వేటు నుంచి తప్పించుకున్నట్లేనా?

ఏదైనా ఒక నిర్ణయం వెలువడే ముందు దాని సంకేతాలు ముందుగానే వెలువడుతాయి. అందుకు అనుగుణంగానే చర్యలుంటాయి. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా అనర్హత [more]

Update: 2021-07-17 03:30 GMT

ఏదైనా ఒక నిర్ణయం వెలువడే ముందు దాని సంకేతాలు ముందుగానే వెలువడుతాయి. అందుకు అనుగుణంగానే చర్యలుంటాయి. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా అనర్హత వేటు నుంచి తప్పించుకున్నట్లే కనపడుతుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రఘురామ కృష్ణరాజు కు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.

ఏడాది క్రితమే…?

రఘురామ కృష్ణరాజుపై ఏడాది క్రితమే వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆయన పై అనర్హత వేటు వేయాలని కోరింది. అయినా స్పీకర్ కార్యాలయం మాత్రం పట్టించుకోలేదు. దాదాపు ఏడాది తర్వాత సాంకేతిక సమస్యను చూపి మరోసారి ఫిర్యాదు ఇవ్వాలని కోరింది. దీన్ని బట్టి రఘురామ కృష్ణరాజు వ్యవహారంలో పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆయన రెచ్చిపోతుండటానికి కూడా అదే కారణమని చెప్పాల్సి ఉంటుంది.

ఎంపీ అయిన నాటి నుంచి…

రఘురామ కృష్ణరాజు ఎంపీ అయిన తర్వాత ఆయన ఇంటికి విందుకు రాని ఎంపీలు లేరంటే అతిశయోక్తి కాదేమో. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడల్లా రఘురామ కృష్ణరాజు తన నివాసంలో విందులు ఇవ్వడం ఆనవాయితీ. రఘురామ కృష్ణరాజుకు బీజేపీతోనే కాదు ఇతర పార్టీలతోకూడా సంబంధాలున్నాయి. స్వయంగా పారిశ్రామికవేత్త కావడంతో ఆయన పరిచయాలను పెంచుకోవడానికి ఈ పదవిని ఉపయోగించుకుని ఉండవచ్చు.

బెంగాల్ ఎంపీలు ఉండటంతో…?

ఇక రఘురామ కృష్ణరాజుతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు శిశిర్ అధికారి, సునీల్ కుమార్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరి మీద కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డార్న అభియోగాలున్నాయి. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీఎంసీ ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం లేదన్నది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వారితో పాటు రఘురామ కృష్ణరాజు కూడా బయటపడిపోతారని, అనర్హత వేటు పడకుండా తప్పించుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

Tags:    

Similar News