ఇంతకీ సక్సెస్ రేటు ఎంతంటే?
ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్వవహారం ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తలపోటుగా మారింది. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగానే తన పార్టీ అధినేతపై [more]
ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్వవహారం ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తలపోటుగా మారింది. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగానే తన పార్టీ అధినేతపై [more]
ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్వవహారం ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తలపోటుగా మారింది. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగానే తన పార్టీ అధినేతపై రఘురామ పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నారు. నిరంతరం విసిగించడమే కాదు, న్యాయపరంగా, చట్టపరంగా, పాలనపరంగా సవాల్ విసురుతున్నారు. అంతిమంగా ఆయన సాధించిందేమీ ఉండకపోవచ్చు. కానీ నిరంతరం ముఖ్యమంత్రిని చికాకు పరుస్తూ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ , ప్రజల్లో పలచన చేయడమే లక్ష్యం. ఈ మేరకు కొంతవరకూ సక్సెస్ సాధించాడనే చెప్పాలి. రఘురామకృష్ణరాజు పేరు చెబితే వైసీపీ వర్గాలు ఉలిక్కిపడుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో ఆయన చక్రం తిప్పుతున్నారు. మిగిలిన పార్టీ ఎంపీలు నిస్సహాయంగా చేతులెత్తేశారు. తొలి దశలో విరుచుకుపడిన మంత్రులు మౌనం దాల్చారు. మొత్తమ్మీద మొదటి ఘట్టంలో ప్రభుత్వంపై చేయి సాధించాడు. సుప్రీం కోర్టు తనపై విధించిన ఆంక్షలను సైతం తనకు అనుకూలంగా మలచుకుని మరీ చెలరేగిపోతున్నాడాయన. అవే ఆంక్షలు ఇప్పుడు ప్రభుత్వానికి ముందరికాళ్లకు బంధం వేశాయి.ఈ అసహాయతను ఆసరాగా చేసుకంటూ, ప్రభుత్వాన్ని, ఎంపీలను, వైసీపీ నాయకులను కావాలని రెచ్చగొడుతున్నాడు రఘురామకృష్ణరాజు.
ప్రభుత్వపరంగా…
వైఎస్పార్ కాంగ్రెసు పార్టీ అదికారంలోకి రావడానికి ప్రజలకు అనేక రకాలు వాగ్దానాలు చేసింది. అందులో నవరత్నాల పేరిట చాలా వరకూ అమలు చేసింది. కానీ ఆచరణలోకి తేవడంలో ఆర్థికంగా సాద్యం కానివి చాలా ఉన్నాయి. మద్యనిషేధం, ఉద్యోగ ఖాళీల భర్తీ వంటివి ఇందుకు పెద్ద ఉదాహరణలు. మద్యనిషేధం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానా వెలవెల బోతుంది. కనీసం జీతాలకు కూడా డబ్బులు లేక ప్రభుత్వం పడకేస్తుంది. సంక్షేమ పథకాలకు చాప చుట్టేయాలి. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్షా పాతికవేల వరకూ ఖాళీ లుంటాయని అంచనా. అవన్నీ పూర్తి స్థాయి ఉద్యోగులతో భర్తీ చేస్తే ఏటా అియిదు వేల కోట్ల రూపాయల వరకూ అదనపు బారం ప్రభుత్వంపై ఫడుతుంది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ కాలెండర్ లో ఆరులక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చూపించింది. అందులో అయిదు లక్షల పైగా ఉద్యోగాలు నామమాత్రమైనవి. దిగువస్థాయి ఉద్యోగాలే. గ్రామవాలంటీర్లు నెలవారీ అయిదువేలకు పనిచేసే స్వచ్ఛంద బృందం. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా నెలవారీ 15వేల రూపాయలే. ఇక 50 వేల ఉద్యోగులు ఆర్టీసీ లో ఇది వరకే ఉపాధి పొందుతున్నారు. వారిని ప్రభుత్వ ఖాతాలో చూపించారు. మిగిలినవి కూడా కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్ మాత్రమే ఎక్కువ. అందువల్ల ప్రభుత్వ వాదన డొల్లగా తేలిపోతోంది. ఆయా లోపాలను పట్టుకుని నిరంతరం ముఖ్యమంత్రికి లేఖలు రాయడం ద్వారా రఘురామకృష్ణరాజు వేధిస్తున్నారు. మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ఇస్తోంది. మద్యనిషేధాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ నాటి వాగ్దానాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.
న్యాయ సమరం..
