ఇంతకీ దెబ్బ తగిలింది ఎవరికి… ?

ఏపీలో తెగ ఉత్కంఠను కలిగించే అంకానికి తాత్కాలికంగా తెర పడింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిల్ మంజూరు అయింది. దాంతో ఆయన ఫ్రైడే కష్టం [more]

Update: 2021-05-22 06:30 GMT

ఏపీలో తెగ ఉత్కంఠను కలిగించే అంకానికి తాత్కాలికంగా తెర పడింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిల్ మంజూరు అయింది. దాంతో ఆయన ఫ్రైడే కష్టం అలా వారానికే తీరిపోయింది. ఇంతకీ రఘురామను ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది మాత్రం జనాలకే కాదు సీఐడీకి కూడా గుర్తు ఉండనంతగా అనేక పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అలా రఘురాముడు కాలికి గాయం చాలా మందిని బాధపెట్టి చివరికి రెబెల్ ఎంపీగారికి రెస్ట్ ఇచ్చింది. దెబ్బ రఘురామకృష్ణం రాజుకు తగిలితే నొప్పి ఇన్నాళ్ళూ విపక్షం భరించింది. ఇపుడు బెయిల్ మంజూరు కావడంతో జగన్ సర్కార్ బాధగా మూలుగుతోంది.

అతి తోనే అలా…?

చేతిలో అధికారం ఉంది కదా అని దూకుడు చేస్తామంటే కుదరదు అని రెండేళ్ళుగా అనేక పరిణామాలు నిరూపించాయి. రఘురామకృష్ణం రాజు విషయంలో ఏడాది అంతా ఊరుకోవడమే పెద్ద తప్పు. ఈ రోజు చేసే అరెస్ట్ ఏదో ఆయన మొదట తిరగబడినపుడే చేసి ఉంటే అన్ని రకాలుగా పరువు నిలబడేది అన్న కామెంట్స్ వస్తున్నాయి. తీరా ఇపుడు ఆయన అనాల్సినవి అన్నీ అనేశాక యూ ఆర్ అండర్ అరెస్ట్ అంటే ఓకే అంటూ వెనకాలే వచ్చేసే రకం కాదు కదా. పైగా ఆయన పుట్టిన రోజు వేళ కెలికి అక్కడే అతి చేశారు. దాంతో అరెస్ట్ కంటే ఆ కక్ష సాధింపు జనంలోకి వెళ్ళిపోయింది. ఇక రఘురామకృష్ణం రాజును జైలులో ఒక రాత్రి విచారించారు అన్న ప్రచారానికి తోడు కాలు నొప్పి వైనం కూడా మొత్తం సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసి పారేసింది.

అదే రిలీఫ్ :

తెల్లారిలేస్తే రచ్చ బండ పేరిట ఢిల్లీ నుంచి లైవ్ టెలి కాస్ట్ లో అనుకూల మీడియా ద్వారా వైసీపీ సర్కార్ మీద విరుచుకుపడే రఘురామకృష్ణం రాజు నోటికి ఒక విధంగా తాళం పడినట్లు అయింది. ఆయన్ని మీడియా వద్దకు పోవద్దని ఆదేశం జారీ చేయడం వెనక ఆయన ఏడాది కాలంగా చేసిన విచిత్ర విన్యాసాలు అత్యున్నత న్యాయస్థానం దృష్టిలో ఉన్నాయని అర్ధమవుతోంది. అంటే మళ్ళీ మీసం మీద చేయి వేసి మీడియా ముందు సై అంటూ రాజు చేయాలనుకున్న అసలు కుదరదు అని సుప్రీం కోర్టు ఆర్డర్ చెప్పేసింది. ఇది ఒక విధంగా వైసీపీ సర్కార్ కి బిగ్ రిలీఫ్ గా భావించాలి. ఆ కండిషన్ కనుక పెట్టకపోతే ఈపాటికి అనుకూల మీడియాలో రఘురామకృష్ణం రాజు ఆయనను వెనకేసుకువచ్చే విపక్షం వీరంగాలు చూడలేక వైసీపీ పెద్దలు ఎంతలా మధనపడాల్సిఉండేదో.

బ్యాలన్స్ తప్పేస్తే …?

నేరానికి శిక్ష ఎపుడూ కొత్త వివాదానికి దారి తీయకూడదు. రఘురామకృష్ణం రాజు అసభ్య పదజాలం మీద సభ్య సమాజానికి వేరే అభిప్రాయం ఏదీ లేదు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే విమర్శించే తీరు అది కాదని కూడా అనేవారే మెజారిటీ ఉంటారు. అయితే ఆయన్ని సరైన తీరులో శిక్షించకుండా దూకుడుగా పోవడం వల్లనే సింపతీని కోరి ఆయనకు ఇచ్చినట్లు అయింది. అలాగే ఈ ఎపిసోడ్ లో ఏమీ చేయలేకపోయారు అన్న విమర్శలు కూడా ప్రభుత్వ పెద్దలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రఘురామకృష్ణం రాజు మీద బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు అన్న అభియోగాలు ఉన్నాయి. సీబీఐ కేసు కూడా ఉంది. ఇక ఆయన వాచాలత్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. మరి ఇవన్నీ ఎక్కడా చర్చకు రాకుండా పోయాయి అంటే ఆయన కంటే తెంపరితనంతో ఇటు వైపు వ్యవహరించారు అన్నదే కదా పాయింట్. మొత్తానికి ఇలా నేలబారుడు వ్యూహాలతో ఆపరేషన్లు చేపడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నో డౌట్.

Tags:    

Similar News