ఈయన విష‌యంలో టీడీపీ అతి చేస్తోందా..?

ఔను.. రాజ‌కీయ వ‌ర్గాల్లో.. ఈ చ‌ర్చ జోరుగా వినిపిస్తోంది. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ర‌ఘురామ‌కృష్ణంరాజుకు.. ఆ పార్టీకి మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి పెరిగి.. వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. [more]

Update: 2021-06-28 15:30 GMT

ఔను.. రాజ‌కీయ వ‌ర్గాల్లో.. ఈ చ‌ర్చ జోరుగా వినిపిస్తోంది. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ర‌ఘురామ‌కృష్ణంరాజుకు.. ఆ పార్టీకి మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి పెరిగి.. వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ప్రధాన ప్రతిప‌క్షంగా ఎంత వ‌ర‌కు టీడీపీ ఈ విష‌యంలో వ్యవ‌హ‌రిస్తే మంచిదో అంత‌వ‌ర‌కు కాకుండా.. అతి చేస్తోంద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఈ విధానంతో టీడీపీ త‌నకు తానే.. విమ‌ర్శల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఏపీ హిస్టరీలో ఒక పార్టీ నుంచి గెలిచిన ఎంపీకి, అదే పార్టీతో విభేదాలు రావ‌డం అనేది చాలా అరుదు.

ఓవర్ చేశారని….

పైగా ఈ రేంజ్‌లో వివాదాలు ఎప్పుడూ జ‌ర‌గలేదు. అయితే.. ఈ విష‌యంలో ఉన్న ట్విస్ట్‌.. ఆ పార్టీ.. ర‌ఘురామ‌కృష్ణంరాజుని పార్టీ నుంచి బ‌హిష్క రించ‌లేదు. ఆయ‌న కూడా పార్టీకి రిజైన్ చేయ‌లేదు. అలాంటి స‌మయంలో టీడీపీ ఎలాంటి పాత్ర పోషించాల‌నేది ప్రధాన అంశం. కొన్ని విష‌యాల్లో అంటే.. ఇటీవ‌ల సీఐడీ పోలీసులు వ్యవ‌హ‌రించార‌ని వ‌స్తున్న విష‌యంపై స్పందించ‌డం వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, దానికి మించి వ్యవ‌హ‌రించ‌డం ఏమేర‌కు స‌బ‌బు అనేది ప్రధాన విమ‌ర్శ. ర‌ఘురామ‌కృష్ణంరాజు వ‌ర్సెస్ వైసీపీ విష‌యంలో చంద్రబాబే కాదు.. టీడీపీ నేత‌లు కూడా మ‌రీ ఓవ‌ర్ చేశార‌న్న టాకే ఉంది.

జోక్యంతో ఏం సాధించారు?

ఫార్టీ ఇయ‌ర్స్ రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొనే చంద్రబాబు.. ఇలా వ్యవ‌హ‌రించ‌డం స‌రిగాలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా.. టీడీపీలోనే అసంతృప్త నేత‌లు ఉన్నారు. వీరిని లైన్‌లో పెట్టుకోవాల్సిన చంద్రబాబు ఇలా వ్యవ‌హ‌రించ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఏదైనా ఉంటే.. ఆ పార్టీ,ర‌ఘురామ‌కృష్ణంరాజు తేల్చుకుంటారు. లేదా.. వీరి మ‌ధ్య స‌యోధ్య కుదిరినా కుదిరే అవ‌కాశం ఉంద‌ని.. ఢిల్లీ స్థాయిలో ఇది కూడా జ‌రుగుతోంద‌ని.. తెలుస్తున్నప్పుడు.. వీరి విష‌యంలో చంద్రబాబు జోక్యం చేసుకుని.. త‌న ఎంపీల ద్వారా.. మంత్రాంగం న‌డిపించ‌డంపై స‌ర్వత్రా విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

హుందాతనంతో…?

మున్ముందు.. ఏం జ‌రుగుతుంద‌నేది తెలియ‌న‌ప్పుడు ఒక సీనియ‌ర్‌గా చూస్తూ ఉండాలే త‌ప్ప.. స‌ర్వత్రా తానే అయిపోవ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో బీజేపీ, క‌మ్యూనిస్టులు అనుస‌రిస్తున్న వైఖ‌రి బాగుంద‌నే వాద‌న కూడా వినిపిస్తున్న స‌మ‌యంలో బాబు కూడా ర‌ఘురామ‌కృష్ణంరాజు విషయంలో హుందాగా వ్యవ‌హ‌రించి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. కానీ ఆయ‌న అత్యుత్సాహంతో ఈ విష‌యంలో వ్యవ‌హ‌రిస్తోన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది.

Tags:    

Similar News