యాదవ్ అయితే అలా… రాజు అయితే ఇలానా?

వడ్డించే వాడు మనవాడైతే… చివరి బంతిలో కూర్చున్నా.. అన్న సామెత రాజకీయాలకు అక్షరాలా సరిపోతుంది. తమకు అనుకూలమైతే వెంటనే చర్యలు తీసుకుంటారు. నీతులు ఎదుటి వాళ్లకు చెప్పేందుకే. [more]

Update: 2021-06-18 00:30 GMT

వడ్డించే వాడు మనవాడైతే… చివరి బంతిలో కూర్చున్నా.. అన్న సామెత రాజకీయాలకు అక్షరాలా సరిపోతుంది. తమకు అనుకూలమైతే వెంటనే చర్యలు తీసుకుంటారు. నీతులు ఎదుటి వాళ్లకు చెప్పేందుకే. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పెద్దలు సయితం వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. తమకు అనుకూలమైతే ఒక న్యాయం, వ్యతిరేకతమైతే మరొక న్యాయాన్ని అమలు చేస్తున్నారు.

శరద్ యాదవ్ ను…?

కొద్దికాలం క్రితం జేడీయూ అధినేత శరద్ యాదవ్ ను చూశాం. ఆయన జేడీయూకు వ్యతిరేకంగా ఒక సభలో మాట్లాడారని రాజ్యసభ నుంచి ఆయన తొలగించారు. జేడీయూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గంటల్లోనే నిర్ణయం తీసుకున్నారు. శరద్ యాదవ్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఆయనను సభ నుంచి బయటకు పంపారు. మరి రఘురామకృష‌్ణం రాజు విషయంలో మాత్రం నానుస్తూ ఉన్నారు.

ఆయనతో పోల్చుకుంటే…?

రఘురామకృష‌్ణం రాజుతో పోల్చుకుంటే శరద్ యాదవ్ చేసిన కామెంట్స్ చాలా తక్కువ. రఘురామకృష‌్ణం రాజు నిత్యం రచ్చ బండ పేరుతో సొంత పార్టీ పైనా, ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. దీంతో పాటు తనకు టిక్కెట్ ఇచ్చిన పార్టీ అధినేత బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఇక ఇటీవల పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, నిందితులకు పరిహారం, పునరావాసం పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని నేరుగా జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఫిర్యాదు చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా….?

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న రఘురామకృష‌్ణం రాజు విషయంలో కేంద్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. రఘురామకృష‌్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు ఎప్పుడో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దాదాపు ఏడాది నుంచి దానిని స్పీకర్ పెండింగ్ లో పెట్టారు. పైగా రఘురామకృష‌్ణం రాజు కు కేంద్రమంత్రుల నుంచి స్పీకర్ వరకూ అపాయింట్ మెంట్లు ఇస్తూ తమ వైఖరిని చెప్పకనే చెబుతున్నారు. అదే శరద్ యాదవ్ విషయంలో రోజుల్లోనే తీసుకున్న నిర్ణయం రఘురామకృష‌్ణం రాజు విషయంలో ఎందుకు అమలు జరగడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద రఘురామకృష‌్ణం రాజు విషయంలో బీజేపీ సానుకూలంగా ఉందనడానికి ఇదే ఉదాహరణ.

Tags:    

Similar News