తనపై మోపిన రాజద్రోహం , సీఐడీ కస్టడీలో తనపై భౌతికంగా దాడి చేశారనే కేసులను సుప్రీం కోర్టుకు తీసుకెళ్లారు రఘురామకృష్ణరాజు. ఒకవేళ పోలీసుల అనుచిత ప్రవర్తన, అక్రమ కేసు రుజువైతే ప్రభుత్వానికి తీవ్రంగానే మందలింపులు తప్పవు. బాధ్యులపై సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవచ్చు. కేసు తేలేవరకూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. పరోక్షంగా ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. రఘురామ పై వారు పరుషంగా మాట్టాడకూడదు. ఒకవేళ మాట్టాడితే సుప్రీం కోర్టు దృష్టికి రఘురామకృష్ణరాజు తీసుకెళ్లవచ్చు. అది ప్రభుత్వానికి , వైసీపీకి ఇబ్బందికరం. దానిని ఆసరా చేసుకుంటూ కేసు గురించి మాట్టాడకుండా ప్రభుత్వాన్ని ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ రోడ్డుపైన నిలబెట్టాలని చూస్తున్నారు సదరు ఎంపీ. వైసీపీ ఎటూ స్పందించలేని స్థితిని కల్పిస్తోంది.
చట్ట సభల్లో…
ప్రతి పార్లమెంటు సభ్యునికి ప్రజాప్రతినిధిగా విశేషమైన రక్షణ ఉంటుంది. తనను వేధిస్తూ. అక్రమ కేసుల ద్వారా తన ప్రివిలేజెస్ కు రాష్ట్ర ప్రభుత్వం భంగం కలిగించిందని లోక్ సభ స్పీకర్ తో పాటు అన్ని పార్టీలకు రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. రానున్న సమావేశాల్లో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేందుకూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈవిషయంలో పార్టీలకు అతీతంగా ఎంపీలు రఘురామకృష్ణరాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎంపీని పోలీసులు కొట్టడమనే అంశంపై పార్లమెంటు సభ్యులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైసీపీకి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. రఘురామకృష్ణరాజు ప్రచారాన్ని కౌంటర్ చేయడమెలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వారి పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. పార్టీ నుంచి ఒకవైపు ఒత్తిడి వస్తోంది. వచ్చే సమావేశాల్లోపు ఆయన సభ్యత్వంపై వేటు వేయిస్తే మాత్రమే ఈ గండం నుంచి గట్టెక్కగలమని ఎంపీలు చెబుతున్నారు. విజయసాయి రెడ్డి వంటి వారు రఘురామకృష్ణరాజు విషయంలో సైలంట్ అయిపోయారు. బహిరంగంగా మాట్టాడకపోవడమే కాదు, మిగిలిన ఎంపీలకు ఏం చేయాలో దిశానిర్దేశం కూడా చేయలేకపోతున్నారు. ఇప్పటికే శాసన సభ తీర్మానం చేసిన మండలి రద్దును వెంటనే చేయాలని, అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ మరో ఉద్యమం మొదలు పెట్టారు ఎంపీ. నిజానికి మండలి రద్దుపై ప్రభుత్వం వెనక్కి వెళ్లిపోయింది. కానీ శాసనసభ ఆమోదించిన తీర్మానం కేంద్రం వద్ద ఉంది. ఒకవేళ వద్దని అధికారికంగా కోరాలంటే మరోసారి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపవలసి ఉంటుంది. లేకపోతే మండలి రద్దు చేయాలా? వద్దా? అన్న అంశం కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది.
అంతిమ లక్ష్యం..
ఇంత చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు సాధించేదేమిటనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రభుత్వం, పార్టీ రెండూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చుట్టూనే కేంద్రీకృతమై ఉంటాయి. ఆయనకు పోరాటం కొత్తకాదు. అనేక రకాల కేసులను ప్రతిపక్షంలో ఎదుర్కొన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా న్యాయస్తానాలు, రాజ్యాంగ వ్యవస్థలతో నేరుగానే ఢీకొట్టారు. అందువల్ల రఘురామకృష్ణరాజు వల్ల చట్టపరంగా, న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలపై జగన్ పెద్దగా పట్టించుకొనే ప్రసక్తి లేదు. కానీ ప్రజాక్షేత్రంలో తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేవిధంగా రఘురామ వెలికి తీస్తున్న అంశాలు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యమంత్రి సతీమణి వాటాదారుగా ఉన్న సరస్వతి పవర్ కు సున్నం రాయి లీజులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సీబీఐ కోర్టులో జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కేసు వేశారు. ఇవన్నీ వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డిని కించపరిచే అంశాలే. విచారణ సందర్భంగా వాదప్రతివాదనలకు విస్త్రుతంగా మీడియాలో కవరేజ్ వస్తుంది. అదే వైసీపీకి ఇరకాటంగా కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు కోరుకున్నది, కోరుకుంటున్నదీ కూడా అదే. ప్రచారం, ప్రజాక్షేత్రంలో జగన్ మోహన్ రెడ్డిపై నెగటివ్ గా అనుమానాలు, సందేహాలతో కూడిన ప్రచారం. న్యాయం ఎటువైపు మొగ్గినా ఈలోపుగానే ప్రజల్లో ముఖ్యమంత్రి పై చెడుగా ప్రచారం సాగాలని కోరుకుంటున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
-ఎడిటోరియల్ డెస్క్