠానంతో అనవసరమైన వివాదం. విజయసాయి రెడ్డితోనూ విభేదించారు. జగన్ మోహన్ రెడ్డి తనను పిలిచి మాట్టాడతారని ఆశించారు. అవేమీ జరగకపోవడంతో ముందు విజయసాయిరెడ్డిపై విమర్శలతో మొదలు పెట్టి క్రమేపీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అతనిని ఎంపీ సభ్యత్వం నుంచి తప్పించాలని మిగిలిన వైసీపీ ఎంపీలందరూ వెళ్లి ఫిర్యాదు చేసినా స్పీకర్ కనికరించలేదు. పైపెచ్చు కేంద్ర్రప్రభుత్వం రఘురామకృష్ణంరాజు కు అదనపు సెక్యూరిటీ కల్పించింది. ఇదంతా తన కున్న పలుకుబడికి నిదర్శనంగా భావించి శ్రుతి మించిన విమర్శలతో అరెస్టు వరకూ తెచ్చుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమని కొందరు అంటున్నారు. కావాలనే ఇంతవరకూ లాగారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

ఉదాసీనతే ఉపద్రవం..

నిజానికి రఘురామకృష్ణంరాజు విషయంలో జగన్ మోహన్ రెడ్డి తొలి దశలో జోక్యం చేసుకుని ఉంటే పరిస్తితి చక్కబడి ఉండేది. ఎంపీలు ఫిర్యాదు చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూడకుండా పార్టీ నుంచి బహిష్కరించినా సరిపోయేది. దానివల్ల పార్టీ ప్రతిష్టకు నష్టం వాటిల్లేది కాదు. అసమ్మతి స్వరాలకు కఠినమైన హెచ్చరిక పంపినట్లు ఉండేది. కానీ రఘురామకృష్ణంరాజు ను ఇంతకాలం ఉపేక్షించడమే నష్టం కలిగిచింది. రాజకీయంగా ప్రభుత్వానికి, పార్టీకి ఆయన పెద్ద ఎత్తున డ్యామేజ్ చేశారు. సోషల్ మీడియాలో ఎంపీ ప్రకటనలకు లభిస్తున్న ఆదరణ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒకసారి పార్టీ నుంచి బహిష్కరిస్తే విమర్శల్లో పదును తగ్గిపోతుంది. ప్రతిపక్షంలోని వంద గొంతుల్లో ఒక గొంతుగా మారిపోయి ఉండేవారు సదరు ఎంపీ. రఘురామకృష్ణంరాజు మాస్ లీడర్ కాదు. ఇమేజ్ పరంగానూ చెప్పుకోదగిన వ్యక్తి కాదు. అరెస్టుతోనే అతని రాజకీయ జీవితానికి కొత్త జీవం పోసినట్లయింది.

పరిధులు..పరిమితులు..

రాజకీయ అంశాల్లో పోలీసు చర్యలు ఎప్పుడూ సత్ఫలితాలను ఇచ్చిన దాఖలాలు లేవు. పోలీసులు ఏమాత్రం వర్తించని అడ్డగోలు చట్టాలతో కేసులు నమోదు చేస్తుంటారు. న్యాయస్థానాల్లో చాలా వరకూ కేసులు వీగిపోతుంటాయి. ప్రభుత్వానికే ఇది పరువు నష్టం రఘురామకృష్ణంరాజు విమర్శలకంటే న్యాయస్థానంలో ఎదురయ్యే భంగపాటు మరింతగా విమర్శల పాలు చేస్తుంది. అతనిపై నమోదు చేసిన కేసులతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిందని నిరూపించడం కష్టం. ఈ స్థితిలో ఎవరు డిఫెన్స్ లో ఉన్నారు? ఎవరు అఫెన్స్ లో ఉన్నారనేది చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజు ట్రాప్ వేసి తనపై కేసు నమోదు అయ్యేలా చూసుకున్నారా? లేక పో్లీసులే ట్రాప్ వేశారా? అన్నది సందిగ్ధంగా కనిపిస్తోంది. తాను ప్రభుత్వ బాధితునిగా ప్రజల ముందు నిలవాలన్న అతని లక్ష్యం మాత్రం నెరవేరింది. అందుకోసమే చివరి వరకూ లాగుతూ వచ్చారు. ఈ అంశంలో ఎవరి ప్రయోజనాలు ఏమిటనే విషయాన్ని పక్కన పెడితే మరికొంతకాలం రఘురామకృష్ణంరాజు పొలిటికల్ గా లైమ్ లైట్ లో ఉండటానికి ఆస్కారం ఏర్పడింది. తరచూ న్యాయస్థానాల ద్వారా తలంటించుకోవడం ప్రభుత్వానికి చికాకే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News